విధులకు రాకపోయినా జీతాలు తీసుకోవచ్చు. అదేంటి విధులకు వెళ్తేనే కదా జీతం తీసుకోగలం అనుకుంటున్నారా? అయితే ఆర్టీసీ శాఖలో అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు విధులకు రాకపోయినా సరేనెల జీతం బ్యాంకుల్లో జమ అవుతోంది. ఓడీ (ఔట్ ఆఫ్ డిజిగ్నేషన్) పేరుతో విధులకు డుమ్మా కొట్టే కండక్టర్లు ఇందుకోసం ఉన్నతాధికారులకు కొంత ముట్టచెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి జిల్లాలోని తూర్పు మండలాల్లోని ఆర్టీసీ డిపోల్లో ఈ జాడ్యం విస్తరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓడీ విధానం ఆర్టీసీలోవివాదాస్పదమవుతోంది.
పుత్తూరు:ఆర్టీసీలో ఓడీ విధానం ఉన్నతాధికారులకు కాసులు కురిపిస్తోంది. సంస్థకు ఉన్న అవసరాల దృష్ట్యా సిబ్బందికి రెగ్యులర్ విధులతో పాటు ఇతర బాధ్యతలు అప్పగించే వెసులుబాటు ఉంది. ఇందుకుగాను ఓడీ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. సరిగ్గా ఈ విధానమే ఆర్టీసీలోని కొంతమంది ఉన్నతాధికారులకు అవకాశంగా మారింది. దీంతో వారు దీని పేరిట అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రత్యేకించి కొందరు కండక్టర్లకు ఓడీ పేరుతో ఇతర పనులు అప్పగిస్తూ వారి వద్ద నుంచి ముడుపులు పోగేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓడీ వేసుకున్న సిబ్బంది సొంత వ్యాపకాల్లో మునిగి తేలుతూ సంస్థకు గుదిబండగా మారుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతునా యి. నెల పూర్తయ్యే సరికి జీతాలను జేబుల్లో వేసుకుంటూ సంస్థకు నష్టం కలిగిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.
నవ్విపోదురుగాక..
ఆర్టీసీ క్యాట్ కార్డులు, బస్‌పాసులు అమ్మేం దుకు కొందరు కండక్టర్లకు ఆన్‌డ్యూటీ వేస్తారు. వీరు ఆయా డిపోల పరిధిలోని మండలాలు, గ్రామాలకు వెళ్లి క్యాట్ కార్డులను అమ్మాలి. ఈ సాకుతో వారు సొంత పనులను చేసుకుంటున్నట్లు సమచారం. వీరి పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతా ధికారులు ముడుపులకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలు స్తోంది. తిరుపతిలో మరీ దారుణంగా బస్టాండ్‌లో కాసేపు కట్టి చేతపట్టుకుని కలియతిరిగి ఇంటికి చెక్కేస్తున్నారు. మరుగుదొడ్ల శుభ్రతపై తనిఖీ డ్యూటీలు వేస్తున్నారు. పుత్తూరు డిపో పరిధిలో అయితే తమిళనాడు, ప్రైవేట్ బస్సులు ఎన్ని వెళ్తున్నాయో తెలుసుకునేందుకు కండక్టర్లకు రూట్ సర్వే పేరుతో డ్యూటీ వేస్తున్నారు. అసలే నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి వీరు ఐరావతంలా మారారనే మాటలు వినిపిస్తున్నాయి.
పాలసీ కట్టు..ఓడీ వేస్తా..
ఆర్టీసీలో కొందరు ఉన్నతాధికారులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. ఇలాంటి వారికి ఓడీ విధానం వరంలా మారింది. జిల్లాలో 14 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. అయితే తూర్పు మండలాల్లో మాత్రం ఓడీ విధానం వివాదాస్పదమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మూడు నియోజకవర్గాలకు కేంద్రమైన ఒక డిపోలోని ఉన్నతాధికారి ఏకంగా ఇన్సూరెన్స్ ఏజెంట్ అవతారమెత్తేశారు. ఔట్ ఆఫ్ డిజిగ్నేషన్ డ్యూటీ వేస్తే తన కుటుంబసభ్యుల దగ్గర ఎల్‌ఐసీ పాలసీని కొనుగోలు చేయాలనే అనధికారిక నిబంధనను విధించేశారు. దీంతో ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఆ డిపోలో అయితే ఆర్టీసీ ఉన్నతాధికారి బరితెగించిట్లు సమాచారం. ఆయన్ను అన్ని రకాలుగా ‘సంత్పప్తి’పరిచిన వారికే ఓడీలు వేస్తున్నట్లు తెలు స్తోంది. తిరుపతిలో అయితే ఓడీ విధానం వివాదాస్పదమవుతోంది. ఇక్కడ కూడా ఉన్నతాధికారులకు ‘సంతర్పణ’ చేసిన వారికే ఇలాంటి డ్యూటీలు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
చర్యలు తీసుకుంటాం..
మన జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో ఔటాఫ్ డిజిగ్నేషన్ విధానం అనధికారికంగా ఎక్కడా లేదు. అయితే దీనిపై కార్మికుల నుంచి ఆరోపణలు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– చెంగల్‌రెడ్డి,రీజనల్ మేనేజర్, ఆర్టీసీ, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment