విచారణ చేస్తున్న డీవైఈవో పురుషోత్తం
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. వారిని పర్యవేక్షించాల్సిన మండల విద్యాశాఖాధికారులు వారికి సహకరిస్తుండడంతో ఆ శాఖకే చెడ్డపేరు వస్తోంది. 25 నెలలుగా పాఠశాలకు హాజరుకాని ఉపాధ్యాయినికి ప్రతినెలా జీతం అందుతున్న వైనం జిల్లా అధికారులను విస్మయానికి గురిచేసింది.
చిత్తూరు కలెక్టరేట్: దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన ఉపాధ్యాయిని ఖాతాలో 25 నెలలుగా జీతం జమ అవుతూనే ఉంది. దీన్ని రెండు సంవత్సరాల తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులు కనిపెట్టారు. సోమల మండలం బోడమంద ప్రాథమిక పాఠశాలలో కిరణ్‌కుమారి అలియాస్ రాధ అనే ఉపాధ్యాయిని ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె పలు కారణాలతో 2018 జనవరి 1వ తేదీ నుంచి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి 2020 మార్చి 1వ తేదీ వరకు సెలవులోనే ఉన్నారు. ఈ విషయాన్ని బయోమెట్రిక్ హాజరు ద్వారా తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవో కార్యాలయం ఏడీ–1 పురుషోత్తంను విచారణాధికారిగానియమించారు. ఆయన ఈ నెల 4న బోడమంద ప్రాథమిక పాఠశాలలో, సోమల మండలం ఎంఈఓ కార్యాలయంలో విచారణ జరిపారు. రికార్డుల ను పరిశీలించారు. సిబ్బందిని విచారించారు. ప్రాథమిక విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు పంపారు. బడికి రాని ఉపాధ్యాయిని ఖాతాలోకి ప్రతి నెలా జీతం జమ అవుతున్నట్లు తేలింది. అలసత్వం వహించిన సోమల ఎంఈఓ బాలాజీనాయక్, ఎస్జీటీ కిరణ్‌కుమారిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.
రూ.10 లక్షలు స్వాహా
బడికి హాజరుకాని ఉపాధ్యాయిని ఖాతాలోకి ప్రతి నెలా జీతం మంజూరు అవుతున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. ఎస్జీటీ ఉపాధ్యాయిని కిరణ్‌కుమారి 25 నెలల జీతం రూ.10లక్షలు నిబంధనలకు విరుద్ధంగా జమ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. జీతాల బిల్లులను ఎంఈవో క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం వల్ల గైర్హాజరైన ఉపాధ్యాయినితో ఒప్పందం కుదుర్చుకుని జీతాన్ని సగం సగం తీసుకోవడానికి ప్రయత్నించారా అనే విషయంపై విద్యాశాఖ అధికారుల క్షేత్రస్థాయి విచారణలో తెలియాల్సి ఉంది. రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు ఆ ఉపాధ్యాయిని బయోమెట్రిక్ నమోదు కాకపోవడంతో సందేహం వచ్చి కిరణ్‌కుమారికి ఫోన్ చేసినట్లు తెలిసింది. ఆమె ఫోన్‌లో స్పందించకపోగా స్విచాఫ్ చేశారని అధికారులు తెలిపారు. అనంతరం ఎంఈవో బాలాజీనాయక్‌ను సంప్రదించగా తడబడుతూ సమాధానమివ్వడంతో ఉన్నతాధికారులకు సందేహం వచ్చి విచారణ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
పర్యవేక్షణ లోపమే
క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారా.. లేదా అన్న విషయంపై ఎంఈవో, డీవైఈవో, డీఈవో, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. రెండేళ్లకు పైగా ఆ పాఠశాలకు ఏ అధికారీ తనిఖీకి వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. బోడమంద పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు 25 నెలలకు ముందు మాత్రమే కిరణ్‌కుమారిని చూసినట్లు చెబుతుండడం గమనార్హం. ఇలాంటి ఘటనలు జిల్లావ్యాప్తంగా ఇంకెన్ని ఉన్నాయో అని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా కలెక్టర్, రాష్ట్రస్థాయి విద్యాశాఖాధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment