conductors
-
జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి విధుల్లో ఆ తరహా వస్త్రధారణ కూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.డ్రైవర్లు, కండక్టర్లకు ’ఖాకీ’.. మిగిలిన వాళ్లు ఇష్టమొచ్చినట్టుగా!ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తారు.. బస్టాపులు, బస్టాండ్లలో ఉండే సూపర్వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో ఉంటారు.. కానీ, డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో ఉండే అధికారులకు యూనిఫాం అంటూ లేదు. డ్రెస్ కోడ్ కూడా లేకపోవటంతో ఇంతకాలం క్యాజువల్ వస్త్రధారణ తో విధులకు హాజరవుతున్నారు. దీన్ని పెద్దగా పట్టించుకునేవారు లేకపోవటంతో, రంగురంగుల డ్రెస్సులు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్డులు ధరించి వస్తున్నారు.కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. తాజాగా దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన తరచూ అధికారులతో గూగుల్ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో డిపో స్థాయి సిబ్బందితో కూడా ఆన్లైన్ సమావేశాల్లో ముచ్చటిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టుల్లో కనిపిస్తున్నారు. ఇది ఆయనకు చికాకు తెప్పించింది.ఫార్మల్ డ్రెస్సుల్లోనే రావాలని ఆదేశాలుదేశంలోనే పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే విషయాన్ని ఆయన ఈడీ ‘అడ్మిన్) దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తాజాగా ఈడీ (అడ్మిన్) లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సంస్థకు ఉన్న పేరు, డిపో కార్యాలయాల గౌరవానికి వారి డ్రెస్సింగ్ భంగంగా ఉందంటూ ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ఇక నుంచి గౌరవప్రదంగా ఉండే ఫార్మల్ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.యూనిఫాంలో కనిపించని స్పష్టతఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫాంలో కనిపిస్తారు. కొన్ని బస్సుల్లో నీలి రంగు యూనిఫాం ఉంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించింది. ఆర్టీసీలో అతిపెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో సిబ్బంది యూనిఫాంపై ప్రస్తావించారు. మహిళా కండక్టర్లకు యాప్రాన్ అందజేస్తామని చెప్పి.. ఆ యాప్రాన్ ఏ రంగులో ఉండాలో నిర్ధారించేందుకు ఓ కమిటీ వేశారు.రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత, మెరూన్ రంగులో ఉండే యాప్రాన్‌ను సిఫారసు చేశారు. ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్రం కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ యాప్రాన్ కూడా కనిపించటం లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు యూనిఫాం కూడా కొన్నేళ్లపాటు సరఫరా కాలేదు. వారికి ఖాకీ బదులు మరో రంగు ఇవ్వాలన్న అంశం కూడా తెరమరుగైంది. -
సమస్యలకు టాటా సంతోషాల బాట
సాక్షి, మచిలీపట్నం: ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థే అయినా కార్మికులకు అడుగడుగునా అవస్థలు తప్పేవి కాదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా జీతభత్యాలు అన్న మాటే లేదు. సంస్థ నష్టాల్లో ఉన్నా, ఏవైనా ఒడుదొడుకులు ఎదురైనా సకాలంలో వేతనాలు అందేవి కావు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే జీతంలో కోతలు విధించేవారు. ఇదంతా గతం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో సంస్థ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వచ్చింది. ఉద్యోగ భద్రత లభించింది. విలీనమై నాలుగేళ్లు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఆచరణలోకి పెట్టేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే కమిటీ వేశారు. ఆరు నెలల్లోనే ఆచరణలో పెట్టారు. 2020 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తేవడంతో కార్మికులంతా ప్రజా రవాణా శాఖ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. దశాబ్దాల తరబడి ఎవరూ చేయని సాహసవంతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఉద్యోగుల కష్టాలు తొలగిపోయాయి. నాలుగేళ్లుగా వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, బెనిఫిట్స్, అలవెన్స్ అందుతున్నాయి. ఈ నిర్ణయంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5,308 కుటుంబాల్లో సంతోషాలు నిండాయి. నాడు సమ్మెలు చేస్తే జీతాలు కట్ ఆర్టీసీ ఇస్తున్న వేతనాలు చాలక డ్రైవర్లు, కండ క్టర్లు, ఇతర కార్మికులు ఎన్నోసార్లు సమ్మెలు, పోరాటాలు చేశారు. అయినా తగిన ప్రతిఫలం దక్కలేదు. గత టీడీపీ ప్రభుత్వం కార్మికులను వేధించి, సమ్మె కాలానికి జీతాలు కోసి ఉక్కు పాదం మోపింది. ఉద్యోగ భద్రత కరువై కార్మికులు రోజులు లెక్కపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే తమ సమస్యలకు పరిష్కారం లభించిందని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. లాక్‌డౌన్‌లోనూ ఠంచన్‌గా జీతాలు కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా రెండేళ్లలో సుమారు నాలుగు నెలలకు పైగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆ పరిస్థితులు గతంలో ఎదురైతే కార్మికుల వేతనాల్లో కోతలు పడేవి. అప్పటికే ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎన్ని కష్టాలు ఉన్నా ఒకటో తేదీన ఠంచన్‌గా జీతాలు అందాయి. ఇలా జీతాలు చెల్లించడం చరిత్రలో మొదటి సారి అని ఉద్యోగులు పేర్కొన్నారు. మాట తప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీ విలీనం ప్రక్రియ పూర్తి చేసి మాట నిలుపుకొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ జీతాలకు బ్రేక్ లేకుండా చూశారు. ఆర్టీసీ కార్మికుల మేలు కోరిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. – చల్లా చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు,పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానం ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులను ఎదు ర్కొన్నాం. చాలీచాలని వేతనాలు, అల వెన్సులు. జీతాల పెంపు కోసం సంఘాలు ఆందోళన చేసినా మాకు సరైన న్యాయం జరిగేది కాదు. అయితే ఇప్పుడు ప్రజా రవాణా శాఖలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, అలవెన్స్‌లు అందుతున్నాయి. – గొడవర్తి నరసింహాచార్యులు, కండక్టర్ భరోసా వచ్చింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులుగా ఉన్నప్పుడు మాకు ఉద్యోగ భద్రత ఉండేది కాదు. ఏదైనా పొరపాటు జరిగినా.. ఆర్టీసీ సంఘాలు చేపట్టే ఆందోళనలో పాల్గొన్నా ఒత్తిళ్లు, బెదిరింపులు ఉండేవి. ఇప్పుడు ఆ సమస్య లేదు. ప్రభుత్వంలో విలీనం చేయడంతో జీతభత్యాలపై భరోసా వచ్చింది. ఉద్యోగ భద్రత లభించింది. – ఎ. వెంకటేశ్వరరావు, డ్రైవర్ -
‘సర్.. బస్సు ఖాళీగా లేదు.. సీట్లు ఫుల్.. ముందు బస్సు దిగేయండి’
‘సర్.. బస్సు ఖాళీగా లేదు.. సీట్లన్నీ ఫుల్లయ్యాయి.. ముందు బస్సు దిగేయండి.. వెనుక ఖాళీగా వస్తోంది. ఆ బస్సులు రండి’ ఇదీ ఆర్టీసీ సిబ్బంది నుంచి వినిపిస్తున్న మాట. సీట్లు ఖాళీగా ఉన్నా.. ఆపేందుకు డ్రైవర్లు ఆసక్తి చూపకపోగా.. కొందరు కండక్టర్లు టిక్కె ట్లు కొట్టి డబ్బులు తీసుకోవాలన్నా ఇబ్బంది పడిపోతున్నారు. బస్సు ఖాళీ లేదు.. దిగండి అంటూ.. ప్రయాణికులను ఒకింత దగమాయిస్తూ దింపేస్తున్నారు.. వెనుక వస్తున్న బస్సునైనా ఎక్కదామంటూ ఆ సిబ్బందే అదేమాట.. ఇదెక్కడో కాదండోయ్.. మన తిరుపతి జిల్లాలోనే.. దీంతో చేసేది లేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. తిరుపతి అర్బన్: ఆర్టీసీ ఆర్థిక కష్టాలు అందరికీ తెలిసిందే. ప్రతి డిపో కష్టాల్లోనే నడుస్తోంది. దీనికితోడు 2020–21లో కోవిడ్ మరింత దెబ్బతీసింది. ఆ తర్వాత తిరుపతి జిల్లా లాభాల దిశగా పయనిస్తోంది. అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ఉద్యోగులు వ్యవహరించాల్సి ఉంది. అయితే కొందరు డ్రైవర్లు, కండక్టర్లు బస్టాండ్‌లో, స్టాపింగ్ పాయింట్ల వద్ద బస్సు ఆపకుండా వెళ్లిపోతుండడం విమర్శలకు తావిస్తోంది. వెనుక బస్సు ఖాళీగా వస్తోంది శ్రీకాళహస్తి, పుత్తూరు, చిత్తూరు మార్గాల్లో తిరుపతికి వచ్చిపోయే బస్సుల్లో స్టాపింగ్ ఉన్నా, ప్రయాణికులు చెయ్యెత్తి మొత్తుకున్నా బస్సులు ఆగకుండా వెళ్లిపోతున్నాయి. సార్ సీట్లు లేవు.. వెనుక బస్సు ఖాళీగా వస్తోంది.. అంటూ ఉచిత సలహాలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఆర్టీసీ కండక్టర్లు చెప్పిన మాటలు నిజమేనని తర్వాత వచ్చే వెనుక బస్సును ఆపినా అదే పరిస్థితి. మరీ పిల్లలు, వృద్ధులు ఉంటే అస్సలు ఆపడం లేదు. చిన్నపాటి బ్యాగ్‌లు ఉన్నా ఆపని పరిస్థితి. దీంతో ప్రజలు ఆర్టీసీ ఉద్యోగుల తీరును తప్పుపడుతున్నారు. తాము స్టాడింగ్ జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నా బస్సులు ఆపకుండా వెళ్తున్నారని మండిపడుతున్నారు. ఇదిగో సాక్ష్యం రెండు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి సమీపంలోని మిట్టకండ్రిగ బస్టాపింగ్ పాయింట్ వద్దకు చేరాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత ఓ ఆర్డినరీ సర్వీసు వచ్చింది. బస్సు ఖాళీగా ఉన్నా డ్రైవర్ ఆపలేదు. చెయ్యెత్తి మొత్తుకున్నా కన్నెత్తి చూడలేదు.. దీంతో చేసేది లేక తమిళనాడుకు ఆర్టీసీ బస్సులో ఆ యువకుడు తిరుపతికి వెళ్లాల్సి వచ్చింది. సీట్లతో పనిలేదు సీట్లతో పనిలేదు. తప్పకుండా బస్సును ఆయా సర్కిళ్లలో నిలపాలి. ప్రయాణికులు చెయ్యెత్తిన చోటంతా బస్సును ఆపాల్సిందే. జిల్లాలోని డీఎంలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం. లేదంటే డ్రైవర్లు, కండక్టర్లపై చర్యలు తప్పవు. –చెంగల్‌రెడ్డి, ఆర్ఎం, ఆర్టీసీ -
ప్రయాణికులతో మర్యాదగా మెలగండి ! ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హితవు
ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సూచించారు. సంస్థకు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లని, క్షేత్రస్థాయిలో జాగ్తత్తగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. చిన్న పొరపాట్ల వల్ల ఆర్టీసీ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. ఆర్టీసీ బ్రాండ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా సంస్థ అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ ఛాలెంజ్ ఫర్ ట్రైనింగ్(టాక్ట్) శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు సజ్జనర్ హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చ్‌వల్‌గా.. ఈ శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న కండక్టర్లతో ముచ్చటించారు. శిక్షణ జరుగుతున్న తీరు, శిక్షణలో చెబుతున్న విషయాల ఉపయోగం, తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. "మనం ప్రయాణికుల కేంద్రంగానే పనిచేయాలి. ప్రయాణికులతో ఎట్టి పరిస్థితుల్లోనూ దురుసుగా ప్రవర్తించొద్దు. బస్సులోకి రాగానే వారిని నమస్తే అంటూ చిరునవ్వుతో పలకరించాలి. కొత్త ప్రయాణికులను మన సంస్థ వైపు మెగ్గుచూపేలా వ్యవహారించాలి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వహించాలి. విధి నిర్వహణలో స్వీయ క్రమశిక్షణను కలిగి ఉండాలి." అని కండక్టర్లకు సజ్జనర్ హితవు పలికారు. గత ఏడాదిన్నర కాలంలో సంస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) 69గా ఉంది. దానిని 75కి పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే సంస్థలో ప్రతి ఒక్క సిబ్బందికి టాక్ట్ పేరుతో శిక్షణ ఇస్తున్నాం. ఆ లక్ష్యానికి అనుగుణంగా అందరూ పనిచేయాలి." అని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ శిక్షణ స్పూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. సంస్థ లాభాల బాటలో పయనించేలా పాటుపడాలన్నారు. ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలోని దాదాపు 6 వేల మంది డ్రైవర్లకు టాక్ట్ శిక్షణను ఇచ్చామని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో సంస్థలోని సిబ్బంది అందరికీ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. కాగా, టాక్ట్ పేరుతో తమకు అందిస్తోన్న ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉందని కండక్టర్లు సంస్థ ఎండీ సజ్జనర్‌కు చెప్పారు. తమలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రయాణికుల మీదనే సంస్థ ఆధారపడి ఉందనే విషయాన్ని తాము మరిచిపోమన్నారు. ఓఆర్‌ను 75కి పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, ఓఎస్డీ(ఐటీ అండ్ డీ) యుగంధర్, సీటీఎం(ఎం అండ్ సీ) విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. (చదవండి: రాష్ట్రం మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం) -
విజిలెన్స్ పట్టించినా.. ఆర్టీసీ వదిలేసింది
సాక్షి, హైదరాబాద్: టికెట్ డబ్బుల లెక్కల్లో తేడాలతో కండక్టర్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో డ్రైవర్లు సస్పెండయ్యారు. వారు అప్పీళ్లకు వెళ్తే కేసులవారీగా పరీక్షించి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కేసులు మాఫీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి, విచారణ జరిపి ఆర్టీసీకి నివేదిక ఇచ్చారు. దాదాపు 70 మందికి సంబంధించి విచారణ జరిపితే.. 39 మందిదాకా తమ దగ్గర ఉన్నతాధికారి లంచం తీసుకున్నట్టుగా స్పష్టమైన సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఈ నివేదిక ఆర్టీసీకి అందింది. అయినా బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక ఓ డిపోలో కొందరు తాత్కాలిక సిబ్బంది పనిచేశారు. వారు విధుల్లో ఉండగానే.. కనీస వేతనాల మొత్తం పెరిగింది. ఈ మేరకు సొమ్ము విడిగా మంజూరైంది. కానీ ఈ సొమ్మును తాత్కాలిక కార్మికులకు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారు. తర్వాత చెల్లించేసినట్టు లెక్కలు చూపారు. దీనిపై ఆరోపణలు రావటంతో విజిలెన్సు విచారణ జరిగింది. పెరిగిన మేర సొమ్ము తమకు అందలేదని కార్మికులు చెప్పినట్టు సమాచారం. ఈ నివేదిక కూడా ఉన్నతాధికారులకు చేరినా.. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే అధికారులు మరింతగా వసూళ్లకు పాల్పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది? ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లే కీలకం. అయినా వారి విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం కనిపించినా సస్పెన్షన్ వేటు వేస్తుంటారు. ఇలా ఏటా వంద మంది వరకు సస్పెండ్ అవుతున్నారు. చిన చిన్న కారణాలతోనే సస్పెండ్ చేస్తున్నారని, తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో సీఎం కేసీఆర్ స్పందించి నిబంధనల్లో మార్పునకు ఆదేశించారు. ఈ మేరకు కొత్త నియమావళి ఇటీవలే విడుదలైంది. అయితే ఈ కొత్త నియమావళి కూడా సరిగా లేదంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. డిపోల ముందు నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సస్పెన్షన్ వేటు పడుతుండటమే దీనికి కారణం. అయితే చిన్న ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉంటున్న యాజమాన్యం.. అధికారుల విషయంలో మాత్రం చూసీచూడనట్టు ఉంటోందన్న చర్చ ఆర్టీసీలో వినిపిస్తోంది. సస్పెండైన కండక్టర్లు, డ్రైవర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డట్టు తేలినా సదరు అధికారులను ఎందుకు వదిలేస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. ఇతర అధికారులు దీనిని అలుసుగా తీసుకుని వసూళ్ల పర్వం ప్రారంభిస్తారని వాపోతున్నారు. అంతర్గత విచారణ ఏదీ? కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డట్టు విజిలెన్సు నివేదిక జనవరి చివరి వారంలోనే అందినా ఆర్టీసీ యాజమాన్యం స్పందించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. సాధారణంగా విజిలెన్సు నివేదికలు అందిన తర్వాత ఆర్టీసీ అధికారులు అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఇటీవల వరంగల్‌లో ఓ డిపో మేనేజర్‌ను ఇలాగే సస్పెండ్ చేశారు. కానీ మరో రెండు కేసుల విషయంలో అంతర్గత విచారణ కూడా చేపట్టలేదు. ఇది ఆర్టీసీలో కార్మిక సంఘాలు తిరిగి బలోపేతం అవ్వాలన్న డిమాండ్‌కు తెరలేపుతోంది. చిన్న ఉద్యోగుల విషయంలో ఓ రకంగా, అధికారుల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నందున.. మళ్లీ కార్మిక సంఘాలకు అవకాశం కల్పించి ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ మొదలవుతోంది. -
నయా కండక్టర్లు
విచిత్రమేంటంటే అసలు విధులు కాకుండా కొసరు పనుల్లో బిజీగా ఉన్న ఈ ముగ్గురు ఉన్నది ఉప్పల్ బస్టాప్‌లోనే కావటం విశేషం. డిపోలో ఇప్పటికే ఇద్దరు కంట్రోలర్లు ఉన్నారు. వారు కాకుండా కొత్తగా ఇలా ముగ్గురొచ్చారు. ఇలా ప్రధాన ప్రాంతాల్లో కండక్టర్లు ఈ పనుల్లో దర్శనమిస్తున్నారు. అసలు పనులు వదిలి ఇలా రోడ్డెక్కటానికి కారణం ఆర్టీసీ పొదుపు చర్యల్లో భాగమే. బస్సులు గ్యారేజీకి.. వీరు బస్టాపులకు.. ఆర్టీసీ నష్టాలను తగ్గించే క్రమంలో ఇటీవల పెద్ద సంఖ్యలో సొంత బస్సులను ఆర్టీసీ ఉపసంహరించుకుంది. ఇందులో సిటీలో దాదాపు 800 ఉండగా, కొత్తగా జిల్లాల్లో 1,300 అద్దె బస్సులు వచ్చి చేరనుండటంతో అంతే సంఖ్యలో సొంత బస్సులను రద్దు చేసుకుంటోంది. దీంతో పెద్ద సంఖ్యలో కండక్టర్లు, డ్రైవర్లు మిగిలిపోతున్నారు. నగరంలో ఇప్పటికే 800 బస్సుల రద్దు అమల్లోకి వచ్చింది. దీంతో దాదాపు 1,600 మంది వరకు కండక్టర్లు మిగిలిపోతున్నారు. ఇప్పటివరకు ఉన్న ఖాళీల్లో కొందరిని సర్దుబాటు చేయగా దాదాపు వేయి మందికిపైగా మిగిలిపోయారు. డ్రైవర్లలో మిగిలిన వారిని ఇతర శాఖలకు పంపేందుకు సిద్ధపడగా, ప్రస్తుతానికి ఫైర్ సర్వీసెస్ 42 మందిని తీసుకుంది. మిగతావారిలో ఎక్కువమందిని కొత్తగా ప్రారంభిస్తున్న సరుకు రవాణా విభాగానికి పంపుతున్నారు. కండక్టర్లకు మాత్రం వేరే శాఖల్లో అవకాశం లేక ఆర్టీసీలోనే అంతర్గతంగా వినియోగించుకోవాల్సి వచ్చింది. బస్సు రాగానే మైక్ పట్టుకుని దాని వివరాలను ప్రయాణికులకు వెల్లడిస్తున్న ఈయన కూడా సీనియర్ కండక్టరే. కానీ కండక్టర్ విధులు దక్కక ఇలా అదనపు డ్యూటీలో ఉండాల్సి వచ్చింది. సరుకు రవాణా విభాగంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌గా కొందరిని తీసుకోగా, మరికొందరిని ఇలా బస్టాపుల్లో ఉంచి బస్సుల నియంత్రణ, ఆటోలు అడ్డుగా లేకుండా చూడటం, ప్రయాణికులకు సమాచారమివ్వటం లాంటి పనులకు వినియోగిస్తున్నారు. బస్టాపుల్లో ఆటోలు తిష్ట వేయకుండా కొన్ని చోట్ల హోమ్గార్డులుండేవారు. ఇప్పుడు మిగిలిపోయిన కండక్టర్లను ఆయా బస్టాపులకు పంపి హోంగార్డుల పనులు వారికే అప్పగించినట్టు సమాచారం. ఉప్పల్ బస్టాపులో హోంగార్డులు లేక ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. కండక్టర్లనే బెదిరింపులకు గురిచేస్తూ బస్సులకు అడ్డంగా నిలిపి ప్రయాణికులను మళ్లించుకుంటున్నారు. ఈయన ఆర్టీసీలో సీనియర్ కండక్టర్. ప్రస్తుతం అసలు విధులు వదిలి ఉప్పల్ బస్టాప్‌లో బస్సుల రాకకు అడ్డుగా ఉన్న ఆటోలను పక్కకు తోలే పనిలో ఇలా నిమగ్నమయ్యాడు. సిటీలో 800 బస్సుల రద్దు.. నిజానికి నగరంలో బస్సులు తగ్గిపోవటంతో ప్రయాణికులకు ఇబ్బందులు పెరిగాయి. అసలే వాటి సంఖ్య చాలక కొన్ని ప్రాంతాలకు బస్సు ట్రిప్పులను నడపలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా 800 బస్సులను తగ్గించటంతో కాలనీలకు వెళ్లే సర్వీసులు చాలా రద్దయ్యాయి. తక్కువ దూరం తిరిగే సర్వీసులను దూరప్రాంతాలకు పొడిగించారు. ఫలితంగా బస్టాపుల్లో పడిగాపులు పెరిగాయి. ఇటు ప్రయాణికులకు అటు మిగిలిపోయిన సిబ్బందికి ఈ చర్య ఇబ్బందిగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం వాస్తవాలు గుర్తించి పునరాలోచించాలన్న డిమాండు ప్రయాణికుల నుంచి బలంగా వస్తోంది. -
టీఎస్ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయిలో నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిం చిన నేపథ్యంలో తాత్కాలిక పద్ధతిలో నియామకాలకు సంబంధించి టీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో నియమించుకునే వారికి చెల్లించాల్సిన మొత్తాలను అందులో పేర్కొంది. రోజువారీ ప్రాతిపదికన ఇంకా అదనంగా డ్రైవర్లు, కండక్టర్లను తీసుకోవడానికి ఆర్టీసీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపిక చేసిన అభ్యర్థులకు రోజువారీగా డ్రైవర్‌కు రూ.1500, కండక్టర్‌కు రూ.1000 చొప్పున చెల్లించనుంది. అలాగే రిటైర్డ్ ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్స్కు రోజువారీ రూ.1500, ఆయా డిపోలో రోజుకు రూ.1000 చొప్పున రిటైర్డ్ మెకానిక్స్, శ్రామిక్స్లతో పాటు ఎలక్ట్రిషన్స్, టైర్ మెకానిక్స్, క్లరికల్‌గా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులే కాక ఇతర శాఖల్లో పని చేసిన డ్రైవర్స్, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆర్టీసీకి చెందిన ఓల్వో / ఏసీ / మల్టీ యాక్సిల్స్ బస్సులను నడిపడానికి అనుభవం ఉన్న డ్రైవర్స్, మెకానిక్స్‌ల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఏసీ బస్సులు నడిపే డ్రైవర్స్, మెయింటినెన్స్ చేసే మెకానిక్కు రోజువారీగా రూ.2000 చొప్పున చెల్లించనుంది. రోజువారీ పద్ధతిలో ఐటీ ట్రైనర్‌గా తీసుకున్న సాప్ట్వేర్ నిపుణులకు రూ.1500 ఇవ్వనుంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ సమీప డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికల్ ఇన్స్‌స్పెక్టర్లు, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించిన విషయం తెలిసిందే. మరోవైపు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తొమ్మిదో రోజు కూడా కొనసాగుతోంది. -
కునుకు కరువవుతోంది
సాక్షి, సిటీబ్యూరో: నైట్ అవుట్ సర్వీసుల్లో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. రెస్ట్ రూంలలో మంచాలు లేక, కనీస సదుపాయాలు లేక కటిక నేలపైనే పడుకుంటున్నారు. తిరిగి నిద్రలేమితోనే తెల్లవారు జామున విధులు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజూ వందలాది బస్సులు వివిధ ప్రాంతాల్లో నైట్ అవుట్ సర్వీసులుగా నిలిచిపోతాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు సర్వీసులను ఉదయాన్నే అక్కడి నుంచి ప్రారంభించేందుకు అనుగుణంగా నైట్ అవుట్ çసర్వీసులను ఏర్పాటు చేశారు. కానీ డ్రైవర్లు, కండక్టర్లకు విశ్రాంతి గదులలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల బస్సుల్లోనే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. దీంతో వారు సరైన నిద్రకు నోచుకోవడం లేదు. తిరిగి తెల్లవారు జామునే బస్సులు నడపాల్సి రావడంతో నిద్రలేమి, బడలిక కారణంగా విధి నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగరంలోని గౌలిగూడ సెంట్రల్ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, ఉప్పల్, జగద్గిరిగుట్ట, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు సుమారు 250కి పైగా సిటీ బస్సులను నైట్ అవుట్ సర్వీసులుగా నిలుపుతారు. ఈ బస్సుల్లో 500 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం రెండో షిఫ్టు విధుల్లో చేరిన బస్సులు ఆఖరి ట్రిప్పు పూర్తయిన తరువాత ఇలా నైట్ అవుట్లుగా ఉండి ఉదయం ట్రిప్పులతో డిపోలకు చేరుకుంటాయి. సిబ్బందిపై చిన్న చూపు పటాన్చెరులో ప్రతి రోజు సుమారు 100 బస్సులు నిలిచి ఉంటాయి. 200 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఈ బస్సుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వారి కోసం ఏర్పాటు చేసిన రెస్ట్రూమ్లు దారుణంగా ఉన్నాయి. ఉప్పల్‌లో 70 బస్సులు, జేబీఎస్లో మరో 50 బస్సులు, సీబీఎస్‌లో 70 బస్సులకు పైగా రాత్రి పూట నిలిపి ఉంచుతారు. సీబీఎస్ విశ్రాంతి గదుల్లో డ్రైవర్, కండక్టర్లకు మంచాలు ఉన్నప్పటికీ ఫ్యాన్లసైతం లేకపోవడంతో నిద్ర కరవువవుతోందని పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్టలో బస్సుల్లోనే నిద్ర వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులతో పాటు, నగరంలోని పలు డిపోలకు చెందిన 40 బస్సులను జగద్గిరిగుట్టలో నిలిపి ఉంచుతారు. ఇక్కడ ఎలాంటి విశ్రాంతి గదులు లేకపోవడం వల్ల సిబ్బంది బస్సుల్లోనే నిద్ర పోవాల్సి వస్తుంది. ‘‘ బస్సులో పడుకొంటే నిద్ర రాదు. బయట ఎక్కడా పడుకోలేం. పైగా బస్సుల భద్రత కూడా ముఖ్యమే కదా. ఇలా జగద్గిరిగుట్టకు వచ్చినప్పుడల్లా నరకాన్ని చవి చూస్తున్నాం.’’ అని జనగామ డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా వాహనాల రొద తమకు నిద్ర లేకుండా చేస్తుందన్నారు. ఉప్పల్‌లో విశ్రాంతి గదులు ఉన్నప్పటికీ సరైన వసతులు లేవు. జేబీఎస్‌లోనూ అదే పరిస్థితి. ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు విశ్రాంతి గదుల్లో కనీస సదుపాయాలపై ఇప్పటికి చాలా సార్లు అధికారులకు విన్నవించాం, అయినా పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల టాయిలెట్లు లేవు. కొన్ని చోట్ల విశ్రాంతి గదులే లేవు. నైట్ అవుట్ డ్యూటీ కింద రూ.30 అలవెన్స్ ఇస్తారు. ఈ రోజుల్లో ఆ డబ్బులు ఎందుకూ సరిపోవడం లేదు. – హనుమంతు ముదిరాజ్, ఆర్టీసీ టీజేఎంయూ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి నిద్ర లేమి వల్ల చాలా మంది డ్రైవర్లు, కండక్టర్లు అనారోగ్యానికి గురవుతున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం దారణం. – ఆర్ఎన్. రావు, కార్మిక నాయకుడు -
ముడుపులిస్తే రైట్..రైట్
విధులకు రాకపోయినా జీతాలు తీసుకోవచ్చు. అదేంటి విధులకు వెళ్తేనే కదా జీతం తీసుకోగలం అనుకుంటున్నారా? అయితే ఆర్టీసీ శాఖలో అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు విధులకు రాకపోయినా సరేనెల జీతం బ్యాంకుల్లో జమ అవుతోంది. ఓడీ (ఔట్ ఆఫ్ డిజిగ్నేషన్) పేరుతో విధులకు డుమ్మా కొట్టే కండక్టర్లు ఇందుకోసం ఉన్నతాధికారులకు కొంత ముట్టచెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి జిల్లాలోని తూర్పు మండలాల్లోని ఆర్టీసీ డిపోల్లో ఈ జాడ్యం విస్తరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓడీ విధానం ఆర్టీసీలోవివాదాస్పదమవుతోంది. పుత్తూరు:ఆర్టీసీలో ఓడీ విధానం ఉన్నతాధికారులకు కాసులు కురిపిస్తోంది. సంస్థకు ఉన్న అవసరాల దృష్ట్యా సిబ్బందికి రెగ్యులర్ విధులతో పాటు ఇతర బాధ్యతలు అప్పగించే వెసులుబాటు ఉంది. ఇందుకుగాను ఓడీ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. సరిగ్గా ఈ విధానమే ఆర్టీసీలోని కొంతమంది ఉన్నతాధికారులకు అవకాశంగా మారింది. దీంతో వారు దీని పేరిట అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రత్యేకించి కొందరు కండక్టర్లకు ఓడీ పేరుతో ఇతర పనులు అప్పగిస్తూ వారి వద్ద నుంచి ముడుపులు పోగేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓడీ వేసుకున్న సిబ్బంది సొంత వ్యాపకాల్లో మునిగి తేలుతూ సంస్థకు గుదిబండగా మారుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతునా యి. నెల పూర్తయ్యే సరికి జీతాలను జేబుల్లో వేసుకుంటూ సంస్థకు నష్టం కలిగిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. నవ్విపోదురుగాక.. ఆర్టీసీ క్యాట్ కార్డులు, బస్‌పాసులు అమ్మేం దుకు కొందరు కండక్టర్లకు ఆన్‌డ్యూటీ వేస్తారు. వీరు ఆయా డిపోల పరిధిలోని మండలాలు, గ్రామాలకు వెళ్లి క్యాట్ కార్డులను అమ్మాలి. ఈ సాకుతో వారు సొంత పనులను చేసుకుంటున్నట్లు సమచారం. వీరి పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతా ధికారులు ముడుపులకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలు స్తోంది. తిరుపతిలో మరీ దారుణంగా బస్టాండ్‌లో కాసేపు కట్టి చేతపట్టుకుని కలియతిరిగి ఇంటికి చెక్కేస్తున్నారు. మరుగుదొడ్ల శుభ్రతపై తనిఖీ డ్యూటీలు వేస్తున్నారు. పుత్తూరు డిపో పరిధిలో అయితే తమిళనాడు, ప్రైవేట్ బస్సులు ఎన్ని వెళ్తున్నాయో తెలుసుకునేందుకు కండక్టర్లకు రూట్ సర్వే పేరుతో డ్యూటీ వేస్తున్నారు. అసలే నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి వీరు ఐరావతంలా మారారనే మాటలు వినిపిస్తున్నాయి. పాలసీ కట్టు..ఓడీ వేస్తా.. ఆర్టీసీలో కొందరు ఉన్నతాధికారులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. ఇలాంటి వారికి ఓడీ విధానం వరంలా మారింది. జిల్లాలో 14 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. అయితే తూర్పు మండలాల్లో మాత్రం ఓడీ విధానం వివాదాస్పదమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మూడు నియోజకవర్గాలకు కేంద్రమైన ఒక డిపోలోని ఉన్నతాధికారి ఏకంగా ఇన్సూరెన్స్ ఏజెంట్ అవతారమెత్తేశారు. ఔట్ ఆఫ్ డిజిగ్నేషన్ డ్యూటీ వేస్తే తన కుటుంబసభ్యుల దగ్గర ఎల్ఐసీ పాలసీని కొనుగోలు చేయాలనే అనధికారిక నిబంధనను విధించేశారు. దీంతో ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఆ డిపోలో అయితే ఆర్టీసీ ఉన్నతాధికారి బరితెగించిట్లు సమాచారం. ఆయన్ను అన్ని రకాలుగా ‘సంత్పప్తి’పరిచిన వారికే ఓడీలు వేస్తున్నట్లు తెలు స్తోంది. తిరుపతిలో అయితే ఓడీ విధానం వివాదాస్పదమవుతోంది. ఇక్కడ కూడా ఉన్నతాధికారులకు ‘సంతర్పణ’ చేసిన వారికే ఇలాంటి డ్యూటీలు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చర్యలు తీసుకుంటాం.. మన జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో ఔటాఫ్ డిజిగ్నేషన్ విధానం అనధికారికంగా ఎక్కడా లేదు. అయితే దీనిపై కార్మికుల నుంచి ఆరోపణలు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – చెంగల్‌రెడ్డి,రీజనల్ మేనేజర్, ఆర్టీసీ, తిరుపతి -
ఆర్టీసీలో యూనిఫామ్ లొల్లి!
♦ మూడేళ్లుగా నిలిచిపోయిన సరఫరా ♦ పాత దుస్తులు చిరిగిపోవటంతో సాధారణ వస్త్రాల్లో విధులకు సిబ్బంది ♦ అభ్యంతరం చెబుతున్న అధికారులు.. సిబ్బందికి మెమోలు.. సాక్షి, హైదరాబాద్: యూనిఫామ్ లేకుండానే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది గందరగోళానికి, వివాదాలకు కారణమవుతోంది. యూనిఫామ్‌ను సిబ్బందికి ఆర్టీసీ యాజమాన్యమే సరఫరా చేస్తుంది. కానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీ గడచిన మూడేళ్లుగా యూనిఫామ్ సరఫరా చేయటం లేదు. దీంతో పాతవాటితోనే నెట్టుకొస్తున్న సిబ్బంది.. ఇప్పుడవి చిరిగిపోవటంతో సాధారణ దుస్తుల్లో విధులకు వస్తున్నారు. అయితే యూనిఫామ్ నిబంధన అమలులో ఉండటంతో వారికి మెమోలు జారీ చేస్తుండటం.. వివాదాలకు కారణమవుతోంది. 2013 తర్వాత నిలిపివేత.. 2013 తర్వాత యూనిఫామ్ జారీ నిలిచిపోయింది. ఏడాదికి రూ.2.5 కోట్లు దీనికి ఖర్చు చేయాల్సి రావటంతో నిధులకు ఇబ్బంది ఏర్పడి యాజమాన్యం సరఫరాను తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో అప్పటి నుంచి సిబ్బంది పాత యూనిఫామ్‌తోనే నెట్టుకొస్తున్నారు. మూడున్నరేళ్లు గడిచిపోవటంతో ఆ దుస్తులు చిరిగిపోయా యి. దీంతో కొన్ని రోజులుగా చాలామంది కార్మికులు సాధారణ దుస్తుల్లో విధులకు వస్తుండటంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరు కార్మికులు సొంత ఖర్చులతో యూనిఫామ్ కుట్టించుకున్నారు. రెండు మూడు హెచ్చరికల తర్వాత యూనిఫామ్ లేని సిబ్బందికి అధికారులు మెమోలు జారీ చేస్తున్నారు. సంస్థ యూనిఫామ్ సరఫరా చేయకపోతే తమనెందుకు శిక్షిస్తారంటూ సిబ్బంది ఎదురు ప్రశ్నిస్తుండటంతో అధికారులకు సిబ్బందికి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల కార్మికులను తిప్పిపంపుతున్నట్లు ఫిర్యాదులొస్తుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తూ సాధారణ దుస్తుల్లో వచ్చినా అనుమతిస్తున్నారు. కాగా, నిధుల సమస్య పేరుతో ఆర్టీసీ యూనిఫామ్‌ను జారీ చేయకపోవటం సరికాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో రావాల్సిన పరిస్థితి మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు.. త్వరలో కార్మికులకు కొత్త యూనిఫామ్ జారీ చేయాలన్న ఆలోచనకొచ్చినట్టు తెలిసింది. -
చిల్లర గల్లంతైతే ఉద్యోగం ఊడినట్టే!
కండక్టర్లు, డ్రైవర్లపై ఆర్టీసీ కఠిన వైఖరి - అప్పీళ్లపై జాలి వద్దని తాజాగా ఆదేశం - సహేతుక ఆధారాలు లేకుంటే తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవద్దు సాక్షి, హైదరాబాద్: చిరుద్యోగికి 'చిల్లర' తంటా వచ్చి పడింది. టికెట్‌కు సంబంధిం చిన చిల్లర డబ్బులు గల్లంతు చేస్తే, ఇక కండక్టర్లు, డ్రైవర్ల (టిమ్ సర్వీసు) ఉద్యోగాలు ఊడినట్టే. గల్లంతైన మొత్తం ఎంత స్వల్పమైనా వారు అక్రమాలకు పాల్పడ్డట్టు తేలితే ఉద్యోగం ఊడిపోతుంది. ఉద్యోగాలు కోల్పోయినవారి అప్పీల్‌ను ఆమోదించడంలో అప్పీలేట్ అ«థారిటీ అధికారులు కఠినంగానే వ్యవహరించబోతున్నారు. ఈ మేరకు తాజాగా ఆర్టీసీ యాజమాన్యం అప్పీలేట్ అథారిటీ అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. చిల్లర గల్లంతు చేసి ఉద్యోగాలు కోల్పోయిన వారి అప్పీళ్లను అధికారులు గుడ్డిగా ఆమోదించి తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నారని పేర్కొన్న యాజమాన్యం, ఇక నుంచి అలా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించడం గమనార్హం. భారీ అక్రమాలు వదిలి... యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్‌పై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించటంలో తప్పులేదు. కఠినంగా ఉంటేనే మళ్లీ అక్రమాలకు పాల్పడరు. కానీ రూ.లక్షల్లో అక్రమాలకు పాల్పడే అధికారులపై ఈగవాలనివ్వకుండా, చిల్లర గల్లంతు చేసే కండక్టర్లనే లక్ష్యంగా చేసుకుని కఠినంగా వ్యవహరించటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఒక జిల్లాలోని కొన్ని ప్రధాన బస్టాండ్ల ఆవరణలో కొత్త అద్దె దుకాణాల ఏర్పాటుకు స్థానిక అధికారులు టెండర్లు పిలిచారు. ఒకే రకమైన వస్తువుల విక్రయం కోసం దుకాణం అద్దెకు తీసుకుని అన్ని రకాల వస్తువులు అమ్మే వ్యాపారులను నియంత్రించారు. దీనివల్ల ఆర్టీసీకి సాలీనా రూ.కోటి అదనపు ఆదాయం సమకూరింది. కానీ, గతంలో ఆ జిల్లాలో పనిచేసి పదోన్నతిపై బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి ఆ టెండర్లు రద్దు చేయించారు. ఇందులో రూ.లక్షల్లో నిధులు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. ఇలాంటి అధికారులు దర్జాగా తిరుగుతున్నా పట్టించుకోకుండా రూ.5, రూ.10 చొప్పున గల్లంతయ్యాయన్న కారణంతో కండక్టర్లు, టిమ్ సర్వీసు డ్రైవర్లపై విరుచుకుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లేలా చేసి నిధులు స్వాహా చేసిన అధికారులపై చర్యలు తీసుకుని, ఆ తర్వాత చిల్లర గల్లంతు చేసే కండక్టర్ల విషయంలో చర్యలు తీసుకుంటే బాగుంటుందని కార్మికులు పేర్కొంటున్నారు. గడువు తర్వాత అప్పీళ్లకు నో... టికెట్ డబ్బులు గల్లంతు చేసిన కండక్టర్లు/డ్రైవర్లను ఉద్యోగం నుంచి తొలగించిన పక్షంలో వారు అప్పీల్ చేసుకోవటానికి కేవలం రెండు నెలల గడువు ఉంటుంది. ఆ లోపే ఆ అప్పిల్పై తుది నిర్ణయం తీసుకోవాలి. కానీ గడువు దాటిన తర్వాత కూడా అప్పీళ్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సంబంధిత అధికారులపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇలాంటి కేసుల్లో కోర్టులు కూడా తప్పు పట్టిన విషయాన్ని యాజమాన్యం అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. అప్పీళ్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అందుకు పక్కా ఆధారాలు చూపాలని, అది కూడా గడువు లోపే ఉండాలని, అనవసరపు జాలి చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. అక్రమాలను అదుపు చేసే విషయంలో యాజమాన్యం తీరు సరైనదే అయినప్పటికీ భారీ అక్రమాలకు పాల్పడే అధికారులను రక్షిస్తూ కండక్టర్లపై చర్యలకు దిగటం ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. -
ఎసరు!
‘టిమ్స్’ వినియోగంతో కండక్టర్లకు ముప్పు! డ్రైవర్‌తోనే కండక్టర్ విధులు సిబ్బందిని తగ్గించే యోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఆందోళనలో కార్మికులు మెదక్: ఆర్టీసీ కండక్టర్ల ఉద్యోగాలకు ఎసరు పెట్టే యంత్రాలు వినియోగంలోకి వచ్చాయి. టిమ్స్ (టికెట్లు జారీ చేసే యంత్రాలు) అందుబాటులోకి రావడంతో ఆర్టీసీలో కలకలం మొదలైంది. ఈ యంత్రంతో డ్రైవరే ప్రయాణికులకు టికెట్లు జారీ చేసి వారి గమ్యస్థానాలకు చేరేవేస్తారు. ఫలితంగా ఇక్కడ కండక్టర్ అవసరం లేకుండా పోతుంది. విధానంతో తమ ఉద్యోగలకు ముప్పు పొంచి ఉందంటూ కండక్టర్లు ఆందోళన చెందుతున్నారు. సిబ్బందిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం టిమ్స్‌ను ప్రవేశ పెట్టింది. దీంతో డ్రైవర్లకే టిం మిషన్ అప్పగించి రోడ్డుపైకి వదిలేస్తున్నారు. దీంతో సదరు డ్రైవర్ ఓవైపు బస్సు నడుపుతూనే మరోవైపు ప్రయాణికులకు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డ్రైవర్ ఏ మాత్రం అజాగ్రత్తగా వహించినా జరిగే నష్టం విలువైన ప్రాణమే. జిల్లాలో మెదక్, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, సిద్దిపేట, దుబ్బాక, ప్రజ్ఞాపూర్-గజ్వేల్‌లో ఆర్టీసీ డిపోలున్నాయి. ఇందులో సుమారు 50 వరకు డీలక్స్ బస్సులకు కండక్టర్‌ను ఇవ్వకుండా టిం మిషన్లు డ్రైవర్‌కే అప్పగించి పంపుతున్నారు. బస్సును నడపడంతోపాటూ టిక్కెట్లు ఇచ్చే బాధ్యత కూడా డ్రైవర్‌దే. మెదక్ నుంచి వయా తూప్రాన్ హైదరాబాద్ వరకు తొమ్మిది స్టాప్‌లు ఉన్నాయి. అన్ని స్టాపుల్లోనూ బస్సులను ఆపుతూ ప్రయాణికులకు టిక్కెట్లు ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో ప్రయాణికులు అధికంగా బస్సెక్కినట్లయితే రోడ్డు పక్క బస్సు నిలిపి టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సమయమంతా వృథా అవుతుంది. అధిక చార్జీలు చెల్లించి డీలక్స్ బస్సుల్లో ఎక్కడం కన్నా ఆర్డీనరీ బస్సులు ఎక్కడమే మేలని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపవద్దంటున్న అధికారులు ఓ చెత్తో టిక్కెట్లు.. మరో చేత్తో బస్సునడిపే విధానంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గతంలో డీలక్స్‌లకు మాత్రమే ఈ టిమ్ వ్యవస్థను అప్పగించిన అధికారులు ఎక్స్ప్రెస్ల్లో సైతం ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఒకే వ్యక్తికి కండక్టర్, డ్రైవర్ పనులు అప్పగించడంపై గతంలోనూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేసిన విషయం విదితమే. ఉద్యోగులను తగ్గించుకునేందుకు యాజమాన్యం దృష్టి పెట్టినా.. ప్రయాణికులకు ఏ మాత్రం రక్షణలేని ఈ విధానం సరైంది కాదని అటు ఉద్యోగ సంఘాలతోపాటు ఇటు ప్రయాణికులు సైతం మండిపడుతున్నారు. పాత పద్ధతిలోనే బస్సుకు డ్రైవర్‌తోపాటు కండక్టర్‌ను విధిగా నియమించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మండిపడుతున్న డ్రైవర్లు... టిం వ్యవస్థపై ఆర్టీసీ డ్రైవర్లు సైతం మండిపడుతున్నారు.కండక్టర్‌కు ఇచ్చే సమయంతోనే తమకు ఇస్తున్నారని, తమకు ఏ మాత్రం సమయం ఎక్కువ కేటాయించక పోవడంతో ఒత్తిడి గురవుతున్నట్టు పలువురు చెబుతున్నారు. టికెట్లు ఇచ్చే హడావిడిలో ఎవరైన టిక్కెట్ తీసుకోకుంటే తమకు పనిష్మెంట్ కూడా ఉంటుందని, దీంతో ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల బాట పట్టించేందుకే... జిల్లాలో డీలక్స్లతోపాటు కొన్ని ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ టిం వ్యవస్థను కొనసాగిస్తున్నాం. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు దీన్ని ఒక మార్గంగా ఎంచుకున్నాం. - రఘునాథ్‌రావు, ఆర్టీసీ ఆర్ఎం -
ఇక కండక్టర్లు లేకుండానే..
- బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం - దశల వారీగా ‘టిమ్’ సర్వీసుల ఏర్పాటుకు ప్రణాళిక - టికెట్లు జారీ చేయనున్న డ్రైవర్లు సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల విధానానికి మంగళం పాడాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇక కొత్తగా రోడ్లపైకి వచ్చే బస్సులను వీలైనంతవరకు పూర్తిగా టికెట్ ఇష్యూయింగ్ మిషన్ (టిమ్) సర్వీసులుగా మార్చాలని నిర్ణయించింది. ఈ సర్వీసుల్లో డ్రైవర్లే యంత్రాలతో టికెట్లు జారీ చేస్తారు. తొలుత ఒక్క సిటీ సర్వీసుల్లో తప్ప మిగతా అన్ని బస్సులను టిమ్ సర్వీసుల పరిధిలోకి తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. త్వరలో 1,200 కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, గరుడ, సూపర్ లగ్జరీ, డీలక్స్ వంటి సర్వీసుల్లోనే డ్రైవర్లు టిమ్ యంత్రాలతో టికెట్లు జారీ చేస్తున్నారు. కొన్ని ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ వాటిని వాడుతున్నారు. సిటీ సర్వీసులు, పల్లెవెలుగు బస్సుల్లో మాత్రం కండక్టర్లు టికెట్లు జారీ చేస్తున్నారు. క్రమంగా పల్లెవెలుగు బస్సుల్లో కూడా టిమ్‌లను ప్రవేశపెట్టి డ్రైవరే టికెట్లు జారీ చేసేలా ఆర్టీసీ చర్యలు తీసుకోబోతోంది. మినీ బస్సులతో మొదలు.. ప్రస్తుతం ఉన్న పాత బస్సులను తొలగించి కొత్తవాటిని ప్రవేశపెట్టడంతోపాటు కొత్త మార్గాల్లో బస్సులను తిప్పేందుకు 1,200 బస్సులు కొనాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొన్ని మార్గాల్లో పెద్ద బస్సులకు సరిపడా ప్రయాణికులు లేక ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. దీంతో ఆ మార్గాల్లో బస్సు సర్వీసులను అధికారులు రద్దు చేస్తున్నారు. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతూ.. ఆటోలను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి ప్రాంతాలకు చిన్న బస్సులను నడపాలని నిర్ణయించారు. తొలిదశలో దాదాపు 110 మినీ బస్సులు నడపాలని నిర్ణయించిన అధికారులు.. బస్సులు కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత వీటిని టిమ్ సర్వీసులుగా నడపనున్నారు. తర్వాత పల్లెవెలుగు బస్సుల్లో కూడా కండక్టర్లను తొలగించి డ్రైవర్లకే టికెట్లు జారీ చేసే బాధ్యత అప్పగిస్తారు. ఏటా రూ.3 వేల కోట్ల భారం ప్రస్తుతం ఆర్టీసీలో 23 వేల మందికిపైగా కండక్టర్లున్నారు. ఇటీవల వేతనాలను భారీగా పెంచడంతో ఆర్టీసీపై ఆర్థిక భారం పడింది. మొత్తం వేతనాల ద్వారా ఏడాదికి రూ.3 వేల కోట్ల వరకు భారం పడుతున్నందున, అందులో కండక్టర్ల ఖర్చును దశలవారీగా తగ్గించుకోవాలని చూస్తోంది. నాలుగేళ్లుగా కండక్టర్ల నియామకాలు జరపటం లేదు. కొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక పదవీ విరమణ చేసిన వారు పోను మిగతా వారిని ఇతర పనులకు మళ్లించే ఆలోచన చేస్తోంది. స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టే యోచన కండక్టర్లతో సంబంధం లేకుండా, డ్రైవర్లు కూడా టికెట్టు జారీ చేసే అవసరం లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇందుకోసం ప్రీ పెయిడ్ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రయాణికులు ప్రీ పెయిడ్ స్మార్ట్ కార్డు కొనాల్సి ఉంటుంది. బస్సుల్లో వీటి కోసం కార్డ్ రీడర్ యంత్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు బస్సు ఎక్కేప్పుడు, దిగేప్పుడు సెన్సార్ల ద్వారా కార్డు స్వైప్ అవుతుంది. దీంతో సదరు వ్యక్తి ప్రయాణించిన దూరానికి నిర్ధారిత మొత్తం కార్డు నుంచి డిడక్ట్ అవుతుంది. కార్డును రీడర్ ముందుంచాల్సిన అవసరం లేకుండా జేబులో ఉన్నా రికార్డయ్యేలా సెన్సార్లు అందులో ఉంటాయి. వీటిని తొలుత హైదరాబాద్‌లో ప్రవేశపెట్టనున్నారు. దీనికి అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం ఆర్టీసీ పరిశీలిస్తోంది. -
ఇకపై బస్ కండక్టర్లు ఉండరట..!
హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల విధానానికి మంగళం పాడాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. కొత్తగా వచ్చే బస్సులను వీలైనంతవరకు పూర్తిగా టికెట్ ఇష్యూయింగ్ మిషన్(టిమ్) సర్వీసులుగా మార్చాలనే యోచనలో ఉంది. ఈ సర్వీసుల్లో బస్సు డ్రైవర్లే ప్రయాణీకులకు టిక్కెట్లు జారీ చేస్తారు. ప్రస్తుతం వినియోగిస్తున్న టిక్కెట్ ఇష్యూయింగ్ మిషన్లతో ఇప్పటికే కొన్ని బస్సుల్లో డ్రైవర్లే టిక్కెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో 1,200 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయంతో తాజా పరిణామం ఆర్టీసీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. సిటీ బస్సుల్లో మినహా మిగతా అన్ని రకాల సర్వీసుల్లో టిమ్ మిషన్ల ద్వారా డ్రైవర్లే టికెట్లు జారీ చేయాల్సివుంటుంది. ప్రస్తుతం దూర, సుదూర ప్రాంతాలకు నడిచే గరుడ, సూపర్ లగ్జరీ, కొన్ని డీలక్స్ సర్వీసుల్లో వీటిని డ్రైవర్లు ఉపయోగిస్తున్నారు. అయితే, కొత్త బస్సులను రోడ్డు మీదకు పంపే రోజు నుంచి పల్లె వెలుగు, మిగిలిన సర్వీసుల్లో డ్రైవర్లే టికెట్లు జారీ చేసేలా ఆర్టీసీ చర్యలు తీసుకోనుంది. -
మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
♦ 280 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం ♦ ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు ♦ రాష్ట్ర రవాణాశాఖామంత్రి మహేందర్‌రెడ్డి చేవెళ్ల : తెలంగాణ రాష్ట్రంలోని 95 బస్ డిపోలలో వసతులను మెరుగుపరచడానికి, ఆధునికరించడానికి ప్రభుత్వం 32 కోట్ల రూపాయలను మంజూరు చేసిం దని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. కోటి రూపాయల వ్యయంతో చేవెళ్ల మండల కేంద్రంలోని బస్‌స్టేషన్ విస్తరణ పనులను టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని బస్‌డిపోలు, బస్స్టేషన్లలో ప్రయాణికులకు పూర్తిస్థాయి వసతులు కల్పించడానికి ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలోని పలు బస్‌డిపోలు, బస్స్టేషన్లను ఆధునీకరించడానికి, విస్తరించడానికి 11కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. వీటిలో సీసీరోడ్లు, టాయిలెట్లు, మంచినీరు, తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కొత్తగా 280 బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. వీటిలో 80 ఏసీ బస్సులు, 200 బస్సులు ఎక్స్‌ప్రెస్‌లని అన్నారు. తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి కృషిచేస్తున్నామన్నారు. ప్రతి బస్‌డిపోలో ఉత్తమ సేవలను అందించిన కండక్టర్, డ్రైవర్లకు ప్రోత్సాహక బహుమతులు, అవార్డులు అందజేస్తామన్నారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీకి పలు బస్సుల ద్వారా ఏడాదికి సుమారుగా 900 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందజేస్తామన్నారు. పల్లెవెలుగు బస్సు ల ద్వారా సంవత్సరానికి రూ. 550కోట్ల నష్టం, సిటీ సర్వీసుల ద్వారా 350 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నదన్నారు. ఈ నష్టంలో జీహెచ్ఎంసీ మాత్రం నెలకు 18 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ ఆర్టీసీకి ఇస్తున్నదని చెప్పారు. కాగా ఎక్స్‌ప్రెస్, నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల ద్వారా మాత్రం కొంత ఆదాయం ఆర్టీసీకి వస్తున్నదన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ నగరానికి అతి చేరువగా ఉన్న చేవెళ్ల కేంద్రానికి సబర్బన్ బస్సులు నడపడానికి మంత్రి, ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలన్నారు. చేవెళ్ల బస్‌స్టేషన్‌ను మోడల్ బస్‌స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. బస్‌డిపోను దామరగిద్ద వద్ద కాకుండా చేవెళ్ల సమీపంలో నిర్మించడానికి అనుమతించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, ఈడీ నాగరాజు, ఆర్ఎం ఆర్.గంగాధర్, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ వెంకన్న, ట్రాఫిక్ మేనేర్ విజయభాను, పలు డిపోల మేనేజర్లు, ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, వైస్‌ఎంపీపీ పోలీస్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పద్మ, స్వరూప, సర్పంచ్ మధుసూదన్‌గుప్త, టీఆర్ఎస్ నాయకులు మాణిక్‌రెడ్డి, బర్కల రాంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, మాసన్నగారి మాణిక్‌రెడ్డి, వసంతం, యాదగిరి, రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు. -
టిమ్స్.. టెన్షన్స్
► ప్రైవేట్ వ్యక్తులకు ‘టిమ్స్’ అందజే యడంపై కార్మిక సంఘాల ఆగ్రహం ► ఆర్టీసీ యాజమాన్య నిర్ణయం సరి కాదంటున్న కార్మికులు ► అడ్డుకునేందుకు సై అంటున్న వైనం పట్నంబజారు (గుంటూరు): ఏపీఎస్ఆర్టీసీని నష్టాల బారి నుంచి లాభాల బాట పట్టించడానికి యాజమాన్యం చేపడుతున్న కొన్ని చర్యలు కార్మికుల ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాటిలో డ్రైవర్ కం కండక్టర్ విధానమూ ఒకటి. దీని ద్వారా కండక్టర్‌తో పని లేకుండా నేరుగా డ్రైవరే టికెట్ ఇష్యూయింగ్ మిషన్ (టిమ్) ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ విధానం అమలవుతున్న సంగతి విదితమే. స్థానిక సర్వీసుల్లోనూ ఇదే విధానాన్ని ప్రవేశ పెట్టి దశల వారీగా కండక్టర్ల సంఖ్యను కుదించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలన్నది యాజమాన్యం ఎత్తుగడ. ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలుండగా వాటిపై దృష్టి సారించకుండా ఉద్యోగుల సంఖ్యను కుదించడం ద్వారానే ఆర్థిక భారం తగ్గించుకోవాలని చూస్తున్న తీరుపై కార్మిక వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పాటు ఇటీవల యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలూ వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తులకు టిమ్ములు అప్పగిస్తుండటంతో కార్మికులు ఆందోళన బాట పట్టనున్నట్లు వారు చెబుతున్నారు. నేతలపై కేసుల నమోదు.. ప్రసుత్తం రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి అద్దె బస్సులూ దూరప్రాంతాలకు తిరుగుతున్నాయి. గతంలో ఒక్కో బస్సులో డ్రైవర్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి, ఆర్టీసీ కండక్టర్లు విధులు నిర్వర్తించే వారు. ఇటీవల యాజమాన్యం అద్దె బస్సుల్లో టిక్కెట్లు ఇచ్చేందుకు యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులకే సర్వాధికారాలు అప్పగించింది. దీంతో కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. కొన్నిరోజుల కిందట గుంటూరు డిపో నుంచి విశాఖపట్నానికి పైవేట్ బస్సు పంపిస్తూ, దానిలో హైర్ బస్సు వ్యక్తికే టిమ్‌ను అప్పగించటంతో నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సును కదలనివ్వమని రాస్తారోకో దిగారు. దీనిపై పాతగుంటూరు పోలీసుస్టేషన్లో ఎన్ఎంయూ నేతలపై కేసు కూడా నమోదయింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు తాత్కాలికంగా ఆర్టీసీ డ్రైవర్‌ను కండక్టర్‌గా పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కొన్నాళ్ల క్రితం కృష్ణా జిల్లా నూజీవీడు డిపోకు చెందిన ఓ ప్రైవేట్ బస్సులో ప్రైవేటు వ్యక్తి వేలల్లో డబ్బులు తీసుకుని పరారడయ్యాడని కార్మిక నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని బయటకు తెలియనీయకుండా అధికారులు జాగ్రత్తలు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. పోరుకు సన్నాహాలు.. హైర్ (అద్దె) బస్సుల్లో ప్రైవేట్ వ్యక్తులకు టిమ్ములు అప్పగించటంపై కార్మిక సంఘాలు పోరుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నాయి. యాజమాన్యం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామంటున్నాయి. ఇప్పటికే కార్మిక సంఘాల నేతలు హైర్ బస్సుల్లో ప్రైవేట్ వ్యక్తులకు టిమ్ములు అప్పగించ చూస్తే సహించొద్దని ఆయా డిపోల నేతలకు మౌఖికంగా చెప్పినట్లు సమాచారం. రీజియన్ పరిధిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మరోసారి పునరావృతమైతే సహించొద్దన్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం ఆఖరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే ! -
కండక్టర్ల కస్సు‘బస్సు’
- ఆంధ్ర- తెలంగాణల మధ్య చార్జీల చిచ్చు - ఏపీఎస్ ఆర్టీసీ చార్జీల పెంపు.. - తెలంగాణ బస్సుల వైపు ప్రయాణికుల మొగ్గు సాక్షి, హైదరాబాద్: అది విజయవాడ బస్టాండ్.. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్లాట్ఫారం వద్దకు వస్తోంది. వెంటనే ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్లు వచ్చి దానిని అడ్డుకున్నారు. రెండు ఏపీ బస్సులు బయలుదేరాకే ఫ్లాట్‌ఫారం వద్దకు రావాలని ఆర్డర్ వేశారు. రోజూ నిలిపే సమయమే కదా అడ్డుకోవడమేంటని టీఎస్ ఆర్టీసీ కండక్టర్ ప్రశ్నించారు. ‘మీ బస్సు వస్తే ప్రయాణికులు ఎగబడి ఎక్కేస్తారు, మా బస్సుల ప్రయాణికుల సంఖ్య పడిపోతుంది.’ అంటూ ఏపీ కండక్టర్లు ఎదురుదాడికి దిగారు. ఇది ఒక్క విజయవాడలోనే కాదు. ఏపీలోని పలు ప్రధాన బస్టాండ్లలో ఏపీ, తెలంగాణ కండక్టర్లు కస్సుబుస్సులాడుకుంటున్నారు. ఇదీ సంగతి... ఇటీవల ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. కానీ, తెలంగాణ ఆర్టీసీ చార్జీలు యధాతథంగా ఉన్నాయి. విజయవాడ-హైదరాబాద్ మధ్య ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ బస్సు టికెట్ ధరల్లో భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఏపీ-తెలంగాణ మధ్య ప్రయాణించే అన్ని రూట్లల్లోనూ ఇదే తీరు. దీంతో ప్రయాణికులు తెలంగాణ బస్సులు ఎక్కేందుకే ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ బస్సు నడిచే సమయానికి ముందు- వెనక తిరిగే ఏపీ బస్సుల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది ఆక్యుపెన్సీ రేషియోపై ప్రభావం చూపుతోంది. దీంతో కీలక వేళల్లో తెలంగాణ బస్సులను ప్లాట్‌ఫాం వద్దకు రాకుండా కొన్నిచోట్ల ఏపీ కండక్టర్లు అడ్డుకుంటున్నారు. దీంతో గత్యంతరం లేక వెనక నిలుపుతున్న తెలంగాణ బస్సు కండక్టర్లు ప్లాట్‌ఫాం వద్దకు వెళ్లి..‘తెలంగాణ బస్సు వెనక ఉంది... వచ్చి కూర్చోండి... టికెట్ ధర కూడా తక్కువ’ అంటూ కేకలు వేస్తూ ప్రయాణికులను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఏపీ ఆర్టీసీ కండక్టర్లు వారితో వాదనకు దిగుతున్నారు. ఒకే రూట్లో ప్రయాణించే వేర్వేరు రాష్ట్రాల బస్సుచార్జీలు ఒకేలా ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని, తెలంగాణలో కూడా బస్సు చార్జీలు సవరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఏపీ అధికారులు తెలంగాణ అధికారులను కోరుతున్నారు. లేని పక్షంలో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఒప్పందం ఉంటే ఏ ఆర్టీసీ బస్సులోనైనా, ఏ రాష్ట్ర భాగంలో ఆ రాష్ట్ర చార్జీని అమలు చేస్తారు. తెలంగాణ భూభాగంలో రెండు ఆర్టీసీలు తెలంగాణ చార్జీని, ఏపీ భూభాగంలో రెండు ఆర్టీసీ బస్సుల్లో ఏపీ చార్జీలను అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, సాంకేతికంగా ఇంకా రెండు ఆర్టీసీలు విడిపోకపోవటం ఈ ఒప్పందానికి అడ్డొస్తోంది. -
ఆర్టీసీ వర్సెస్ పోలీస్
పోలీసులను వారె ంట్, టికెట్లు అడుగుతున్న కండక్టర్లు ఓవర్‌లోడ్ పేరుతో బస్సులకు జరిమానా విధిస్తున్న పోలీసులు బద్వేలు అర్బన్: బద్వేలులో ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన సంఘటనతో నిజమేననే భావన కలుగుతోంది. ఈ నెల 6న ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ఓ ప్రైవేటు బస్సుపై దాడి జరిగిన ఘటనలో పోలీసులు 20 మందిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఇదే సమయంలో బద్వేలు డిపోలోని బస్సులలో ప్రయాణిస్తున్న పోలీసులను కండక్టర్లు వారెంట్ ఉందా, లేక టికెట్ తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పోలీసులు కూడా ఓవర్‌లోడుతో ప్రయాణిస్తున్న బస్సులను ఆపి జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం బద్వేలు నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులను అట్లూరు సమీపంలో అక్కడి పోలీసులు ఆపి తనిఖీలు చేయడంతో పాటు ఏపీ04 డబ్ల్యు 1889 నంబరు గల ఆర్టీసీ బస్సుకు ఒక్క ప్రయాణికుడు ఎక్కువగా ఉన్నాడనే కారణంతో రూ.100లు జరిమానా విధించారు. అలాగే ఏపీ29 జడ్ 3106 నంబరు గల బస్సును సైతం ఆపి పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని రూ.2,000లు జరిమానా చెల్లించాలని సుమారు అర గంట పాటు బస్సును నిలిపివేశారు. చివరకు డీఎం జోక్యం చేసుకుని అక్కడి పోలీసులతో మాట్లాడడంతో బస్సును పంపినట్లు తెలిసింది. అలాగే బుధవారం రాత్రి కూడా ఏపీ28 జడ్ 5547 నంబరు గల ఆర్టీసీ బస్సును సైతం అట్లూరు సమీపంలో అరగంట పాటు ఆపి బస్సు డ్రైవర్ లెసైన్స్‌తోపాటు ప్రయాణికుల సంఖ్యను తనిఖీ చేసినట్లు తెలిసింది. మొత్తమ్మీద సమ్మె కాలంలో జరిగిన ఘటన ఆర్టీసీ సిబ్బందికి, పోలీసులకు నడుమ పెద్ద సమస్యగా మారింది. డీఎం ఏమన్నారంటే: ఈ విషయంపై ఆర్టీసీ డిఎం సుధారాణిని వివరణ కోరగా ఆర్టీసీ బస్సులకు జరిమానా విధించే అధికారం పోలీసులకు లేదని డ్రంక్అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనం నడపడం, ఓవర్ స్పీడ్‌తో వాహనం నడపడం వంటి వాటిపై పోలీసులు తనిఖీ చేసే అధికారం ఉందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు స్టేజీ కేరియర్లు కావని ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని ఆయన పేర్కొన్నారు. సీఐ ఏమన్నారంటే: ఆర్టీసీ బస్సులలో ఓవర్‌లోడ్‌గా ప్రయాణికులను ఎక్కించినా, రోడ్డుకు అడ్డంగా బస్సును ఆపినా, యూనిఫాం లేకున్నా సంబంధిత డ్రైవర్‌కు, కండక్టర్‌కు జరిమానా విధించే అధికారం పోలీసులకు ఉందని తెలిపారు. -
కదలని చక్రాలు
తెలంగాణలో రెండో రోజు రోడ్డెక్కింది 1,550 బస్సులే.. {పయాణికులకు తప్పని తిప్పలు ఇష్టారీతిన చార్జీలు వసూలు చేసిన ప్రైవేటు వాహనదారులు 11వ తేదీ నుంచి ప్యానెల్ రిక్రూట్మెంట్కు యాజమాన్యం నిర్ణయం ఎంపికైన అభ్యర్థులకు నేరుగా ఉద్యోగం విధులకు రాని కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె రెండో రోజైన గురువారం కూడా యథావిధిగా కొనసాగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో బస్సులను డిపోల్లోంచి బయటకు తెచ్చేందుకు యాజమాన్యం ప్రయత్నించినా అది ప్రయాణికులకు ఏమాత్రం ఊరట కలిగించలేదు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 350 బసులు రోడ్డెక్కగా గురువారం 90 శాతం అద్దె బస్సులను అందుబాటులోకి తేవడంతో 1,550 బస్సులు నడిచాయి. అయినా ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. దీన్ని అవకాశంగా మలచుకున్న ప్రైవేటు వాహనదారులు ప్రయాణికులను ఇష్టారీతిన దోచుకున్నారు. కాగా, డిపోల్లోంచి బయటకు వస్తున్న బస్సులు రోడ్డెక్కకుండా చాలా చోట్ల కార్మికులు అడ్డుపడగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇక నియామకాలే... ఆర్టీసీ భవిష్యత్తు ఉద్యోగావకాశాల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బుధవారం ప్రకటించిన ఆర్టీసీ ఎండీ.. ఏకంగా ప్యానల్ రిక్రూట్మెంట్ ప్రారంభిస్తున్నట్లు గురువారం వెల్లడించారు. తాత్కాలిక పద్ధతిలో వచ్చే వారిని ప్యానల్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక చేసి ఆర్టీసీలో ఖాళీ అయ్యే పోస్టుల్లో వారిని భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి శుక్ర/శనివారాల్లో నోటిఫికేషన్ విడుదల చే సి సోమవారం నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మరోవైపు విధులకు హాజరు కాని సుమారు 600 మంది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోంచి తొలగిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇక సర్వీసు క్రమబద్ధీకరణ పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు కార్మికులకు వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా నిర్ణయించారు. విధుల్లో చేరిన వెంటనే రెగ్యులరైజేషన్ సర్టిఫెకెట్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. బస్సులు నడుపండి... డబ్బులు తీసుకోండి అద్దె బస్సులన్నీ రోడ్డెక్కేలా ఆర్టీసీ యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా అద్దె బస్సులకు కిలోమీటరుకు రూ.17 చొప్పున చెల్లిస్తారు. ఇప్పుడు ఆ రూట్లో వసూలైన మొత్తాన్ని అద్దె బస్సు నిర్వాహకులే తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. దీంతో గురువారం ఏకంగా 1,100 అద్దె బస్సులు డిపోల్లోంచి బయటకు వచ్చాయి. మరోవైపు సమ్మె నేపథ్యంలో ఇతర రాష్ట్రాల బస్సులు అధికంగా తిరిగేలా కూడా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌లో రోడ్డెక్కిన 400 బస్సులు సమ్మె వల్ల హైదరాబాద్‌లోని 28 డిపోల పరిధిలో గురువారం 400 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ జయరావు తెలిపారు. శుక్రవారం నాటికి మరిన్ని బస్సులు పెరిగే అవకాశం ఉందన్నారు. కాగా, ప్రైవేట్ సిబ్బందిపై ఒకటి రెండు చోట్ల దాడికి దిగిన నలుగురు కార్మికులపై పోలీసులు కేసు సమోదు చేశారు. రాణిగంజ్-2 డిపోకు చెందిన ఒక కండక్టర్‌ను ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు. సమ్మెకు మద్దతు: ఉత్తమ్, పొన్నాల, పొన్నం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, పీఆర్సీ, ఫిట్మెంటు, సౌకర్యాలు ఇస్తామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావంగా ఉంటామన్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండా ఎస్మాతో భయపెట్టే ప్రయత్నాలు చేయడం సరైంది కాదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఎవరి వాదన వారిదే 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే సంస్థపై ఏడాదికి రూ. 1800 కోట్ల భారం పడుతుంది. - ఇది ఆర్టీసీ యాజమాన్యం వాదన ఇదంతా తప్పడు లెక్క. ప్రస్తుతం కార్మికులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) కోసం రూ.382 కోట్లు చెల్లిస్తున్నారు. దీనిని 27 శాతం ఫిట్‌మెంట్‌గా మారిస్తే అదనంగా పడే భారం మరో రూ.100 కోట్లు మాత్రమే. ఇక 43 శాతం ఫిట్మెంట్లో మిగిలిన 16 శాతానికి ఏడాదికి అయ్యే మొత్తం రూ.450 కోట్లు. అంటే కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ అమలుచేస్తే సంస్థపై పడే అదనపు భారం కేవలం రూ.550 కోట్లు మాత్రమే. - ఇది కార్మిక సంఘాల వాదన కార్మిక సంఘాలు చెబుతున్న లెక్క తప్పు. 27 శాతం ఐఆర్‌ను 27 శాతం ఫిట్‌మెంట్‌గా మారిస్తే సంస్థపై రూ.850 కోట్ల అదనపు భారం పడుతుంది. - ఇది ఆర్టీసీ యాజమాన్యం జవాబు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే ప్రయోజనాలన్నీ కూడా ఇప్పుడే కలిపేసి ఫిట్మెంట్ కోసం వెచ్చించే మొత్తాన్ని ఎక్కువగా చూపిస్తున్నారు. అది సరికాదు. - కార్మికసంఘాల స్పష్టీకరణ చర్చలకు సిద్ధం కార్మికులతో చర్చలకు నేను సదా సిద ్ధం. వారి వద్దకే రమ్మంటే అందుకూ సిద్ధమే. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సమ్మె విరమించాలి. సమస్య పరిష్కారానికి కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 27 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తే... రూ. 15 వేల మూలవేతనం హెచ్ఆర్ఏతో సంబం ధం లేకుండా రూ. 26 వేలకు పెరుగుతుంది. ఇది చిన్న విషయం కాదు. దీన్ని కార్మికులు గుర్తించాలి. కార్మికులకు ఇళ్ల స్థలాలిచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీన్ని కొలిక్కి తెచ్చే సమయంలో సమ్మెకు దిగారు. ఇది ఇదివరకు తీసుకున్న నిర్ణయమే. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. వాటిని అడ్డుకుంటే మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగులను తీసుకున్నా భద్రత విషయంలో రాజీపడం. రవాణాశాఖ డీటీసీలు సర్టిఫై చేసిన డ్రైవర్లనే ఎంపిక చేస్తున్నాం. గురువారం సిరిసిల్లలో ఓ వ్యక్తి మరణానికి కారణమైన బస్సు ఆర్టీసీ అద్దె బస్సు. దాన్ని నడిపింది కొత్త డ్రైవర్ కాదు. సమ్మె నేపథ్యంలో ఉద్రిక్తతలకు కారణం ఆర్టీసీ యాజమాన్యం కాదు. దానికి కార్మికులే బాధ్యత వహించాలి. - సాంబశివరావు, ఆర్టీసీ ఎండీ ఏపీలోనూ కొనసాగిన సమ్మె హైదరాబాద్, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం రెండోరోజు కూడా ఆర్టీసీ సమ్మె కొనసాగింది. మెట్టు దిగని ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక సిబ్బందిని నియమించి అద్దె బస్సులను తిప్పే ప్రయత్నాలు చేసింది. ఆందోళనల రూపంలో అడ్డుకున్న కార్మికులపై లాఠీచార్జి, అరెస్టు చేయడం వంటి చర్యలతో పరోక్షంగా ఎస్మా ప్రయోగానికి ప్రభుత్వం పూనుకుంది. రెండు రోజులకు ఆర్టీసీకి రూ.30 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలోని అన్ని రీజియన్లలో 3,258 బస్సులు నడిపినట్లు ప్రభుత్వం పేర్కొంది. సంస్థలోని 2,099 అద్దె బస్సుల్లో 1,777, సంస్థకు చెందిన 8,663 బస్సుల్లో 1,481 నడిపినట్లు తెలిపింది. చిన్న ఘటనలు మినహా సమ్మె రెండో రోజు విజయవంతమైంది. అనుభవంలేని డ్రైవర్లతో ప్రమాదాలు.. : ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, యాజమాన్యం తాత్కాలిక సిబ్బందిని నియమించి సమ్మె విచ్చిన్నకర చర్యలు చేస్తున్నాయంటూ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు మండిపడుతున్నారు. ఏమాత్రం అనుభవంలేని డ్రైవర్ల వల్ల గురువారం విశాఖ జిల్లాలో మూడు, కృష్ణా జిల్లాలో నాలుగు స్వల్ప ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు తాత్కాలిక కండక్టర్లకు ట్రిమ్, టిక్కెట్లు ఇవ్వకపోవడంతో ప్రయాణికుల నుంచి టికెట్ మొత్తంతో నిమిత్తం లేకుండా అదనపు వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. శ్రీకాకుళంలో గురువారం అదనపు వసూలు చేసిన కండక్టర్లతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. కాగా ప్రభుత్వం, యాజమాన్యం మొండివైఖరికి పోకుండా కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు డిమాండ్ చేశారు. రెండోరోజు 38 శాతం బస్సులు: శిద్ధా రెండో రోజు గురువారం 38 శాతం బస్సులు నడిపామని, శుక్రవారం 55 శాతం బస్సులు తిప్పుతామని రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు మీడియాకు తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని తాను అన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవాలని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం యూనియన్ నేతల్ని చర్చలకు పిలిచేది లేదని, కానీ వారు వస్తే చర్చించడానికి సిద్ధమని మంత్రి చెప్పారు. ఎంసెట్, డీఎస్సీ పరీక్షలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్టీసీ సమ్మెకు మావోయిస్టుల మద్దతు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సీపీఐ (మావోయిస్టు) పార్టీ మద్దతు తెలిపింది. ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్న కుట్రలో భాగం కావద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ఏర్పడి 10 నెలలైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలు నేరవేర్చలేకపోయిందని విమర్శిం చింది. ఈ మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో హిందూ మతోన్మాద ప్రభుత్వం, తెలంగాణ, ఏపీల్లో టీఆర్ఎస్, టీడీపీల పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని పేర్కొన్నారు. -
ఏపీలో ఎక్కడి బస్సులు అక్కడే
-
ఏపీలో ఎక్కడి బస్సులు అక్కడే..
హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఏపీలోని 13 జిల్లాల్లోని 9,640 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్నిచోట్ల అధికారులు అద్దె బస్సుల్ని నడిపించినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఎక్కువమంది ప్రయాణికులు ట్యాక్సీలు, ఆటోల్లోనే ప్రయాణించారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీకి సమ్మె ఆరంభమైన మొదటిరోజైన బుధవారం రూ.18 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కడప జోన్లలో హెవీ లెసైన్సులున్న వారిని డ్రైవర్లుగానూ, పదోతరగతి పాసైనవారిని కండక్టర్లుగా తీసుకుని కొన్ని రూట్లలో అద్దె బస్సుల్ని నడిపారు. విశాఖ నగరంలో 270 హైర్ బస్సులను అధికారులు ఆపరేట్ చేసినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. వందలాది బస్సులు నిలిచిపోవడంతో విశాఖ జిల్లా ఆర్టీసీ ఒక్కరోజులోనే రూ.70 లక్షల ఆదాయం కోల్పోయింది. విజయవాడ జోన్ పరిధిలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి రీజియన్లలో 3,050 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ మూడు జిల్లాల్లోనూ 576 అద్దె బస్సులుండగా బుధవారం అతికష్టం మీద 170 బస్సులను నడిపారు. ఉదయం 10 గంటల నుంచి గుంటూరు డిపోలో నిరసన ప్రారంభించిన కార్మికసంఘ నాయకులను మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. నేటి నుంచి తిరుమలకు బస్సులు: ఆర్టీసీ సమ్మెతో వెంకన్న భక్తులు బుధవారం తీవ్ర అవస్థలు పడ్డారు. దూరప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకోగలిగినా తిరుమల బస్సులకోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. తిరుమల డిపోలో మొత్తం 110 బస్సులు ఉండగా సమ్మె కారణంగా బుధవారం 43 బస్సులే తిరిగాయి. సమ్మెతో భక్తులకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. ఆయన వినతి మేరకు తిరుమల, తిరుపతి మధ్య నిరంతరాయంగా తిరుమల డిపోకు చెందిన బస్సులను గురువారం నుంచి నడిపేందుకు యూనియన్ నాయకులు హామీఇచ్చారు. ఎస్మా బెదిరింపులకు భయపడం సమ్మెను ఉధృతం చేస్తాం: టీ ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న యాజమాన్యం బెదిరింపులకు భయపడబోమని తెలంగాణ ఆర్టీసీ కార్మిక యూనియన్ల జేఏసీ పేర్కొంది. బుధవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు కె.పద్మాకర్, టీఎంయూ నాయకుడు అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ సూపర్వైజర్స్ యూనియన్ నాయకుడు కృష్ణమోహన్ మాట్లాడారు. సమ్మెకు తెలంగాణ రైల్వే ఉద్యోగుల సమాఖ్య మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్ర సీ నేతలు సాదినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు కె.శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ మనుగడకే ప్రమాదం కార్మికులు విధుల్లో చేరాలి: ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా వెంటనే సమ్మె విరమించాలని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికులను వేధించే ఉద్దేశం తమకు లేదన్నారు. ఆర్టీసీ చరిత్రలో కార్మికులకు 24 శాతానికి మించి ఫిట్మెంట్ ఇచ్చిన దాఖలా లేదని.. తాను సాహసించి ఈసారి 27 శాతానికి స్థిరీకరించేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపే ప్రయత్నాలను కొన్నిచోట్ల కార్మికులు అడ్డుకుంటున్నారని.. దానిని సహించబోమని, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గురువారం నుంచి అద్దె బస్సులు తిరుగుతాయని భరోసా ఇచ్చారు. ఏపీలో ఎంసెట్ పరీక్ష జరిగే ఎనిమిదో తేదీన అద్దె బస్సులన్నీ వారికి కేటాయిస్తామని తెలిపారు. అవసరమైతే ఎస్మా : ఏపీ మంత్రి శిద్ధా ఒంగోలు: ‘‘ఆర్టీసీ కార్మికులకు 27 శాతం ఫిట్‌మెంట్‌ను రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. 43 శాతం కావాలంటూ యూనియన్లు పట్టుబడుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో సబ్‌కమిటీని వేసింది. ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లు సబ్ కమిటీని సంప్రదించకుండానే సమ్మెకు దిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతోపాటు అవసరమైతే సమ్మెకు దిగిన వారిపై ఎస్మాను ప్రయోగించేందుకు వెనుకాడం’’ అని రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యామ్నాయాలు సిద్ధం ఏపీ మంత్రి రావెల ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరువేల సర్వీసులకుగాను 600 సర్వీసులే నడపగలిగామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణాశాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, రైల్వేశాఖ అధికారులతో సమీక్ష జరిపామన్నారు. ప్రత్యేక రైళ్లు నడపడానికి, బోగీలు పెంచడానికి.. రైల్వేశాఖ అంగీకరించిందన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి : పొంగులేటి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించి, సమ్మెను విరమింపజేయాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌చేశారు. ఆర్టీసీ కార్మికులను చిన్నచూపు చూడడం తగదని, బస్సులు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కూడా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన చేశారు. కాగా ఆర్టీసీ ప్రైవేటీకరణకు బాబు బృందం కుట్ర పన్నుతోందని వైఎస్సార్ టీయూసీ ఏపీ అధ్యక్షుడు పి.గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి సరికాదు: తమ్మినేని కార్మికులను కాపాడుకుంటామని, ఉద్యోగులను కళ్లలో పెట్టి చూసుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల పట్ల నిర్భంద వైఖరితో వ్యవహరించడం దురదృష్టకరమని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు దిగితే చర్చలకు పిలిచి పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం నిర్భందాన్ని ప్రయోగించడం సరికాదని బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. సీఎం జోక్యం చేసుకోవాలి: చాడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జోక్యం చేసుకుని ఆర్టీసి ఉద్యోగులు, సిబ్బంది సమ్మెను విరమింపచేయాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తిచేశారు. బుధవారం ఈ మేరకు సీఎంకు ఆయన ఒక లేఖ రాస్తూ సమ్మె విచ్ఛిన్నానికి, తాత్కాలిక డ్రైవర్ల నియామకానికి ప్రభుత్వం ప్రయత్నించడం కార్మిక వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. బస్సులపై ఆధారపడి న ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, సీఎం స్వయంగా జోక్యం చేసుకుని సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
రివర్స్ గేర్ !
సాక్షి,సిటీబ్యూరో : మీరు ఎక్కాలనుకున్న సిటీ బస్సు ఎక్కడుంది..ఎంతసేపటిలో వస్తుంది.. ఇలా సమస్త సమాచారం సిటీ బస్టాప్‌ల్లో ఉంచుతున్నాం అంటూ ఆర్టీసీ అధికారులు కొద్దికాలంగా చెబుతున్న మాటలు..ప్రస్తుతం దానికి భిన్నంగా సాగుతోంది.. ఉన్నట్టుండి బస్సు రద్దయిపోతోంది. తాము ఎక్కాలనుకున్న బస్సు కోసం నిరీక్షించి వెనుదిరగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రతి రోజు 2.5 లక్షల మంది నుంచి 3 లక్షల మందికి పైగా నగర ప్రయాణికులు సిటీబస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సకాలంలో బస్సు లభించక, ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. డ్రైవర్లు, కండకర్లు ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరే ఇందుకు కారణమని అధికారులు సెలవిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 29 డిపోలు, సుమారు 4 వేల బస్సులు, 30 వేలకు పైగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్కులు, తదితర సిబ్బంది ఉన్న అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ గ్రేటర్ ఆర్టీసీ. ఇప్పటికీ ప్రయాణికుడికి చేరువకాలేకపోతోంది. బస్సులు నడపాల్సిన కండక్టర్లు, డ్రైవర్లు ఆకస్మికంగా విధులకు గైర్హాజరు కావడమే ఇందుకు కారణం. వందలాది మంది ఎడాపెడా సెలవులు వినియోగిస్తున్నారు. దీంతో వేలకొద్దీ ట్రిప్పులు రద్దవుతున్నాయి. సెలవులకు సంబంధించి సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కేవలం ప్రయాణికులకు సదుపాయం అందజేయలేకపోవడమే కాకుండా,ఆర్జిత సెలవులు కోల్పోవడం వల్ల సిబ్బంది సైతం ఆర్థికంగా నష్టపోతారంటూ ప్రచారం చేపట్టింది. భారీగా రద్దవుతున్న సర్వీసులు... గ్రేటర్‌లోని 29 డిపోల్లో 3850 కి పైగా సిటీ బస్సులు ప్రతి రోజు 42 వేల ట్రిప్పుల్లో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 1050 రూట్లలో 34 లక్షల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే, మరోవైపు ఒక్కో డిపోలో పెద్దసంఖ్యలో ట్రిప్పులు రద్దవుతున్నాయి. సాధారణంగా కండక్టర్లు,డ్రైవర్లకు రేపు చేయాల్సిన విధుల వివ రాలను ఈ రోజే ప్రకటిస్తారు. వారాంతపు సెలవులు, సిక్‌లీవ్‌లు, క్యాజువల్ లీవ్‌లపై వెళ్లిన వాళ్ల వివరాలు సైతం నోటీస్బోర్డులలో ప్రదర్శిస్తారు. కానీ చాలా మంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక సెలవులు తీసుకోవడంతో రోడ్డెక్కాల్సిన బస్సులు డిపోల్లోనే నిలిచిపోతున్నాయి. ఒక్కొక్క డిపోలో 30 నుంచి 50 మంది ఇలా సెలవులపై వెళ్తున్నట్లు అంచనా. దీంతో ప్రతి డిపోలో రోజుకు సగటున 80 నుంచి 100 సర్వీసుల వరకు రద్దవుతున్నాయి. గ్రేటర్‌లోని 29 డిపోల్లో ప్రతి రోజు సగటున 2500 ట్రిప్పులు రద్దవుతున్నాయి. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సు నడపండి భవిష్యత్తు బాగుంటుంది... ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యానే కాకుండా సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా అనవసరమైన సెలవులు తీసుకోకుండా బస్సులు నడపాలని కోరుతూ ఆర్టీసీ ప్రచారం చేపట్టింది. సాధారణంగా ప్రతి ఏటా 15 ఆర్జిత సెలవులు ఉంటాయి. సిబ్బంది ఇష్టారాజ్యంగా సెలవులు తీసుకోవడం వల్ల ఈ ఆర్జిత సెలవుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో ఆర్జిత సెలవులపై వచ్చే లక్షలాది రూపాయాల ఆదాయాన్ని ఉద్యోగులు కోల్పోతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఉదాహరణకు ప్రతి ఉద్యోగి తన ఖాతాలో కనీసం 300 ఆర్జిత సెలవులను జమ చేసుకొంటే అతనికి పదవీ విరమణ తరువాత రూ.8.66 లక్షల ఆదాయం లభిస్తుంది. ఇలా ఆర్జిత సెలవులు పెరిగిన కొద్దీ ఆదాయం పెరుగుతుందని, అందుకు సెలవులు తగ్గించుకొని బస్సులు నడపడమే ఏకైక పరిష్కారమని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్యాంపెయినింగ్ ఉద్యోగుల్లో అవగాహన పెంచగలిగితే వారి ఆదాయంతో పాటు, సిటీ బస్సుల ట్రిప్పులు కూడా పెరుగుతాయని ఆర్టీసీ అంచనా. -
డ్రైవర్‌కే కండక్టర్ పని కుదరదు
టిమ్స్‌పై తీర్పు సవరణకు హైకోర్టు నో సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు డ్రైవర్లు టికెట్ల జారీ యంత్రాల(టిమ్స్)ను వినియోగిస్తూ కండక్టర్ల విధులను కూడా నిర్వర్తించడానికి వీల్లేదంటూ తామిచ్చిన తీర్పును సవరించేందుకు ఉమ్మడి హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. డ్రైవర్లు ఇలా కండక్టర్ విధులను కూడా నిర్వర్తిం చడం మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని మరోసారి గుర్తు చేసింది. ఆర్థిక భారం పేరుతో నిబంధనలను ఉల్లంఘించడం సరికాదని హితవు పలికింది. కావాలంటే డ్రైవర్లకు టిమ్స్ అప్పగించి కండక్టర్ విధులను నిర్వర్తింప చేసేందుకు వీలుగా చట్టంలో నిర్దిష్ట నిబంధనలు రూపొందించుకోవచ్చునని మరోసారి స్పష్టం చేసింది. డ్రైవర్లతో కండక్టర్ విధులను నిర్వర్తించరాదంటూ గత ఏడాది డిసెంబర్ 1న ఇచ్చిన తీర్పును సవరించాలన్న ఆర్టీసీ యాజమాన్యం అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో సవరణ నిమిత్తం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని యాజమాన్యం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ కోరటంతో కోర్టు ఆమోదించింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్టాలు చేసేవారే ఉల్లంఘిస్తారా? టిమ్స్ బాధ్యతలు అప్పగించి కండక్టర్ విధులను కూడా నిర్వర్తించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారంటూ కొందరు డ్రైవర్లు 2011లో హైకోర్టును ఆశ్రయించటం తెలిసిందే. బస్సులను నడిపేటప్పుడు డ్రైవర్లు ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత వారిపై ఉందని, అందువల్ల కండక్టర్‌గా కూడా విధులను నిర్వర్తించాలనడం ఎంత మాత్రం సరికాదంటూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. కోర్టు తీర్పుతో కొత్తగా 7,200 మంది కండక్టర్లను నియమించాల్సి ఉంటుందని, ఆర్థిక భారం దృష్ట్యా తీర్పును సవరించాలంటూ ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కూడా ధర్మాసనం శుక్రవారం విచారించింది. అయితే ఆర్థిక భారం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. చట్టాలు చేసే అధికారులే వాటిని ఉల్లంఘించడం సరికాదని పేర్కొంది. -
ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
-
ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
జిల్లాలో 500 మంది పర్మినెంట్‌కు అవకాశం సాక్షి, విజయవాడ : ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లను పర్మనెంట్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 నుంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయీ) బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈయూ ప్రతినిధులతో బుధవారం సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లును పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో 500 మందికి అవకాశం... 2012, డిసెంబర్ 31వ తేదీలోపు ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. దీంతో కృష్ణా రీజియన్ పరిధిలో 382 మంది డ్రైవర్లు, 118 మంది కండక్టర్లు మొత్తం 500 మంది పర్మనెంట్ కానున్నారు. ఇప్పటి వరకు వీరికి రెగ్యులర్ డ్రైవర్‌తో సమానంగా వేతనం వచ్చినప్పటికీ, డీఏ, హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్సులు వచ్చేవి కావు. ప్రస్తుతం వీరిని పర్మనెంట్ చేయడంతో అన్ని రకాల అలవెన్సులు లభిస్తాయి. ఇప్పటికే రీజియన్ పరిధిలో 5,400 మంది పర్మనెంట్ డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు. వచ్చే ఏడాది మరికొంతమందికి అవకాశం... గతంలో ఆర్టీసీ యాజమాన్యానికి, యునియన్ నేతలకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 2013 తరువాత ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్లు, కండ క్టర్లుగా చేరినవారికి రెండేళ్లు సర్వీసు పూర్తయిన వెంటనే పర్మనెంట్ చేయాల్సి ఉంది. ఇక నుంచి ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లను పర్మనెంట్ పద్ధతిలోనే తీసుకోవాలని, కాంట్రాక్టు పద్ధతిని విడనాడాలని ముఖ్యమంత్రితో జరిపిన చర్చల్లో యూనియన్ నేతలు కోరగా, సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు ‘సాక్షి’కి తెలిపారు. -
విద్యార్థుల వీరంగం
క్రమంతప్పకుండా కాలేజీలకు వెళ్లి విద్యాబుద్దులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు బస్‌డే పేరుతో వీరంగం సృష్టించారు. రాళ్లు కర్రలతో దాడులకు పాల్పడి పలువురిని గాయపరిచారు. మరో సంఘటనలో బస్సును దారిమళ్లించి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేశారు. - బస్సులపై రాళ్ల వర్షం - పలువురికి గాయాలు - శృతిమించుతున్న బస్‌డే చెన్నై, సాక్షి ప్రతినిధి: నగరంలోని కళాశాలల విద్యార్థులు బస్‌డే పేరుతో కొంతకాలంగా విశృంఖలత్వాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారింది. బస్‌డే అమలులో భాగంగా బస్సు డ్రైవర్లను భయపెట్టి నెమ్మదిగా నడిపించడం, దారిమళ్లించడం వంటి చర్యలకు దిగుతున్నారు. వారిని ఎదిరించిన డ్రైవర్, కండక్టర్లను దుర్భాషలాడడంతోపాటు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఎంఎండీఏ రోడ్డు- ప్యారిస్ బస్సు (12జీ) కీల్పాక్ మీదుగా వెళుతుండగా కీల్కాక్ వైద్య కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బస్సు ఎక్కారు. ఫుట్‌బోర్డుపై నిల్చుని పాటలు పాడుతూ సాగారు. బస్సును తాబేలు వేగంతో నడపాలని ఆదేశించారు. ఈ బస్సు పూందమల్లి రోడ్డులోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం దాటగానే విద్యార్థులు హద్దుమీరారు. కొందరు బస్టాప్పైకి ఎక్కి నృత్యాలు చేశారు. మరికొందరు డ్రైవర్ సీటు వద్ద నిలబడి ఫొటోలు దిగారు. ఇంకో విద్యార్థి డ్రైవర్‌ను అతని సీటు నుంచి లేపి తాను నడిపే ప్రయత్నం చేశాడు. వారి చేష్టలకు భీతిల్లిన ప్రయాణికులు రహస్యంగా ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాకను గమనించిన విద్యార్థులు పరుగులు తీశారు. డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు ఎవ్వరూ వారిపై ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదు. విద్యార్థుల మధ్య పరస్పరం దాడులు రెండు కాలేజీలకు చెందిన విద్యార్థులు శుక్రవారం పరస్పరం దాడులకు పాల్పడి బస్సులోని ప్రయూణికులను భయభ్రాంతులకు గురిచేశారు. పెరంబూరు - తిరువేర్కాడు (29ఈ) బస్సు ప్రయాణికులతో వెళుతుండగా మార్గమధ్యంలో పచ్చపాస్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎక్కారు. బస్సులోపల స్థలం ఉన్నా ఫుట్‌బోర్డుపై ప్రయాణించారు. ఈ బస్సుకు ఎదురుగా మరో కాలేజీ విద్యార్థులతో అన్నాసమాధి- పెరంబూరు (29ఏ) బస్సు ఓట్టేరి బ్రిడ్జి వద్ద తారసపడింది. 29ఈ బస్సు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న విద్యార్థులను మరో బస్సులోని విద్యార్థులు దుడ్డుకర్రలతో కొట్టారు. బస్సుపై రాళ్లు రువ్వారు. దెబ్బలకు తాళలేక విద్యార్థులు బస్సులోపలికి వెళ్లిపోయారు. వారి దాడులతో రెండు బస్సుల్లోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఈ గందరగోళాన్ని గమనించిన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో దాడులకు పాల్పడిన వారు పరారయ్యూరు. రాళ్ల వర్షంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ దాడుల్లో బస్సులోని మహిళా ప్రయాణికులు రోషిణి, విజయభారతి, విద్యార్థులు భూపేష్, రామ్‌కుమార్ గాయపడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాజీ అనే విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన
నార్కట్‌పల్లి : డిపో మేనేజర్ వెంకట్‌రెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం నార్కట్‌పల్లి డిపోలో పని చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు విధులు బహిష్కరించారు. డిపోఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి నరేందర్ మాట్లాడుతూ డిపోలో పనిచేస్తున్న కండక్టర్, డ్రైవర్ల సీనియారిటీ ప్రకారం డ్యూటీలు వేయకుండా డిపో అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో కార్మికులు వీక్లీఆఫ్‌లు కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అనేక పర్యాయాలు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎంఈ జాన్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం అనిల్‌కుమార్‌లు డిపోవద్దకు చేరుకొని యూనియన్ నాయకులతో చర్చించారు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఐతరాజు వెంకటయ్య, యాసిన్అలి, ప్రభాకర్, వెకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కొలువుల్లేవ్!
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: అతిపెద్ద ప్రభుత్వ రంగ ప్రజా రవాణా సంస్థగా రికార్డు సృష్టించిన ఏపీఎస్ ఆర్టీసీలో కొత్త కొలువుకు బాటలు పడలేదు. ఉద్యోగాల భర్తీకి నాలుగేళ్ల క్రితం పడిన బ్రేక్ ఇప్పటికీ కొనసాగుతునే ఉంది. గిన్నీస్ రికార్డు సాధించిన ఈ సంస్థలో డ్రైవర్, కండక్టర్లను తీసుకునే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే నియామకమైన కార్మికుల ఉద్యోగాలకు భరోసా కరువైంది. ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఉన్న సిబ్బందితోనే సంస్థ కాలం వెళ్లదీస్తోంది. రోజురోజుకు జనాభా పెరుగుతుండడంతో ప్రయాణాల సంఖ్య ఎక్కువవుతోంది. వీరికి రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆర్టీసీ ద్వారా బస్సులు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో ఆర్టీసీ నష్టాల బాటపట్టాల్సి వచ్చింది. ఈ సంస్థలో పని చేసిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించలేకపోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియమించిన కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలకు భద్రత ఇవ్వలేకపోతోంది. సంస్థను నమ్ముకొని వచ్చిన నిరుద్యోగలు ఆశలపై నీళ్లు చల్లుతోంది. 60శాతం కంటే తక్కువగా ఆక్యూపెన్షీ రేషియో (ఓఆర్) వచ్చే బస్సు సర్వీసులను ఎత్తివేయడం, ఆతరువాత బస్సు షెడ్యూళ్లు తగ్గాయనే కారణం చూపి ‘డిస్ఎంగేజ్’ పేరుతో విధుల నుంచి తప్పించి ఇంటికి పంపడం వంటి చర్యలకు పాల్పడుతోంది. నియామకాల వివరాలు: 1995లో జిల్లాలో 120 మంది డ్రైవర్లు, 100 వరకు కండక్టర్లను క్యాజువల్ నియామకాల కింద తీసుకున్నారు. ఆ తరువాతర ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడింది. మళ్లీ 2007లో నోటిఫికేషన్ జారీ చేసి 100 మందికి పైగా డ్రైవర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. 2008లో 250 మంది డ్రైవర్లు, 180 మంది కండక్టర్లను తీసుకున్నారు. ఆ తరువాత 2009లో 160 కండక్టర్ పోస్టులు భర్తీ చేశారు. నియమితులైన వారిని ఖాళీల ఆధారంగా డిపోలకు కేటాయించి విధుల్లోకి తీసుకున్నారు. కాని వీరి నియామకాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. నష్టాల సాకుతో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో యాజమాన్యం వివిధ మార్గాలను అనుసరించింది. ఈ క్రమంలో 2011లో 60శాతం కంటే తక్కువగా ఓఆర్, ఆదాయం వచ్చే రూట్లలో బస్సులను ఎత్తివేయాలని భావించింది. ఈ సమయంలో 70కి పైగా రూట్లతో తిరిగే బస్సులను ఎత్తివేశారు. అనుకున్నంత మేరకు ఆదాయం వచ్చే రూట్లతో మాత్రమే బస్సులు తిప్పి మిగతా వాటిని గ్యారేజీలకే పరిమితం చేశారు. ఈ కారణంగా కార్మికులపై కత్తి పెట్టడంతో రెండేళ్ల కిత్రం 240 మంది డ్రైవర్లు, 100మంది కండక్టర్లు విధుల్లోంచి తొలగించిన విషయం తెలిసిందే. శుభకార్యాలు, పండుగలు, బ్రహ్మోత్సవాల సందర్భాల్లో ప్రత్యేక బస్సులు నడిపేటప్పుడు మాత్రమే అవసరం ఉన్న మేరకు కార్మికులను తీసుకొని, ఆతరువాత మళ్లీ ఇంటికి పంపిస్తూ వస్తునప్నారు. రిటైర్మెంట్లు, పదోన్నతుల ఫలితంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవలే కొంత మందిని తీసుకున్నా మరో 100 మందికి పైగా డ్రైవర్లు 68 మంది కాంట్రాక్టు కార్మికులు ఇంటి వద్దే ఉన్నారు. వీరిలో కొంతమందిని ప్రకాశం జిల్లాలోని డిపోల్లో పనిచేసేందుకు పంపించారు. సిబ్బంది వివరాలు: జిల్లాలోని 11డిపోల్లో ఉన్న 970 బస్సుల్లో 122 అద్దె, 848 ఆర్టీసీ బస్సులున్నాయి. సంస్థ నిబంధనల ప్రకారం 100 బస్సులకు 270 మంది డ్రైవర్లు, 270 మంది కండక్టర్లు ఉండాలి. కాని రెడేళ్ల కిత్రం ఈ సంఖ్యను 260కి కుదించారు. ఈ లెక్కన 848 ఆర్టీసీ బస్సులకు 2205 మంది డ్రైవర్లు, 2205 కండక్టర్లు ఉండాలి. కాని జిల్లాలో కేవలం 2084 మంది డ్రైవర్లు, 1660 మంది కండక్టర్లు మాత్రమే ఉన్నారు. 122 అద్దె బస్సుల్లో డ్రైవర్లను యజమానులే ఏర్పాటు చేసినా కండక్టర్లను సంస్థే నియమించాలి. ఈ లెక్కన అదనంగా 318 మంది కండక్టర్లు అవసరం అవుతారు. కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న కార్మికులు 240 రోజుల పాటు విధులు నిర్వహిస్తే విడతల వారీగా రెగ్యూలర్ చేయాల్సి ఉంది. వివిధ కారణాలతో ఇంటికి పంపి భారాన్ని తగ్గించుకునేందుకే యాజమాన్యం అలోచిస్తుందని ఆర్టీసీ వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం.వి. కుమార్ పేర్కొన్నారు. కండక్టర్ వ్యవస్థను ఎత్తివేసేందుకు టిమ్ (టికెట్ ఇష్యూ మిషన్) విధానాన్ని ప్రవేశపెట్టిందని, డ్రైవర్ల ద్వారానే ఈప్రక్రియ కొనసాగించేందుకు కసరత్తు చేస్తోందన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
24 వేలమంది కండక్టర్లు, డ్రైవర్లు.. ఇక రెగ్యులర్
-
24 వేలమంది కండక్టర్లు, డ్రైవర్లు.. ఇక రెగ్యులర్
ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సర్కారు ఆమోదం.. ఆర్నెళ్లపాటు సమ్మె నిషేధం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 9,500 మంది కాంట్రాక్టు కండక్టర్లు, 14,500 మంది కాంట్రాక్టు డ్రైవర్ల సర్వీసును క్రమబద్ధీకరించనున్నారు. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సంతకం చేశారు. సీనియారిటీ ప్రకారం సర్వీసును క్రమబద్ధీకరిస్తారు. ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణను సర్కారు మూడేళ్లుగా నిలుపుదల చేయడం, జనవరి 3 తర్వాత ఏ రోజైనా సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇటీవలే యాజమాన్యానికి నోటీసివ్వడం తెలిసిందే. 1,720 పోస్టుల భర్తీకి పచ్చజెండా: పలు శాఖల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైళ్లపై కూడా కిరణ్ సంతకం చేశారు. బీసీ సంక్షేమ శాఖలో 600 పోస్టు లు, పోలీసు శాఖలో 30, న్యాయ శాఖలో 20, రెవెన్యూ శాఖలో 20, ఎక్సైజ్ శాఖ లో 150, గిరిజన సంక్షేమ శాఖలో 900 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపారు. సచివాలయంలో 30 మంది చౌకీదారు పోస్టులు సచివాలయంలో చౌకీదారులు సరిపోవడం లేదని, వారి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా 30 చౌకీదారు పోస్టులను ఏర్పాటు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారి వేతనం నెలకు రూ.6,700-20,110 అని పేర్కొన్నారు. ఆర్టీసీలో సమ్మెలు నిషేధం: ఆర్టీసీలో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు సిబ్బంది సర్వీసు క్రమబద్ధీకరణ, చనిపోయిన కాంట్రాక్టు సిబ్బంది కుటుంబీకులకు కారుణ్య నియామకాలు, వేతనాల సవరణ డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాలు కొద్దిరోజుల క్రితం యాజమాన్యానికి సమ్మె నోటీసివ్వడం తెలిసిందే. సానుకూలంగా స్పందించకుంటే జనవరి 3 తర్వాత ఏ రోజైనా సమ్మెకు దిగుతామని అవి హెచ్చరించిన నేపథ్యంలో నిషేధ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. సంఘాలను, ఆర్టీసీ యాజమాన్యాన్ని జనవరి 2న కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. -
ఆర్టీసీలో ఖతర్నాక్ కండక్టర్లు
గద్వాల టౌన్, న్యూస్‌లైన్: నిన్న కల్వకుర్తి డిపోలో, నేడు గద్వాల ఆర్టీసీ డిపోలో..ఇలా రోజుకోచోట నకిలీ కండక్టర్ల ఉదంతం వెలుగుచూస్తూనే ఉంది. ప్రతిభావంతుల పొట్టకొట్టి.. అధికారులను బురిడీ కొట్టించి.. ప్ర భుత్వాన్ని పక్కదారి పట్టించిన ఈ నకిలీ వీరులు జిల్లాలో ఇం కెంతమంది ఉన్నారోనని ఆర్టీసీ అధికారులు వెతికేపనిలో ప డ్డారు. ఈ నేపథ్యంలో గద్వాల ఆర్టీసీ డిపోకు నకిలీ కండక్టర్ల బెడద వణికిస్తోంది. బోగస్ సర్టిఫికేట్లు సమర్పించి ఉద్యోగాలు పొందిన కండక్టర్లపై ఆర్టీసీ సంస్థ కఠినంగా వ్యవహరించింది. అలా ఉద్యోగాలు పొందిన వారిలో గద్వాల డిపోకు చెందిన 9 కండక్టర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇక్కడ మరికొంతమంది కండక్టర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. మహబుబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో కాం ట్రాక్టు పద్ధతిన 2009లో కండక్టర్ల నియామకం చేపట్టారు. ఆ సమయంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కండక్టర్లు ఉద్యోగం సాధించారు. అలా నియామకమైన వారిని 2012లో ఆర్టీసీ యాజమాన్యం రెగ్యులర్ చేసింది. రెగ్యులర్ అయిన తరువాత ఉద్యోగులపై ఆర్టీసీ విజిలెన్స్‌శాఖ విచారణ మొదలుపెట్టింది. అందులో కొంతమంది సమర్పించిన ఎస్ఎస్సీ సర్టిఫికేట్లపై విజిలెన్స్ అధికారులకు అనుమానాలు వచ్చాయి. దీంతో వెంటనే వారు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించారు. అధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్‌శాఖ రహస్యంగా విచారణ చేపట్టింది. ఉద్యోగ నియామక సమయంలో అభ్యర్థులు సమర్పించిన మార్కుల మెమోలోని హల్‌టికెట్ నంబర్ ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు వెళ్లి అధికారులు ఆరాతీశారు. అక్కడ బోగస్ వ్యవహారం బట్టబయలైంది. ఎస్ఎస్సీ బోర్డు ద్వారా మంజూరైన మార్కుల మెమోకు, అభ్యర్థులు సమర్పించిన మెమోకు ఎక్కడా పొంతనలేదు. దీంతో మె మోలో మార్కులను టాంపరింగ్ చేసినట్లు గుర్తించారు. మార్కులను టాంపిరింగ్ చేసి అధిక మార్కులుగా నమోదు చేసినట్లు నిర్ధారణ అయింది. ఇలా బోగస్ సర్టిఫికేట్లు సమర్పించి 9 మంది కండక్టర్లుగా ఉద్యోగాలు పొందినట్లు విజిలెన్స్ శాఖ గుర్తించింది. సుమారు ఆరు నెలలపాటు వి చారణ సాగింది. అక్రమమార్గంలో కండక్టర్ ఉద్యోగాలు పొందిన 9 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఆర్టీసీ యా జమాన్యం రెండు రోజుల క్రితం గద్వాల డిపోకు ఆదేశాలు జారీచేసింది. వీరిలో విజయ భాస్కర్, రాములు, చంద్రశేఖ ర్, రామకృష్ణ, రవికుమార్, మన్యంకొండ, జానకి, వెంకటేశ్వర్‌రెడ్డి, భోజరాజులు ఉన్నారు. వారిని విధుల నుంచి తొలగించినట్లు డిపో మేనేజర్ భీంరెడ్డి తెలిపారు. ఆ 14 మంది ఎవరు? బోగస్ సర్టిఫికేట్లతో కండక్టర్ ఉద్యోగాలు పొంది విధుల నుంచి తొలగించబడిన అభ్యర్థులు విచారణ సమయంలో విజిలెన్స్ అధికారులకు కళ్లుతిరిగే వాస్తవాలను వెల్లడించినట్లు తెలుస్తుంది. 2009 కంటే ముందు నియమితులైన వారిలో సైతం చాలామంది కండక్టర్లు తమలాగే ఉద్యోగాలు పొందారని వెల్లడించినట్లు సమాచారం. వారు చూపిన మార్గాన్ని తాము అనుసరించి బోగస్ సర్టిఫికేట్లు సంపాదించామన్నారు. వారిని వదిలి తమను మాత్రమే విధుల నుంచి తొలగిస్తే ఎలాగని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంకా గద్వాల డిపోలో 14 మంది నకిలీ కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని, వారిలో సైతం విజిలెన్స్ గుబులు పుట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డిపోలో ఆ 14 మంది కండక్టర్లు ఎవరనేదానిపై కార్మికులల్లో చర్చ సాగుతోంది. ఆర్టీసీలో 2009కు ముందు జరిగిన నియామకాలతో పాటు ఇతర శాఖల్లో సైతం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో బోగస్ సర్టిఫికేట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని ఒక ఆర్టీసీలోనే 200 మందికి పైగా కండక్టర్లు బోగస్ సర్టిఫికేట్లతో అక్రమమార్గంలో ఉద్యోగాలు పొందినట్లు తెలిసింది. మార్కుల టాంపరింగ్ చేసిందెవరు? ఎస్ఎస్సీ మెమోలో టాంపరింగ్ ద్వారా అధిక మార్కులు నమోదు చేసిన అక్రమార్కులను గుర్తించే పనిలో విజిలెన్స్ అధికారులు ఉన్నారు. వనపర్తి మండలం కడుకుంట్ల చెందిన ఓ దళారీ ద్వారా టాంపరింగ్ చేసిన సర్టిఫికేట్లు వస్తున్నాయి. విధుల నుంచి తొలగించిన కండక్టర్లు సైతం ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. గతంలో కూడా ఇలా మార్కులను టాంపరింగ్ చేసిన సర్టిఫికేట్లతో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించినట్లు సమాచారం. వనపర్తి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన చాలా మంది నుంచి పెద్ద మొత్తంలో ఈ దళారీ డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అక్రమమార్గంలో ఉద్యోగాలు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కొరుతున్నారు. బాధ్యులపై చర్యలు జిల్లా 47మంది నకిలీ సర్టిఫికేట్లు సమర్పించి కండక్టర్ ఉద్యోగాలు పొందినట్లు అభియోగాలు వచ్చాయి. ఈ మేరకు ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు ఎస్ఎస్సీ బోర్డుకు వెళ్లి ఆయా వ్యక్తులు సమర్పించిన సర్టిఫికేట్లపై విచారణ చేపట్టారు. ఈ విచారణ కూడా దాదాపు పూర్తయింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. - గంగాధర్, ఆర్టీసీ ఆర్ఎం, మహబూబ్‌నగర్ -
ప్రైవేటు బస్సులు రోడ్డెక్కితే ఖబడ్దార్
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటుండగా, ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు సర్వీసులు నడుపుతూ ప్రజలను దోచుకునే పనిలో పడ్డాయని ఆర్టీసీ ఉద్యోగులు విమర్శిచారు. మంగళవారం నగరంలోని అన్ని ప్రైవేటు ట్రావె ల్ ఏజెన్సీల కార్యాలయాల వద్ద వారు ఆందోళన నిర్వహించారు. ప్రైవేటు బస్సులు రోడ్డెక్కితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ప్రైవేటు బస్సుల యజమానులు తెలంగాణవాదులా లేక టీఆర్ఎస్ తొత్తులా అంటూ విమర్శించారు. సమైక్యాంధ్రకు జైకొడుతూనే ప్రయాణికులను రాత్రికి రాత్రి తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన నాయకులే కాసుల కోసం కక్కుర్తి పడడం ఆవేదనకు గురి చేస్తోందని వాపోయారు. తక్షణం బస్సులను షెడ్లకు పరిమితం చేసి ఉద్యమాలకు సహకరించాలని, లేని పక్షంలో జరగబోయే నష్టానికి వారే బాధ్యులవుతారని హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో దివాకర్ ట్రావెల్స్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారన్న సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని హింసాత్మక చర్యలు, బెదిరింపులకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించగా, ఆర్టీసీ సిబ్బంది అదే స్థాయిలో సమాధానమిచ్చారు.తమపై కేసులు పెడతామని బెదిరించడం ఎంత వరకు న్యాయమని సీఐ మాధవ్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆందోళన దృశ్యాలను ఎస్ఐ ధరణికిశోర్ తన కెమెరాలో బంధించారు.