టిమ్స్.. టెన్షన్స్
► ప్రైవేట్ వ్యక్తులకు ‘టిమ్స్’ అందజే యడంపై కార్మిక సంఘాల ఆగ్రహం
► ఆర్టీసీ యాజమాన్య నిర్ణయం సరి కాదంటున్న కార్మికులు
► అడ్డుకునేందుకు సై అంటున్న వైనం
పట్నంబజారు (గుంటూరు): ఏపీఎస్‌ఆర్టీసీని నష్టాల బారి నుంచి లాభాల బాట పట్టించడానికి యాజమాన్యం చేపడుతున్న కొన్ని చర్యలు కార్మికుల ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాటిలో డ్రైవర్ కం కండక్టర్ విధానమూ ఒకటి. దీని ద్వారా కండక్టర్‌తో పని లేకుండా నేరుగా డ్రైవరే టికెట్ ఇష్యూయింగ్ మిషన్ (టిమ్) ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ విధానం అమలవుతున్న సంగతి విదితమే. స్థానిక సర్వీసుల్లోనూ ఇదే విధానాన్ని ప్రవేశ పెట్టి దశల వారీగా కండక్టర్ల సంఖ్యను కుదించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలన్నది యాజమాన్యం ఎత్తుగడ.
ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలుండగా వాటిపై దృష్టి సారించకుండా ఉద్యోగుల సంఖ్యను కుదించడం ద్వారానే ఆర్థిక భారం తగ్గించుకోవాలని చూస్తున్న తీరుపై కార్మిక వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పాటు ఇటీవల యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలూ వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తులకు టిమ్ములు అప్పగిస్తుండటంతో కార్మికులు ఆందోళన బాట పట్టనున్నట్లు వారు చెబుతున్నారు.
నేతలపై కేసుల నమోదు..
ప్రసుత్తం రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి అద్దె బస్సులూ దూరప్రాంతాలకు తిరుగుతున్నాయి. గతంలో ఒక్కో బస్సులో డ్రైవర్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి, ఆర్టీసీ కండక్టర్లు విధులు నిర్వర్తించే వారు. ఇటీవల యాజమాన్యం అద్దె బస్సుల్లో టిక్కెట్లు ఇచ్చేందుకు యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులకే సర్వాధికారాలు అప్పగించింది. దీంతో కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. కొన్నిరోజుల కిందట గుంటూరు డిపో నుంచి విశాఖపట్నానికి పైవేట్ బస్సు పంపిస్తూ, దానిలో హైర్ బస్సు వ్యక్తికే టిమ్‌ను అప్పగించటంతో నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సును కదలనివ్వమని రాస్తారోకో దిగారు. దీనిపై పాతగుంటూరు పోలీసుస్టేషన్‌లో ఎన్‌ఎంయూ నేతలపై కేసు కూడా నమోదయింది.
ఆర్టీసీ ఉన్నతాధికారులు తాత్కాలికంగా ఆర్టీసీ డ్రైవర్‌ను కండక్టర్‌గా పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కొన్నాళ్ల క్రితం కృష్ణా జిల్లా నూజీవీడు డిపోకు చెందిన ఓ ప్రైవేట్ బస్సులో ప్రైవేటు వ్యక్తి వేలల్లో డబ్బులు తీసుకుని పరారడయ్యాడని కార్మిక నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని బయటకు తెలియనీయకుండా అధికారులు జాగ్రత్తలు పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
పోరుకు సన్నాహాలు..
హైర్ (అద్దె) బస్సుల్లో ప్రైవేట్ వ్యక్తులకు టిమ్ములు అప్పగించటంపై కార్మిక సంఘాలు పోరుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నాయి. యాజమాన్యం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామంటున్నాయి. ఇప్పటికే కార్మిక సంఘాల నేతలు హైర్ బస్సుల్లో ప్రైవేట్ వ్యక్తులకు టిమ్ములు అప్పగించ చూస్తే సహించొద్దని ఆయా డిపోల నేతలకు మౌఖికంగా చెప్పినట్లు సమాచారం. రీజియన్ పరిధిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మరోసారి పునరావృతమైతే సహించొద్దన్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం ఆఖరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే !