కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: అతిపెద్ద ప్రభుత్వ రంగ ప్రజా రవాణా సంస్థగా రికార్డు సృష్టించిన ఏపీఎస్ ఆర్టీసీలో కొత్త కొలువుకు బాటలు పడలేదు. ఉద్యోగాల భర్తీకి నాలుగేళ్ల క్రితం పడిన బ్రేక్ ఇప్పటికీ కొనసాగుతునే ఉంది. గిన్నీస్ రికార్డు సాధించిన ఈ సంస్థలో డ్రైవర్, కండక్టర్లను తీసుకునే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే నియామకమైన కార్మికుల ఉద్యోగాలకు భరోసా కరువైంది. ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఉన్న సిబ్బందితోనే సంస్థ కాలం వెళ్లదీస్తోంది. రోజురోజుకు జనాభా పెరుగుతుండడంతో ప్రయాణాల సంఖ్య ఎక్కువవుతోంది. వీరికి రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆర్టీసీ ద్వారా బస్సులు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో ఆర్టీసీ నష్టాల బాటపట్టాల్సి వచ్చింది.
ఈ సంస్థలో పని చేసిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించలేకపోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియమించిన కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలకు భద్రత ఇవ్వలేకపోతోంది. సంస్థను నమ్ముకొని వచ్చిన నిరుద్యోగలు ఆశలపై నీళ్లు చల్లుతోంది. 60శాతం కంటే తక్కువగా ఆక్యూపెన్షీ రేషియో (ఓఆర్) వచ్చే బస్సు సర్వీసులను ఎత్తివేయడం, ఆతరువాత బస్సు షెడ్యూళ్లు తగ్గాయనే కారణం చూపి ‘డిస్‌ఎంగేజ్’ పేరుతో విధుల నుంచి తప్పించి ఇంటికి పంపడం వంటి చర్యలకు పాల్పడుతోంది.
నియామకాల వివరాలు:
1995లో జిల్లాలో 120 మంది డ్రైవర్లు, 100 వరకు కండక్టర్లను క్యాజువల్ నియామకాల కింద తీసుకున్నారు. ఆ తరువాతర ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడింది. మళ్లీ 2007లో నోటిఫికేషన్ జారీ చేసి 100 మందికి పైగా డ్రైవర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. 2008లో 250 మంది డ్రైవర్లు, 180 మంది కండక్టర్లను తీసుకున్నారు. ఆ తరువాత 2009లో 160 కండక్టర్ పోస్టులు భర్తీ చేశారు.
నియమితులైన వారిని ఖాళీల ఆధారంగా డిపోలకు కేటాయించి విధుల్లోకి తీసుకున్నారు. కాని వీరి నియామకాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. నష్టాల సాకుతో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో యాజమాన్యం వివిధ మార్గాలను అనుసరించింది. ఈ క్రమంలో 2011లో 60శాతం కంటే తక్కువగా ఓఆర్, ఆదాయం వచ్చే రూట్లలో బస్సులను ఎత్తివేయాలని భావించింది. ఈ సమయంలో 70కి పైగా రూట్లతో తిరిగే బస్సులను ఎత్తివేశారు. అనుకున్నంత మేరకు ఆదాయం వచ్చే రూట్లతో మాత్రమే బస్సులు తిప్పి మిగతా వాటిని గ్యారేజీలకే పరిమితం చేశారు.
ఈ కారణంగా కార్మికులపై కత్తి పెట్టడంతో రెండేళ్ల కిత్రం 240 మంది డ్రైవర్లు, 100మంది కండక్టర్లు విధుల్లోంచి తొలగించిన విషయం తెలిసిందే. శుభకార్యాలు, పండుగలు, బ్రహ్మోత్సవాల సందర్భాల్లో ప్రత్యేక బస్సులు నడిపేటప్పుడు మాత్రమే అవసరం ఉన్న మేరకు కార్మికులను తీసుకొని, ఆతరువాత మళ్లీ ఇంటికి పంపిస్తూ వస్తునప్నారు. రిటైర్మెంట్లు, పదోన్నతుల ఫలితంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవలే కొంత మందిని తీసుకున్నా మరో 100 మందికి పైగా డ్రైవర్లు 68 మంది కాంట్రాక్టు కార్మికులు ఇంటి వద్దే ఉన్నారు. వీరిలో కొంతమందిని ప్రకాశం జిల్లాలోని డిపోల్లో పనిచేసేందుకు పంపించారు.
సిబ్బంది వివరాలు:
జిల్లాలోని 11డిపోల్లో ఉన్న 970 బస్సుల్లో 122 అద్దె, 848 ఆర్టీసీ బస్సులున్నాయి. సంస్థ నిబంధనల ప్రకారం 100 బస్సులకు 270 మంది డ్రైవర్లు, 270 మంది కండక్టర్లు ఉండాలి. కాని రెడేళ్ల కిత్రం ఈ సంఖ్యను 260కి కుదించారు. ఈ లెక్కన 848 ఆర్టీసీ బస్సులకు 2205 మంది డ్రైవర్లు, 2205 కండక్టర్లు ఉండాలి. కాని జిల్లాలో కేవలం 2084 మంది డ్రైవర్లు, 1660 మంది కండక్టర్లు మాత్రమే ఉన్నారు. 122 అద్దె బస్సుల్లో డ్రైవర్లను యజమానులే ఏర్పాటు చేసినా కండక్టర్లను సంస్థే నియమించాలి.
ఈ లెక్కన అదనంగా 318 మంది కండక్టర్లు అవసరం అవుతారు. కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న కార్మికులు 240 రోజుల పాటు విధులు నిర్వహిస్తే విడతల వారీగా రెగ్యూలర్ చేయాల్సి ఉంది. వివిధ కారణాలతో ఇంటికి పంపి భారాన్ని తగ్గించుకునేందుకే యాజమాన్యం అలోచిస్తుందని ఆర్టీసీ వైఎస్‌ఆర్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం.వి. కుమార్ పేర్కొన్నారు. కండక్టర్ వ్యవస్థను ఎత్తివేసేందుకు టిమ్ (టికెట్ ఇష్యూ మిషన్) విధానాన్ని ప్రవేశపెట్టిందని, డ్రైవర్ల ద్వారానే ఈప్రక్రియ కొనసాగించేందుకు కసరత్తు చేస్తోందన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
కొత్త కొలువుల్లేవ్!
Published Fri, Jan 24 2014 2:04 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement