సాక్షి, హైదరాబాద్: టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులను అంతర్జాతీయస్థాయిలో నిర్వహిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న టిమ్స్ ఆస్పత్రుల్లో వెయ్యి పడకలు ఉంటాయని, ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), నిమ్స్(నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరహాలోనే ‘టిమ్స్’పనితీరు ఉంటుందన్నారు. ప్రతి ఆస్పత్రికి ప్రత్యేకంగా పాలకమండలి ఉంటుందని మంత్రి తెలిపారు. వీటన్నింటిని కలిపి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తామని, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారని చెప్పారు.
టిమ్స్ ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి ఉంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, ప్రస్తుతం నిమ్స్‌కు ఈ హోదా కల్పించడంతో వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. ఆదివారం ఆయన శాసనమండలిలో ‘టిమ్స్ బిల్లు– 2023’ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిమ్స్ ఆస్పత్రుల ఏర్పాటుతో దాదాపు 10వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ అందుబాటులోకి వస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 10వేల బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 34వేలకు చేరిందన్నారు.
అతిత్వరలో వీటి సంఖ్య 50వేలకు చేరనుందని మంత్రి సభలో వెల్లడించారు. టిమ్స్ ఆస్పత్రుల్లో 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు ఏర్పాటవుతాయని, సూపర్ స్పెషాలిటీల్లో నర్సింగ్, పారామెడికల్ కోర్సులతో పాటు గుండె, మూత్రపిండాలు, లివర్, ఊపిరితిత్తులు, కేన్సర్, ట్రామా, ఎండోక్రైనాలజీ, ఎలర్జీ, రుమటాలజీ తదితర 30 విభాగాలుంటాయన్నారు. 200 మంది ఫ్యాకల్టి, 500 మంది వరకు రెసిడెంట్ వైద్యులు, 26 ఆపరేషన్ థియేటర్లు, గుండెకు సంబంధించి క్యాథ్ ల్యాబ్, కిడ్నీలకు డయాలసిస్, కేన్సర్‌కు రేడియేషన్, కీమోథెరపీతో పాటు సీటీస్కాన్, ఎంఆర్‌ఎస్‌ఐ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ప్రతి ఆస్పత్రిలో 300 ఐసీయూ పడకలతోపాటు వెంటిలేటర్ బెడ్‌లు కూడా ప్రత్యేకంగా ఉంటాయన్నారు. మంత్రి హరీశ్ మండలిలో ప్రవేశపెట్టిన టిమ్స్ బిల్లు–2023ని సభ ఆమోదించింది. వీటితో పాటు కర్మాగారాల సవరణ బిల్లు–2023, జైనులను మైనార్టీలుగా గుర్తిస్తూ మైనార్టీ కమిషనర్ సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు, పంచాయతీ సవరణ బిల్లుల్ని కూడా శాసనమండలి ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment