సాక్షి, మచిలీపట్నం: ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థే అయినా కార్మికులకు అడుగడుగునా అవస్థలు తప్పేవి కాదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా జీతభత్యాలు అన్న మాటే లేదు. సంస్థ నష్టాల్లో ఉన్నా, ఏవైనా ఒడుదొడుకులు ఎదురైనా సకాలంలో వేతనాలు అందేవి కావు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే జీతంలో కోతలు విధించేవారు. ఇదంతా గతం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో సంస్థ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వచ్చింది. ఉద్యోగ భద్రత లభించింది.
విలీనమై నాలుగేళ్లు
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఆచరణలోకి పెట్టేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే కమిటీ వేశారు. ఆరు నెలల్లోనే ఆచరణలో పెట్టారు. 2020 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తేవడంతో కార్మికులంతా ప్రజా రవాణా శాఖ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. దశాబ్దాల తరబడి ఎవరూ చేయని సాహసవంతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఉద్యోగుల కష్టాలు తొలగిపోయాయి. నాలుగేళ్లుగా వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, బెనిఫిట్స్, అలవెన్స్ అందుతున్నాయి. ఈ నిర్ణయంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5,308 కుటుంబాల్లో సంతోషాలు నిండాయి.
నాడు సమ్మెలు చేస్తే జీతాలు కట్
ఆర్టీసీ ఇస్తున్న వేతనాలు చాలక డ్రైవర్లు, కండ క్టర్లు, ఇతర కార్మికులు ఎన్నోసార్లు సమ్మెలు, పోరాటాలు చేశారు. అయినా తగిన ప్రతిఫలం దక్కలేదు. గత టీడీపీ ప్రభుత్వం కార్మికులను వేధించి, సమ్మె కాలానికి జీతాలు కోసి ఉక్కు పాదం మోపింది. ఉద్యోగ భద్రత కరువై కార్మికులు రోజులు లెక్కపెట్టుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే తమ సమస్యలకు పరిష్కారం లభించిందని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.
లాక్‌డౌన్‌లోనూ ఠంచన్‌గా జీతాలు
కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా రెండేళ్లలో సుమారు నాలుగు నెలలకు పైగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆ పరిస్థితులు గతంలో ఎదురైతే కార్మికుల వేతనాల్లో కోతలు పడేవి.
అప్పటికే ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎన్ని కష్టాలు ఉన్నా ఒకటో తేదీన ఠంచన్‌గా జీతాలు అందాయి. ఇలా జీతాలు చెల్లించడం చరిత్రలో మొదటి సారి అని ఉద్యోగులు పేర్కొన్నారు.
మాట తప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీ విలీనం ప్రక్రియ పూర్తి చేసి మాట నిలుపుకొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ జీతాలకు బ్రేక్ లేకుండా చూశారు. ఆర్టీసీ కార్మికుల మేలు కోరిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
– చల్లా చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు,పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్
ప్రభుత్వ ఉద్యోగులతో సమానం
ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులను ఎదు ర్కొన్నాం. చాలీచాలని వేతనాలు, అల వెన్సులు. జీతాల పెంపు కోసం సంఘాలు ఆందోళన చేసినా మాకు సరైన న్యాయం జరిగేది కాదు. అయితే ఇప్పుడు ప్రజా రవాణా శాఖలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, అలవెన్స్‌లు అందుతున్నాయి.
– గొడవర్తి నరసింహాచార్యులు, కండక్టర్
భరోసా వచ్చింది
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులుగా ఉన్నప్పుడు మాకు ఉద్యోగ భద్రత ఉండేది కాదు. ఏదైనా పొరపాటు జరిగినా.. ఆర్టీసీ సంఘాలు చేపట్టే ఆందోళనలో పాల్గొన్నా ఒత్తిళ్లు, బెదిరింపులు ఉండేవి. ఇప్పుడు ఆ సమస్య లేదు. ప్రభుత్వంలో విలీనం చేయడంతో జీతభత్యాలపై భరోసా వచ్చింది. ఉద్యోగ భద్రత లభించింది.
– ఎ. వెంకటేశ్వరరావు, డ్రైవర్
Comments
Please login to add a commentAdd a comment