
ఐక్యరాజ్య సమితి సమావేశాలకు మోజెస్ అబ్రహాం హాజరు
చిలకలపూడి(మచిలీపట్నం): న్యూయార్స్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీఓఎస్‌ఓసీ) యూత్ ఫోరం–2025 సమావేశాలకు మచిలీపట్నానికి చెందిన డాక్టర్ బొకినాల మోజెస్‌అబ్రహాం భారత ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ నెల 15న ప్రారంభమైన ఈ సమావేశాలు గురువారం ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న యువనాయ కులతో కలిసి ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అంశంపై జరిగిన చర్చలో మోజెస్ అబ్రహాం పాల్గొన్నారు. ఆరోగ్యం, లింగ సమానత్వం, వాతావరణ పరిరక్షణ, శాస్త్రసాంకేతికత, యువ ఉద్యోగవకాశాలు వంటి అంశాలపై తాను ప్రసంగించానని డాక్టర్ మోజెస్ తెలిపారు. పాలసీ నిర్ణయాల్లో యువత భాగస్వామ్యం, శాంతి నిర్మాణం, డిజిటల్ పరివర్తన, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాల ప్రాధాన్యతను ఈ ఫోరం ప్రధానంగా ప్రతిబింబించిందని తెలిపారు. మోజెస్ మచిలీపట్నం నోబెల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో డాక్టరేట్, ఐఐటీ కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనా వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో శుద్ధ ఇంధన సాంకేతికతపై పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఫిలడెల్ఫియాలోని డ్రెక్సెల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించిన ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రపంచ యువ నాయకులతో కలిసి చర్చలు జరపడం గర్వంగా ఉందని మోజెస్ తెలిపారు.