ఆర్టీసీలో యూనిఫామ్ లొల్లి!
♦ మూడేళ్లుగా నిలిచిపోయిన సరఫరా
♦ పాత దుస్తులు చిరిగిపోవటంతో సాధారణ వస్త్రాల్లో విధులకు సిబ్బంది
♦ అభ్యంతరం చెబుతున్న అధికారులు.. సిబ్బందికి మెమోలు..
సాక్షి, హైదరాబాద్: యూనిఫామ్ లేకుండానే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది గందరగోళానికి, వివాదాలకు కారణమవుతోంది. యూనిఫామ్‌ను సిబ్బందికి ఆర్టీసీ యాజమాన్యమే సరఫరా చేస్తుంది. కానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీ గడచిన మూడేళ్లుగా యూనిఫామ్ సరఫరా చేయటం లేదు. దీంతో పాతవాటితోనే నెట్టుకొస్తున్న సిబ్బంది.. ఇప్పుడవి చిరిగిపోవటంతో సాధారణ దుస్తుల్లో విధులకు వస్తున్నారు. అయితే యూనిఫామ్ నిబంధన అమలులో ఉండటంతో వారికి మెమోలు జారీ చేస్తుండటం.. వివాదాలకు కారణమవుతోంది.
2013 తర్వాత నిలిపివేత..
2013 తర్వాత యూనిఫామ్ జారీ నిలిచిపోయింది. ఏడాదికి రూ.2.5 కోట్లు దీనికి ఖర్చు చేయాల్సి రావటంతో నిధులకు ఇబ్బంది ఏర్పడి యాజమాన్యం సరఫరాను తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో అప్పటి నుంచి సిబ్బంది పాత యూనిఫామ్‌తోనే నెట్టుకొస్తున్నారు. మూడున్నరేళ్లు గడిచిపోవటంతో ఆ దుస్తులు చిరిగిపోయా యి. దీంతో కొన్ని రోజులుగా చాలామంది కార్మికులు సాధారణ దుస్తుల్లో విధులకు వస్తుండటంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరు కార్మికులు సొంత ఖర్చులతో యూనిఫామ్ కుట్టించుకున్నారు. రెండు మూడు హెచ్చరికల తర్వాత యూనిఫామ్ లేని సిబ్బందికి అధికారులు మెమోలు జారీ చేస్తున్నారు.
సంస్థ యూనిఫామ్ సరఫరా చేయకపోతే తమనెందుకు శిక్షిస్తారంటూ సిబ్బంది ఎదురు ప్రశ్నిస్తుండటంతో అధికారులకు సిబ్బందికి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల కార్మికులను తిప్పిపంపుతున్నట్లు ఫిర్యాదులొస్తుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తూ సాధారణ దుస్తుల్లో వచ్చినా అనుమతిస్తున్నారు. కాగా, నిధుల సమస్య పేరుతో ఆర్టీసీ యూనిఫామ్‌ను జారీ చేయకపోవటం సరికాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో రావాల్సిన పరిస్థితి మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు.. త్వరలో కార్మికులకు కొత్త యూనిఫామ్ జారీ చేయాలన్న ఆలోచనకొచ్చినట్టు తెలిసింది.