పోలీసులను వారె ంట్, టికెట్లు అడుగుతున్న కండక్టర్లు
ఓవర్‌లోడ్ పేరుతో బస్సులకు జరిమానా విధిస్తున్న పోలీసులు
బద్వేలు అర్బన్: బద్వేలులో ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన సంఘటనతో నిజమేననే భావన కలుగుతోంది. ఈ నెల 6న ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ఓ ప్రైవేటు బస్సుపై దాడి జరిగిన ఘటనలో పోలీసులు 20 మందిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఇదే సమయంలో బద్వేలు డిపోలోని బస్సులలో ప్రయాణిస్తున్న పోలీసులను కండక్టర్లు వారెంట్ ఉందా, లేక టికెట్ తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పోలీసులు కూడా ఓవర్‌లోడుతో ప్రయాణిస్తున్న బస్సులను ఆపి జరిమానా విధిస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం బద్వేలు నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులను అట్లూరు సమీపంలో అక్కడి పోలీసులు ఆపి తనిఖీలు చేయడంతో పాటు ఏపీ04 డబ్ల్యు 1889 నంబరు గల ఆర్టీసీ బస్సుకు ఒక్క ప్రయాణికుడు ఎక్కువగా ఉన్నాడనే కారణంతో రూ.100లు జరిమానా విధించారు. అలాగే ఏపీ29 జడ్ 3106 నంబరు గల బస్సును సైతం ఆపి పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని రూ.2,000లు జరిమానా చెల్లించాలని సుమారు అర గంట పాటు బస్సును నిలిపివేశారు.
చివరకు డీఎం జోక్యం చేసుకుని అక్కడి పోలీసులతో మాట్లాడడంతో బస్సును పంపినట్లు తెలిసింది. అలాగే బుధవారం రాత్రి కూడా ఏపీ28 జడ్ 5547 నంబరు గల ఆర్టీసీ బస్సును సైతం అట్లూరు సమీపంలో అరగంట పాటు ఆపి బస్సు డ్రైవర్ లెసైన్స్‌తోపాటు ప్రయాణికుల సంఖ్యను తనిఖీ చేసినట్లు తెలిసింది. మొత్తమ్మీద సమ్మె కాలంలో జరిగిన ఘటన ఆర్టీసీ సిబ్బందికి, పోలీసులకు నడుమ పెద్ద సమస్యగా మారింది.
డీఎం ఏమన్నారంటే: ఈ విషయంపై ఆర్టీసీ డిఎం సుధారాణిని వివరణ కోరగా ఆర్టీసీ బస్సులకు జరిమానా విధించే అధికారం పోలీసులకు లేదని డ్రంక్‌అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనం నడపడం, ఓవర్ స్పీడ్‌తో వాహనం నడపడం వంటి వాటిపై పోలీసులు తనిఖీ చేసే అధికారం ఉందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు స్టేజీ కేరియర్లు కావని ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని ఆయన పేర్కొన్నారు. సీఐ ఏమన్నారంటే: ఆర్టీసీ బస్సులలో ఓవర్‌లోడ్‌గా ప్రయాణికులను ఎక్కించినా, రోడ్డుకు అడ్డంగా బస్సును ఆపినా, యూనిఫాం లేకున్నా సంబంధిత డ్రైవర్‌కు, కండక్టర్‌కు జరిమానా విధించే అధికారం పోలీసులకు ఉందని తెలిపారు.
ఆర్టీసీ వర్సెస్ పోలీస్
Published Fri, May 22 2015 5:08 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement