ఇకపై బస్ కండక్టర్లు ఉండరట..!
హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల విధానానికి మంగళం పాడాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. కొత్తగా వచ్చే బస్సులను వీలైనంతవరకు పూర్తిగా టికెట్ ఇష్యూయింగ్ మిషన్(టిమ్) సర్వీసులుగా మార్చాలనే యోచనలో ఉంది. ఈ సర్వీసుల్లో బస్సు డ్రైవర్లే ప్రయాణీకులకు టిక్కెట్లు జారీ చేస్తారు. ప్రస్తుతం వినియోగిస్తున్న టిక్కెట్ ఇష్యూయింగ్ మిషన్లతో ఇప్పటికే కొన్ని బస్సుల్లో డ్రైవర్లే టిక్కెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.
త్వరలో 1,200 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయంతో తాజా పరిణామం ఆర్టీసీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. సిటీ బస్సుల్లో మినహా మిగతా అన్ని రకాల సర్వీసుల్లో టిమ్ మిషన్ల ద్వారా డ్రైవర్లే టికెట్లు జారీ చేయాల్సివుంటుంది. ప్రస్తుతం దూర, సుదూర ప్రాంతాలకు నడిచే గరుడ, సూపర్ లగ్జరీ, కొన్ని డీలక్స్ సర్వీసుల్లో వీటిని డ్రైవర్లు ఉపయోగిస్తున్నారు. అయితే, కొత్త బస్సులను రోడ్డు మీదకు పంపే రోజు నుంచి పల్లె వెలుగు, మిగిలిన సర్వీసుల్లో డ్రైవర్లే టికెట్లు జారీ చేసేలా ఆర్టీసీ చర్యలు తీసుకోనుంది.