ఎసరు! | 'Tims' threat for RTC conductors | Sakshi
Sakshi News home page

ఎసరు!

Published Tue, Sep 13 2016 7:23 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చే టిం మిషన్‌ - Sakshi

ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చే టిం మిషన్‌

  • ‘టిమ్స్‌’ వినియోగంతో కండక్టర్లకు ముప్పు!
  • డ్రైవర్‌తోనే కండక్టర్‌ విధులు
  • సిబ్బందిని తగ్గించే యోచనలో ఆర్టీసీ యాజమాన్యం
  • ఆందోళనలో కార్మికులు
  • మెదక్‌: ఆర్టీసీ కండక్టర్ల ఉద్యోగాలకు ఎసరు పెట్టే యంత్రాలు వినియోగంలోకి వచ్చాయి. టిమ్స్‌ (టికెట్లు జారీ చేసే యంత్రాలు) అందుబాటులోకి రావడంతో ఆర్టీసీలో కలకలం మొదలైంది. ఈ యంత్రంతో డ్రైవరే ప్రయాణికులకు టికెట్లు జారీ చేసి వారి గమ్యస్థానాలకు చేరేవేస్తారు. ఫలితంగా ఇక్కడ కండక్టర్‌ అవసరం లేకుండా పోతుంది. విధానంతో తమ ఉద్యోగలకు ముప్పు పొంచి ఉందంటూ కండక్టర్లు ఆందోళన చెందుతున్నారు.

    సిబ్బందిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం టిమ్స్‌ను ప్రవేశ పెట్టింది. దీంతో డ్రైవర్లకే టిం మిషన్‌ అప్పగించి రోడ్డుపైకి వదిలేస్తున్నారు. దీంతో సదరు డ్రైవర్‌ ఓవైపు బస్సు నడుపుతూనే మరోవైపు ప్రయాణికులకు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డ్రైవర్‌ ఏ మాత్రం అజాగ్రత్తగా వహించినా జరిగే నష్టం విలువైన ప్రాణమే.

    జిల్లాలో మెదక్‌, సంగారెడ్డి, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సిద్దిపేట, దుబ్బాక, ప్రజ్ఞాపూర్‌-గజ్వేల్‌లో ఆర్టీసీ డిపోలున్నాయి. ఇందులో సుమారు 50 వరకు డీలక్స్‌ బస్సులకు కండక్టర్‌ను ఇవ్వకుండా టిం మిషన్‌లు డ్రైవర్‌కే అప్పగించి పంపుతున్నారు. బస్సును నడపడంతోపాటూ టిక్కెట్లు ఇచ్చే బాధ్యత కూడా డ్రైవర్‌దే. మెదక్‌ నుంచి వయా తూప్రాన్‌ హైదరాబాద్‌ వరకు తొమ్మిది స్టాప్‌లు ఉన్నాయి.

    అన్ని స్టాపుల్లోనూ బస్సులను ఆపుతూ ప్రయాణికులకు టిక్కెట్లు ఇవ్వాల్సిందే. ఈ  క్రమంలో ప్రయాణికులు అధికంగా బస్సెక్కినట్లయితే రోడ్డు పక్క బస్సు నిలిపి టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సమయమంతా వృథా అవుతుంది. అధిక చార్జీలు చెల్లించి డీలక్స్‌ బస్సుల్లో ఎక్కడం కన్నా ఆర్డీనరీ బస్సులు ఎక్కడమే మేలని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపవద్దంటున్న అధికారులు ఓ చెత్తో టిక్కెట్లు.. మరో చేత్తో బస్సునడిపే విధానంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

    ముఖ్యంగా గతంలో డీలక్స్‌లకు మాత్రమే ఈ టిమ్‌ వ్యవస్థను అప్పగించిన అధికారులు ఎక్స్‌ప్రెస్‌ల్లో సైతం ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఒకే వ్యక్తికి కండక్టర్‌, డ్రైవర్‌ పనులు అప్పగించడంపై గతంలోనూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేసిన విషయం విదితమే. ఉద్యోగులను తగ్గించుకునేందుకు యాజమాన్యం దృష్టి పెట్టినా.. ప్రయాణికులకు ఏ మాత్రం రక్షణలేని ఈ విధానం సరైంది కాదని అటు ఉద్యోగ సంఘాలతోపాటు ఇటు ప్రయాణికులు సైతం మండిపడుతున్నారు. పాత పద్ధతిలోనే బస్సుకు డ్రైవర్‌తోపాటు కండక్టర్‌ను విధిగా నియమించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

    మండిపడుతున్న డ్రైవర్లు...
    టిం వ్యవస్థపై ఆర్టీసీ డ్రైవర్లు సైతం మండిపడుతున్నారు.కండక్టర్‌కు ఇచ్చే సమయంతోనే తమకు ఇస్తున్నారని, తమకు ఏ మాత్రం సమయం ఎక్కువ కేటాయించక పోవడంతో ఒత్తిడి గురవుతున్నట్టు పలువురు చెబుతున్నారు. టికెట్లు ఇచ్చే హడావిడిలో ఎవరైన టిక్కెట్‌ తీసుకోకుంటే తమకు పనిష్మెంట్‌ కూడా ఉంటుందని, దీంతో ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

    లాభాల బాట పట్టించేందుకే...
     జిల్లాలో డీలక్స్‌లతోపాటు కొన్ని ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ టిం వ్యవస్థను కొనసాగిస్తున్నాం. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు దీన్ని ఒక మార్గంగా ఎంచుకున్నాం. - రఘునాథ్‌రావు, ఆర్టీసీ ఆర్‌ఎం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement