TSRTC MD Sajjanar Suggests the Conductors To Be Polite With Passengers - Sakshi
Sakshi News home page

ప్రయాణికులతో మర్యాదగా మెలగండి ! ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ హితవు

Published Fri, Apr 21 2023 5:19 PM | Last Updated on Fri, Apr 21 2023 5:59 PM

TSRTC MD Sajjanar Suggest Be Polite With Passengers  - Sakshi

ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ సూచించారు. సంస్థకు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్‌ అంబాసిడర్లని, క్షేత్రస్థాయిలో జాగ్తత్తగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. చిన్న పొరపాట్ల వల్ల ఆర్టీసీ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. ఆర్టీసీ బ్రాండ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా సంస్థ అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో కండక్టర్లకు టీఎస్‌ఆర్టీసీ ఏప్రిల్‌ ఛాలెంజ్‌ ఫర్‌ ట్రైనింగ్‌(టాక్ట్‌) శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు సజ్జనర్‌ హైదరాబాద్‌ బస్‌ భవన్‌ నుంచి వర్చ్‌వల్‌గా.. ఈ శిక్షణ జరుగుతున్న తీరును  పరిశీలించారు.  ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న కండక్టర్లతో ముచ్చటించారు. శిక్షణ జరుగుతున్న తీరు, శిక్షణలో చెబుతున్న విషయాల ఉపయోగం, తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. 

"మనం ప్రయాణికుల కేంద్రంగానే పనిచేయాలి. ప్రయాణికులతో ఎట్టి పరిస్థితుల్లోనూ దురుసుగా ప్రవర్తించొద్దు. బస్సులోకి రాగానే వారిని నమస్తే అంటూ చిరునవ్వుతో పలకరించాలి. కొత్త ప్రయాణికులను మన సంస్థ వైపు మెగ్గుచూపేలా వ్యవహారించాలి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వహించాలి. విధి నిర్వహణలో స్వీయ క్రమశిక్షణను కలిగి ఉండాలి." అని కండక్టర్లకు సజ్జనర్‌ హితవు పలికారు. గత ఏడాదిన్నర కాలంలో సంస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. 

రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్‌) 69గా ఉంది. దానిని 75కి పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే సంస్థలో ప్రతి ఒక్క సిబ్బందికి టాక్ట్‌ పేరుతో శిక్షణ ఇస్తున్నాం. ఆ లక్ష్యానికి అనుగుణంగా అందరూ పనిచేయాలి." అని సజ్జనర్‌ స్పష్టం చేశారు. ఈ శిక్షణ స్పూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. సంస్థ లాభాల బాటలో పయనించేలా పాటుపడాలన్నారు.

ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రీజియన్లలోని దాదాపు 6 వేల మంది డ్రైవర్లకు టాక్ట్‌ శిక్షణను ఇచ్చామని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో సంస్థలోని సిబ్బంది అందరికీ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

కాగా, టాక్ట్‌ పేరుతో త‌మ‌కు అందిస్తోన్న ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉంద‌ని కండక్టర్లు సంస్థ ఎండీ సజ్జనర్‌కు చెప్పారు. తమలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రయాణికుల మీదనే సంస్థ ఆధారపడి ఉందనే విషయాన్ని తాము మరిచిపోమన్నారు. ఓఆర్‌ను 75కి పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీవోవో) డాక్టర్‌ రవిందర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) మునిశేఖర్‌, సీపీఎం కృష్ణకాంత్‌, ఓఎస్డీ(ఐటీ అండ్‌ డీ) యుగంధర్‌, సీటీఎం(ఎం అండ్‌ సీ) విజయ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: రాష్ట్రం మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement