ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
- జిల్లాలో 500 మంది పర్మినెంట్‌కు అవకాశం
సాక్షి, విజయవాడ : ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లను పర్మనెంట్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 నుంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయీ) బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈయూ ప్రతినిధులతో బుధవారం సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లును పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారు.
జిల్లాలో 500 మందికి అవకాశం...
2012, డిసెంబర్ 31వ తేదీలోపు ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. దీంతో కృష్ణా రీజియన్ పరిధిలో 382 మంది డ్రైవర్లు, 118 మంది కండక్టర్లు మొత్తం 500 మంది పర్మనెంట్ కానున్నారు. ఇప్పటి వరకు వీరికి రెగ్యులర్ డ్రైవర్‌తో సమానంగా వేతనం వచ్చినప్పటికీ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి ఇతర అలవెన్సులు వచ్చేవి కావు. ప్రస్తుతం వీరిని పర్మనెంట్ చేయడంతో అన్ని రకాల అలవెన్సులు లభిస్తాయి. ఇప్పటికే రీజియన్ పరిధిలో 5,400 మంది పర్మనెంట్ డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు.
వచ్చే ఏడాది మరికొంతమందికి అవకాశం...
గతంలో ఆర్టీసీ యాజమాన్యానికి, యునియన్ నేతలకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 2013 తరువాత ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్లు, కండ క్టర్లుగా చేరినవారికి రెండేళ్లు సర్వీసు పూర్తయిన వెంటనే పర్మనెంట్ చేయాల్సి ఉంది. ఇక నుంచి ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లను పర్మనెంట్ పద్ధతిలోనే తీసుకోవాలని, కాంట్రాక్టు పద్ధతిని విడనాడాలని ముఖ్యమంత్రితో జరిపిన చర్చల్లో యూనియన్ నేతలు కోరగా, సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు ‘సాక్షి’కి తెలిపారు.