rtc contract employee
-
ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
-
ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
జిల్లాలో 500 మంది పర్మినెంట్‌కు అవకాశం సాక్షి, విజయవాడ : ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లను పర్మనెంట్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 నుంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయీ) బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈయూ ప్రతినిధులతో బుధవారం సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లును పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో 500 మందికి అవకాశం... 2012, డిసెంబర్ 31వ తేదీలోపు ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. దీంతో కృష్ణా రీజియన్ పరిధిలో 382 మంది డ్రైవర్లు, 118 మంది కండక్టర్లు మొత్తం 500 మంది పర్మనెంట్ కానున్నారు. ఇప్పటి వరకు వీరికి రెగ్యులర్ డ్రైవర్‌తో సమానంగా వేతనం వచ్చినప్పటికీ, డీఏ, హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్సులు వచ్చేవి కావు. ప్రస్తుతం వీరిని పర్మనెంట్ చేయడంతో అన్ని రకాల అలవెన్సులు లభిస్తాయి. ఇప్పటికే రీజియన్ పరిధిలో 5,400 మంది పర్మనెంట్ డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు. వచ్చే ఏడాది మరికొంతమందికి అవకాశం... గతంలో ఆర్టీసీ యాజమాన్యానికి, యునియన్ నేతలకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 2013 తరువాత ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్లు, కండ క్టర్లుగా చేరినవారికి రెండేళ్లు సర్వీసు పూర్తయిన వెంటనే పర్మనెంట్ చేయాల్సి ఉంది. ఇక నుంచి ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లను పర్మనెంట్ పద్ధతిలోనే తీసుకోవాలని, కాంట్రాక్టు పద్ధతిని విడనాడాలని ముఖ్యమంత్రితో జరిపిన చర్చల్లో యూనియన్ నేతలు కోరగా, సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు ‘సాక్షి’కి తెలిపారు. -
ముగ్గురు సమైక్యవాదుల మృతి
గోవలంక (తాళ్లరేవు), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను తట్టుకోలేక వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు సమైక్యవాదులు మరణించారు. తాళ్లరేవు మండలంలోని గోవలంకకు చెందిన ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుడు కోరుకొండ వీరవెంకట సత్యనారాయణ(38) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయాడు. అతడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సత్యనారాయణ కొన్నేళ్లుగా రామచంద్రపురం ఆర్టీసీ డిపో గ్యారేజిలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. సమైక్య ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో గుండెనొప్పి రావడంతో అతడిని యానాం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. కాకినాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. గతేడాది యానాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యనారాయణ అన్నయ్య వాడపల్లి మృతి చెందాడు. ఇప్పుడు సత్యనారాయణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ధవళేశ్వరంలో గుండెపోటుతో.. ధవళేశ్వరం : రాష్ట్ర విభజన ప్రకటనతో కొన్నిరోజులుగా ఆందోళన చెందుతున్న ధవళేశ్వరానికి చెందిన సమైక్యవాది విప్పర్తి రజనీబాబు(37) శనివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. స్థానిక పాతపేటకు చెందిన పెయింటర్ విప్పర్తి రజనీబాబు రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటినుంచి సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలో ‘మాకొద్దీ గుండెకోత’ అంటూ రజనీబాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంది. శనివారం ఉదయం రజనీబాబుకు గుండెపోటు రావడంతో ఆయనను బంధువులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అతడు మర ణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రజనీబాబు భౌతికకాయానికి వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు తలారి వరప్రసాద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దంగుడుబియ్యం నారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితాబత్తుల ప్రసాద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవదాసి రాంబాబు తదితరులు నివాళులర్పించారు. మనస్తాపంతో లారీడ్రైవర్ తుమ్మలపల్లి(అల్లవరం) : రాష్ట్ర విభజనను తట్టుకోలేక తుమ్మలపల్లికి చెందిన లారీ డ్రైవర్ బొంతు రాజేంద్రప్రసాద్(48) గుండెపోటుతో చనిపోయాడు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటినుంచి అతడు మనస్తాపానికి గురయ్యాడు. సరిగ్గా భోజనం చేయకపోవడంతో నీరసించిపోయాడు. శనివారం గ్రామంలో జరిగిన ఆందోళన ల్లో పాల్గొన్నాడు. ఇంటికి తిరిగొచ్చిన అతడు సాయంత్రం గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.