24 వేలమంది కండక్టర్లు, డ్రైవర్లు.. ఇక రెగ్యులర్
ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సర్కారు ఆమోదం.. ఆర్నెళ్లపాటు సమ్మె నిషేధం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 9,500 మంది కాంట్రాక్టు కండక్టర్లు, 14,500 మంది కాంట్రాక్టు డ్రైవర్ల సర్వీసును క్రమబద్ధీకరించనున్నారు. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సంతకం చేశారు. సీనియారిటీ ప్రకారం సర్వీసును క్రమబద్ధీకరిస్తారు. ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణను సర్కారు మూడేళ్లుగా నిలుపుదల చేయడం, జనవరి 3 తర్వాత ఏ రోజైనా సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇటీవలే యాజమాన్యానికి నోటీసివ్వడం తెలిసిందే.
1,720 పోస్టుల భర్తీకి పచ్చజెండా: పలు శాఖల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైళ్లపై కూడా కిరణ్ సంతకం చేశారు. బీసీ సంక్షేమ శాఖలో 600 పోస్టు లు, పోలీసు శాఖలో 30, న్యాయ శాఖలో 20, రెవెన్యూ శాఖలో 20, ఎక్సైజ్ శాఖ లో 150, గిరిజన సంక్షేమ శాఖలో 900 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపారు.
సచివాలయంలో 30 మంది చౌకీదారు పోస్టులు
సచివాలయంలో చౌకీదారులు సరిపోవడం లేదని, వారి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా 30 చౌకీదారు పోస్టులను ఏర్పాటు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారి వేతనం నెలకు రూ.6,700-20,110 అని పేర్కొన్నారు.
ఆర్టీసీలో సమ్మెలు నిషేధం: ఆర్టీసీలో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు సిబ్బంది సర్వీసు క్రమబద్ధీకరణ, చనిపోయిన కాంట్రాక్టు సిబ్బంది కుటుంబీకులకు కారుణ్య నియామకాలు, వేతనాల సవరణ డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాలు కొద్దిరోజుల క్రితం యాజమాన్యానికి సమ్మె నోటీసివ్వడం తెలిసిందే. సానుకూలంగా స్పందించకుంటే జనవరి 3 తర్వాత ఏ రోజైనా సమ్మెకు దిగుతామని అవి హెచ్చరించిన నేపథ్యంలో నిషేధ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. సంఘాలను, ఆర్టీసీ యాజమాన్యాన్ని జనవరి 2న కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది.