సాక్షి, టెక్కలి: రామారావు.. అప్పారావు.. భాస్కరరావు.. ఇవన్నీ ఓటర్ల జాబితాలోని పేర్లు అనుకుంటే పొరపాటే. డివిజన్ కేంద్రమైన టెక్కలికి చెందిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి రామారావు ఇన్ని పేర్లతో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అధికారుల కళ్లు గప్పి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాజేస్తున్నాడు. ఈయన నిర్వాకంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి యు.తమ్మయ్య ఆధారాలతో సహా సిద్ధమయ్యారు. ఆయన చెప్పిన సమాచారం మేరకు.. టెక్కలి పట్టణానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి నెయ్యిల రామారావు బతికుండగానే అప్పారావుగా పేరు మార్చుకుని తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించాడు. దీంతో భార్య వరలక్ష్మికి వితంతు పింఛన్(ఐడీ నంబరు 101746880) మంజూరైంది.
రామారావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దేశం కార్యకర్తల సాయంతో వృద్ధాప్య పింఛన్ (ఐడీ నంబరు 101909288) కొట్టేశాడు. అంతేకాకుండా భార్య వరలక్ష్మి అతి తెలివి ప్రదర్శించి తన భర్త రామారావు పేరును భాస్కరరావుగా మార్చి స్థానిక ఎన్‌టీఆర్ కాలనీలో ఇళ్ల స్థలాలు కాజేయడంతో పాటు టీడీపీ కార్యకర్తల సాయంతో నిర్మాణాలు సైతం చేపట్టారు. అప్పట్లో కొంత మంది ఫిర్యాదు చేసినప్పటికీ టీడీపీ కార్యకర్తల అండతో ఇంటి నిర్మాణం పనులు వేగవంతంగా కొనసాగించేశారు. ఈ కుటుంబ సభ్యులకే స్థానిక శ్రీనివాసనగర్‌లో సొంతంగా భారీ భవనాలు ఉండడం విశేషం.
ఎప్పటికప్పుడు అధికారుల కళ్లుకప్పి ప్రభుత్వాన్ని మోసగిస్తూ పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను అక్రమార్గంలో పొందుతున్న వీరిపై చర్యలు తీసుకోవాలని స్థానిక విశ్రాంత ఉద్యోగి తమ్మయ్య టీడీపీ హయాంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రావడంతో రామారావు కుటుంబ సభ్యుల మోసాలపై ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు చేసేందుకు ఆయన సాక్ష్యాధారాలతో సహా సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment