గురువారం వరంగల్ జిల్లా హన్మకొండ బస్టాండ్‌లో బస్సును అడ్డుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు
తెలంగాణలో రెండో రోజు రోడ్డెక్కింది 1,550 బస్సులే..
{పయాణికులకు తప్పని తిప్పలు
ఇష్టారీతిన చార్జీలు వసూలు చేసిన ప్రైవేటు వాహనదారులు
11వ తేదీ నుంచి ప్యానెల్ రిక్రూట్‌మెంట్‌కు యాజమాన్యం నిర్ణయం
ఎంపికైన అభ్యర్థులకు నేరుగా ఉద్యోగం
విధులకు రాని కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె రెండో రోజైన గురువారం కూడా యథావిధిగా కొనసాగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో బస్సులను డిపోల్లోంచి బయటకు తెచ్చేందుకు యాజమాన్యం ప్రయత్నించినా అది ప్రయాణికులకు ఏమాత్రం ఊరట కలిగించలేదు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 350 బసులు రోడ్డెక్కగా గురువారం 90 శాతం అద్దె బస్సులను అందుబాటులోకి తేవడంతో 1,550 బస్సులు నడిచాయి. అయినా ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. దీన్ని అవకాశంగా మలచుకున్న ప్రైవేటు వాహనదారులు ప్రయాణికులను ఇష్టారీతిన దోచుకున్నారు. కాగా, డిపోల్లోంచి బయటకు వస్తున్న బస్సులు రోడ్డెక్కకుండా చాలా చోట్ల కార్మికులు అడ్డుపడగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఇక నియామకాలే...
ఆర్టీసీ భవిష్యత్తు ఉద్యోగావకాశాల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బుధవారం ప్రకటించిన ఆర్టీసీ ఎండీ.. ఏకంగా ప్యానల్ రిక్రూట్‌మెంట్ ప్రారంభిస్తున్నట్లు గురువారం వెల్లడించారు. తాత్కాలిక పద్ధతిలో వచ్చే వారిని ప్యానల్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపిక చేసి ఆర్టీసీలో ఖాళీ అయ్యే పోస్టుల్లో వారిని భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి శుక్ర/శనివారాల్లో నోటిఫికేషన్ విడుదల చే సి సోమవారం నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మరోవైపు విధులకు హాజరు కాని సుమారు 600 మంది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోంచి తొలగిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇక సర్వీసు క్రమబద్ధీకరణ పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు కార్మికులకు వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా నిర్ణయించారు. విధుల్లో చేరిన వెంటనే రెగ్యులరైజేషన్ సర్టిఫెకెట్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది.
బస్సులు నడుపండి... డబ్బులు తీసుకోండి
అద్దె బస్సులన్నీ రోడ్డెక్కేలా ఆర్టీసీ యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా అద్దె బస్సులకు కిలోమీటరుకు రూ.17 చొప్పున చెల్లిస్తారు. ఇప్పుడు ఆ రూట్‌లో వసూలైన మొత్తాన్ని అద్దె బస్సు నిర్వాహకులే తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. దీంతో గురువారం ఏకంగా 1,100 అద్దె బస్సులు డిపోల్లోంచి బయటకు వచ్చాయి. మరోవైపు సమ్మె నేపథ్యంలో ఇతర రాష్ట్రాల బస్సులు అధికంగా తిరిగేలా కూడా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్‌లో రోడ్డెక్కిన 400 బస్సులు
సమ్మె వల్ల హైదరాబాద్‌లోని 28 డిపోల పరిధిలో గురువారం 400 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ జయరావు తెలిపారు. శుక్రవారం నాటికి మరిన్ని బస్సులు పెరిగే అవకాశం ఉందన్నారు. కాగా, ప్రైవేట్ సిబ్బందిపై ఒకటి రెండు చోట్ల దాడికి దిగిన నలుగురు కార్మికులపై పోలీసులు కేసు సమోదు చేశారు. రాణిగంజ్-2 డిపోకు చెందిన ఒక కండక్టర్‌ను ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు.
సమ్మెకు మద్దతు: ఉత్తమ్, పొన్నాల, పొన్నం
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, పీఆర్సీ, ఫిట్‌మెంటు, సౌకర్యాలు ఇస్తామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావంగా ఉంటామన్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండా ఎస్మాతో భయపెట్టే ప్రయత్నాలు చేయడం సరైంది కాదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.
ఎవరి వాదన వారిదే
43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే సంస్థపై ఏడాదికి రూ. 1800 కోట్ల భారం పడుతుంది.
- ఇది ఆర్టీసీ యాజమాన్యం వాదన
ఇదంతా తప్పడు లెక్క. ప్రస్తుతం కార్మికులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) కోసం రూ.382 కోట్లు చెల్లిస్తున్నారు. దీనిని 27 శాతం ఫిట్‌మెంట్‌గా మారిస్తే అదనంగా పడే భారం మరో రూ.100 కోట్లు మాత్రమే. ఇక 43 శాతం ఫిట్‌మెంట్‌లో మిగిలిన 16 శాతానికి ఏడాదికి అయ్యే మొత్తం రూ.450 కోట్లు. అంటే కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ అమలుచేస్తే సంస్థపై పడే అదనపు భారం కేవలం రూ.550 కోట్లు మాత్రమే. - ఇది కార్మిక సంఘాల వాదన
కార్మిక సంఘాలు చెబుతున్న లెక్క తప్పు. 27 శాతం ఐఆర్‌ను 27 శాతం ఫిట్‌మెంట్‌గా మారిస్తే సంస్థపై రూ.850 కోట్ల అదనపు భారం పడుతుంది. - ఇది ఆర్టీసీ యాజమాన్యం జవాబు
రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే ప్రయోజనాలన్నీ కూడా ఇప్పుడే కలిపేసి ఫిట్‌మెంట్ కోసం వెచ్చించే మొత్తాన్ని ఎక్కువగా చూపిస్తున్నారు. అది సరికాదు. - కార్మికసంఘాల స్పష్టీకరణ
చర్చలకు సిద్ధం
కార్మికులతో చర్చలకు నేను సదా సిద ్ధం. వారి వద్దకే రమ్మంటే అందుకూ సిద్ధమే. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సమ్మె విరమించాలి. సమస్య పరిష్కారానికి కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 27 శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తే... రూ. 15 వేల మూలవేతనం హెచ్‌ఆర్‌ఏతో సంబం ధం లేకుండా రూ. 26 వేలకు పెరుగుతుంది. ఇది చిన్న విషయం కాదు. దీన్ని కార్మికులు గుర్తించాలి. కార్మికులకు ఇళ్ల స్థలాలిచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీన్ని కొలిక్కి తెచ్చే సమయంలో సమ్మెకు దిగారు. ఇది ఇదివరకు తీసుకున్న నిర్ణయమే. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. వాటిని అడ్డుకుంటే మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగులను తీసుకున్నా భద్రత విషయంలో రాజీపడం. రవాణాశాఖ డీటీసీలు సర్టిఫై చేసిన డ్రైవర్లనే ఎంపిక చేస్తున్నాం. గురువారం సిరిసిల్లలో ఓ వ్యక్తి మరణానికి కారణమైన బస్సు ఆర్టీసీ అద్దె బస్సు. దాన్ని నడిపింది కొత్త డ్రైవర్ కాదు. సమ్మె నేపథ్యంలో ఉద్రిక్తతలకు కారణం ఆర్టీసీ యాజమాన్యం కాదు. దానికి కార్మికులే బాధ్యత వహించాలి.
- సాంబశివరావు, ఆర్టీసీ ఎండీ
ఏపీలోనూ కొనసాగిన సమ్మె
హైదరాబాద్, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం రెండోరోజు కూడా ఆర్టీసీ సమ్మె కొనసాగింది. మెట్టు దిగని ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక సిబ్బందిని నియమించి అద్దె బస్సులను తిప్పే ప్రయత్నాలు చేసింది. ఆందోళనల రూపంలో అడ్డుకున్న కార్మికులపై లాఠీచార్జి, అరెస్టు చేయడం వంటి చర్యలతో పరోక్షంగా ఎస్మా ప్రయోగానికి ప్రభుత్వం పూనుకుంది. రెండు రోజులకు ఆర్టీసీకి రూ.30 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలోని అన్ని రీజియన్లలో 3,258 బస్సులు నడిపినట్లు ప్రభుత్వం పేర్కొంది. సంస్థలోని 2,099 అద్దె బస్సుల్లో 1,777, సంస్థకు చెందిన 8,663 బస్సుల్లో 1,481 నడిపినట్లు తెలిపింది. చిన్న ఘటనలు మినహా సమ్మె రెండో రోజు విజయవంతమైంది.
అనుభవంలేని డ్రైవర్లతో ప్రమాదాలు.. : ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, యాజమాన్యం తాత్కాలిక సిబ్బందిని నియమించి సమ్మె విచ్చిన్నకర చర్యలు చేస్తున్నాయంటూ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు మండిపడుతున్నారు. ఏమాత్రం అనుభవంలేని డ్రైవర్ల వల్ల గురువారం విశాఖ జిల్లాలో మూడు, కృష్ణా జిల్లాలో నాలుగు స్వల్ప ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు తాత్కాలిక కండక్టర్లకు ట్రిమ్, టిక్కెట్లు ఇవ్వకపోవడంతో ప్రయాణికుల నుంచి టికెట్ మొత్తంతో నిమిత్తం లేకుండా అదనపు వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. శ్రీకాకుళంలో గురువారం అదనపు వసూలు చేసిన కండక్టర్లతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. కాగా ప్రభుత్వం, యాజమాన్యం మొండివైఖరికి పోకుండా కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు డిమాండ్ చేశారు.
రెండోరోజు 38 శాతం బస్సులు: శిద్ధా
రెండో రోజు గురువారం 38 శాతం బస్సులు నడిపామని, శుక్రవారం 55 శాతం బస్సులు తిప్పుతామని రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు మీడియాకు తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని తాను అన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవాలని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం యూనియన్ నేతల్ని చర్చలకు పిలిచేది లేదని, కానీ వారు వస్తే చర్చించడానికి సిద్ధమని మంత్రి చెప్పారు. ఎంసెట్, డీఎస్సీ పరీక్షలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
ఆర్టీసీ సమ్మెకు మావోయిస్టుల మద్దతు
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సీపీఐ (మావోయిస్టు) పార్టీ మద్దతు తెలిపింది. ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్న కుట్రలో భాగం కావద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ఏర్పడి 10 నెలలైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలు నేరవేర్చలేకపోయిందని విమర్శిం చింది. ఈ మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో హిందూ మతోన్మాద ప్రభుత్వం, తెలంగాణ, ఏపీల్లో టీఆర్‌ఎస్, టీడీపీల పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని పేర్కొన్నారు.