‘సర్‌.. బస్సు ఖాళీగా లేదు.. సీట్లు ఫుల్‌.. ముందు బస్సు దిగేయండి’ | - | Sakshi
Sakshi News home page

‘సర్‌.. బస్సు ఖాళీగా లేదు.. సీట్లు ఫుల్‌.. ముందు బస్సు దిగేయండి’

Published Tue, Jun 13 2023 12:12 PM | Last Updated on Tue, Jun 13 2023 12:24 PM

 తిరుపతి బస్టాండ్‌  - Sakshi

తిరుపతి బస్టాండ్‌

‘సర్‌.. బస్సు ఖాళీగా లేదు.. సీట్లన్నీ ఫుల్లయ్యాయి.. ముందు బస్సు దిగేయండి.. వెనుక ఖాళీగా వస్తోంది. ఆ బస్సులు రండి’ ఇదీ ఆర్టీసీ సిబ్బంది నుంచి వినిపిస్తున్న మాట. సీట్లు ఖాళీగా ఉన్నా.. ఆపేందుకు డ్రైవర్లు ఆసక్తి చూపకపోగా.. కొందరు కండక్టర్లు టిక్కె ట్లు కొట్టి డబ్బులు తీసుకోవాలన్నా ఇబ్బంది పడిపోతున్నారు. బస్సు ఖాళీ లేదు.. దిగండి అంటూ.. ప్రయాణికులను ఒకింత దగమాయిస్తూ దింపేస్తున్నారు.. వెనుక వస్తున్న బస్సునైనా ఎక్కదామంటూ ఆ సిబ్బందే అదేమాట.. ఇదెక్కడో కాదండోయ్‌.. మన తిరుపతి జిల్లాలోనే.. దీంతో చేసేది లేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.

తిరుపతి అర్బన్‌: ఆర్టీసీ ఆర్థిక కష్టాలు అందరికీ తెలిసిందే. ప్రతి డిపో కష్టాల్లోనే నడుస్తోంది. దీనికితోడు 2020–21లో కోవిడ్‌ మరింత దెబ్బతీసింది. ఆ తర్వాత తిరుపతి జిల్లా లాభాల దిశగా పయనిస్తోంది. అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ఉద్యోగులు వ్యవహరించాల్సి ఉంది. అయితే కొందరు డ్రైవర్లు, కండక్టర్లు బస్టాండ్‌లో, స్టాపింగ్‌ పాయింట్ల వద్ద బస్సు ఆపకుండా వెళ్లిపోతుండడం విమర్శలకు తావిస్తోంది.

వెనుక బస్సు ఖాళీగా వస్తోంది
శ్రీకాళహస్తి, పుత్తూరు, చిత్తూరు మార్గాల్లో తిరుపతికి వచ్చిపోయే బస్సుల్లో స్టాపింగ్‌ ఉన్నా, ప్రయాణికులు చెయ్యెత్తి మొత్తుకున్నా బస్సులు ఆగకుండా వెళ్లిపోతున్నాయి. సార్‌ సీట్లు లేవు.. వెనుక బస్సు ఖాళీగా వస్తోంది.. అంటూ ఉచిత సలహాలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఆర్టీసీ కండక్టర్లు చెప్పిన మాటలు నిజమేనని తర్వాత వచ్చే వెనుక బస్సును ఆపినా అదే పరిస్థితి. మరీ పిల్లలు, వృద్ధులు ఉంటే అస్సలు ఆపడం లేదు. చిన్నపాటి బ్యాగ్‌లు ఉన్నా ఆపని పరిస్థితి. దీంతో ప్రజలు ఆర్టీసీ ఉద్యోగుల తీరును తప్పుపడుతున్నారు. తాము స్టాడింగ్‌ జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నా బస్సులు ఆపకుండా వెళ్తున్నారని మండిపడుతున్నారు.

ఇదిగో సాక్ష్యం
 
రెండు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి సమీపంలోని మిట్టకండ్రిగ బస్టాపింగ్‌ పాయింట్‌ వద్దకు చేరాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత ఓ ఆర్డినరీ సర్వీసు వచ్చింది. బస్సు ఖాళీగా ఉన్నా డ్రైవర్‌ ఆపలేదు. చెయ్యెత్తి మొత్తుకున్నా కన్నెత్తి చూడలేదు.. దీంతో చేసేది లేక తమిళనాడుకు ఆర్టీసీ బస్సులో ఆ యువకుడు తిరుపతికి వెళ్లాల్సి వచ్చింది.

సీట్లతో పనిలేదు
సీట్లతో పనిలేదు. తప్పకుండా బస్సును ఆయా సర్కిళ్లలో నిలపాలి. ప్రయాణికులు చెయ్యెత్తిన చోటంతా బస్సును ఆపాల్సిందే. జిల్లాలోని డీఎంలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం. లేదంటే డ్రైవర్లు, కండక్టర్లపై చర్యలు తప్పవు.
–చెంగల్‌రెడ్డి, ఆర్‌ఎం, ఆర్టీసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement