విద్యార్థుల వీరంగం
క్రమంతప్పకుండా కాలేజీలకు వెళ్లి విద్యాబుద్దులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు బస్‌డే పేరుతో వీరంగం సృష్టించారు. రాళ్లు కర్రలతో దాడులకు పాల్పడి పలువురిని గాయపరిచారు. మరో సంఘటనలో బస్సును దారిమళ్లించి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేశారు.
- బస్సులపై రాళ్ల వర్షం
- పలువురికి గాయాలు
- శృతిమించుతున్న బస్‌డే
చెన్నై, సాక్షి ప్రతినిధి: నగరంలోని కళాశాలల విద్యార్థులు బస్‌డే పేరుతో కొంతకాలంగా విశృంఖలత్వాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారింది. బస్‌డే అమలులో భాగంగా బస్సు డ్రైవర్లను భయపెట్టి నెమ్మదిగా నడిపించడం, దారిమళ్లించడం వంటి చర్యలకు దిగుతున్నారు. వారిని ఎదిరించిన డ్రైవర్, కండక్టర్లను దుర్భాషలాడడంతోపాటు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఎంఎండీఏ రోడ్డు- ప్యారిస్ బస్సు (12జీ) కీల్‌పాక్ మీదుగా వెళుతుండగా కీల్‌కాక్ వైద్య కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బస్సు ఎక్కారు.
ఫుట్‌బోర్డుపై నిల్చుని పాటలు పాడుతూ సాగారు. బస్సును తాబేలు వేగంతో నడపాలని ఆదేశించారు. ఈ బస్సు పూందమల్లి రోడ్డులోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం దాటగానే విద్యార్థులు హద్దుమీరారు. కొందరు బస్‌టాప్‌పైకి ఎక్కి నృత్యాలు చేశారు. మరికొందరు డ్రైవర్ సీటు వద్ద నిలబడి ఫొటోలు దిగారు. ఇంకో విద్యార్థి డ్రైవర్‌ను అతని సీటు నుంచి లేపి తాను నడిపే ప్రయత్నం చేశాడు. వారి చేష్టలకు భీతిల్లిన ప్రయాణికులు రహస్యంగా ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాకను గమనించిన విద్యార్థులు పరుగులు తీశారు. డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు ఎవ్వరూ వారిపై ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదు.
విద్యార్థుల మధ్య పరస్పరం దాడులు
రెండు కాలేజీలకు చెందిన విద్యార్థులు శుక్రవారం పరస్పరం దాడులకు పాల్పడి బస్సులోని ప్రయూణికులను భయభ్రాంతులకు గురిచేశారు. పెరంబూరు - తిరువేర్కాడు (29ఈ) బస్సు ప్రయాణికులతో వెళుతుండగా మార్గమధ్యంలో పచ్చపాస్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎక్కారు. బస్సులోపల స్థలం ఉన్నా ఫుట్‌బోర్డుపై ప్రయాణించారు. ఈ బస్సుకు ఎదురుగా మరో కాలేజీ విద్యార్థులతో అన్నాసమాధి- పెరంబూరు (29ఏ) బస్సు ఓట్టేరి బ్రిడ్జి వద్ద తారసపడింది.
29ఈ బస్సు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న విద్యార్థులను మరో బస్సులోని విద్యార్థులు దుడ్డుకర్రలతో కొట్టారు. బస్సుపై రాళ్లు రువ్వారు. దెబ్బలకు తాళలేక విద్యార్థులు బస్సులోపలికి వెళ్లిపోయారు. వారి దాడులతో రెండు బస్సుల్లోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఈ గందరగోళాన్ని గమనించిన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో దాడులకు పాల్పడిన వారు పరారయ్యూరు. రాళ్ల వర్షంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ దాడుల్లో బస్సులోని మహిళా ప్రయాణికులు రోషిణి, విజయభారతి, విద్యార్థులు భూపేష్, రామ్‌కుమార్ గాయపడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాజీ అనే విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.