bus day
-
ప్రాణం మీదకు తెచ్చిన ‘బస్ డే’ వేడుకలు
-
ప్రాణం మీదకు తెచ్చిన ‘బస్ డే’ వేడుకలు
చెన్నై : పుట్టిన రోజు వేడుకల పేరిట ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు అనేకం చూశాం. కానీ ఈ తింగరి కుర్రాళ్లు ‘బస్ డే’ పేరిట తమ ప్రాణాలనే కాక ప్రయాణికుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టారు. డ్రైవర్ జాగ్రత్తగా వ్యవహరించడంతో తృటిలో ప్రమాదం తప్పింది.. లేదంటే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయేవారు. చాలా ఏళ్లుగా తమిళ నాట కాలేజీ విద్యార్థులు బస్ డే పేరిట వేడుకలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా విద్యార్థులు కదులుతున్న బస్సు ఎక్కి అనేక స్టంట్లు చేస్తుంటారు. అయితే ఇలాంటి వేడుకల వల్ల ప్రజలు ఇబ్బందులు పడటమే కాక ప్రాణాపాయం ఉందని భావించిన ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఈ వేడుకలను నిషేధించింది. కానీ మంగళవారం కొందరు విద్యార్థులు వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. పోలీసుల మాట లెక్క చేయకుండా ‘బస్ డే’ వేడుకలు నిర్వహించారు. దానిలో భాగంగా దాదాపు 30 మంది విద్యార్థులు కదులుతున్న బస్సు మీదకు చేరుకుని ఒక్కసారిగా కిందకు దూకారు. అప్పటికే కండక్టర్, డ్రైవర్ ఎంత వారిస్తున్న విద్యార్థులు లెక్క చేయలేదు. వీరి పిచ్చి చేష్టలకు భయపడిన డ్రైవర్ ఒక్క సారిగా బ్రేక్ వేయడంతో భారీ ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ సంఘటనలో దాదాపు 18మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు 20 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పచ్చయప్ప కాలేజ్, అంబేడ్కర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. -
విద్యార్థుల వీరంగం
క్రమంతప్పకుండా కాలేజీలకు వెళ్లి విద్యాబుద్దులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు బస్‌డే పేరుతో వీరంగం సృష్టించారు. రాళ్లు కర్రలతో దాడులకు పాల్పడి పలువురిని గాయపరిచారు. మరో సంఘటనలో బస్సును దారిమళ్లించి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేశారు. - బస్సులపై రాళ్ల వర్షం - పలువురికి గాయాలు - శృతిమించుతున్న బస్‌డే చెన్నై, సాక్షి ప్రతినిధి: నగరంలోని కళాశాలల విద్యార్థులు బస్‌డే పేరుతో కొంతకాలంగా విశృంఖలత్వాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారింది. బస్‌డే అమలులో భాగంగా బస్సు డ్రైవర్లను భయపెట్టి నెమ్మదిగా నడిపించడం, దారిమళ్లించడం వంటి చర్యలకు దిగుతున్నారు. వారిని ఎదిరించిన డ్రైవర్, కండక్టర్లను దుర్భాషలాడడంతోపాటు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఎంఎండీఏ రోడ్డు- ప్యారిస్ బస్సు (12జీ) కీల్పాక్ మీదుగా వెళుతుండగా కీల్కాక్ వైద్య కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బస్సు ఎక్కారు. ఫుట్‌బోర్డుపై నిల్చుని పాటలు పాడుతూ సాగారు. బస్సును తాబేలు వేగంతో నడపాలని ఆదేశించారు. ఈ బస్సు పూందమల్లి రోడ్డులోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం దాటగానే విద్యార్థులు హద్దుమీరారు. కొందరు బస్టాప్పైకి ఎక్కి నృత్యాలు చేశారు. మరికొందరు డ్రైవర్ సీటు వద్ద నిలబడి ఫొటోలు దిగారు. ఇంకో విద్యార్థి డ్రైవర్‌ను అతని సీటు నుంచి లేపి తాను నడిపే ప్రయత్నం చేశాడు. వారి చేష్టలకు భీతిల్లిన ప్రయాణికులు రహస్యంగా ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాకను గమనించిన విద్యార్థులు పరుగులు తీశారు. డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు ఎవ్వరూ వారిపై ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదు. విద్యార్థుల మధ్య పరస్పరం దాడులు రెండు కాలేజీలకు చెందిన విద్యార్థులు శుక్రవారం పరస్పరం దాడులకు పాల్పడి బస్సులోని ప్రయూణికులను భయభ్రాంతులకు గురిచేశారు. పెరంబూరు - తిరువేర్కాడు (29ఈ) బస్సు ప్రయాణికులతో వెళుతుండగా మార్గమధ్యంలో పచ్చపాస్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎక్కారు. బస్సులోపల స్థలం ఉన్నా ఫుట్‌బోర్డుపై ప్రయాణించారు. ఈ బస్సుకు ఎదురుగా మరో కాలేజీ విద్యార్థులతో అన్నాసమాధి- పెరంబూరు (29ఏ) బస్సు ఓట్టేరి బ్రిడ్జి వద్ద తారసపడింది. 29ఈ బస్సు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న విద్యార్థులను మరో బస్సులోని విద్యార్థులు దుడ్డుకర్రలతో కొట్టారు. బస్సుపై రాళ్లు రువ్వారు. దెబ్బలకు తాళలేక విద్యార్థులు బస్సులోపలికి వెళ్లిపోయారు. వారి దాడులతో రెండు బస్సుల్లోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఈ గందరగోళాన్ని గమనించిన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో దాడులకు పాల్పడిన వారు పరారయ్యూరు. రాళ్ల వర్షంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ దాడుల్లో బస్సులోని మహిళా ప్రయాణికులు రోషిణి, విజయభారతి, విద్యార్థులు భూపేష్, రామ్‌కుమార్ గాయపడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాజీ అనే విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
బస్ డే రగడ!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో బస్ డేలు జరుపుకోవడం కళాశాల విద్యార్థులకు ఓ ఫ్యాషన్. తమ ప్రాంతా ల నుంచి తమ కళాశాలల మీదుగా వెళ్లే బస్సులకు పూలమాలలు వేసి, ప్రయూణికులతో శృతి మించి వ్యవహరించడం వివాదాలకు దారి తీస్తూ వచ్చింది. బస్ డేల నిర్వహణ కళాశాలల మధ్య పోటీకి దారి తీయడంతో పాటుగా విద్యార్థుల మధ్య పచ్చగ డ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. చెన్నైలో ఈ వ్యవహారం ముదరడంతో ఇటీవల కోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడంతో పాటుగా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడులు జరుగుతుండడంతో బస్ డేలకు మద్రాసు హైకోర్టు బ్రేక్ వేసింది. బస్ డే ఊసెత్తితే చాలు విద్యార్థుల నడ్డి విరిచేందుకు నగర పోలీసు యంత్రాంగం సిద్ధం అయింది. కోర్టు ఆంక్షల్ని ఉల్లంఘించి చాప కింద నీరులా కొన్ని చోట్ల బస్సుడేలు తమ తమ కళాశాల పరిధుల్లో జరుపుకుంటున్నారు. అయితే, సోమవారం నందనం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు పోలీసులను సవాల్ చేస్తూ బస్డేకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. వీరంగం: నందనం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉదయాన్నే థౌజండ్ లైట్ పరిసరాల్లో మోహరించారు. అటువైపుగా ఐనావరం నుంచి బీసెంట్ నగర్ వెళ్లే బస్సు రావడంతో, దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బస్సుకు బ్యానర్ కట్టారు. బస్సు మీదెక్కి కేరింత లు కొడుతూ, ఈలలు, కేకలు వేస్తూ ముందుకు కదిలారు. విద్యార్థుల చర్యలతో ఆ బస్సులోని ప్రయాణికులు నానా కష్టాలు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు జెమినీ వంతెన వద్ద ఆ బస్సును అడ్డుకున్నారు. తమ కళాశాల వైపుగా బస్సును మళ్లించేందుకు విద్యార్థులు విశ్వ ప్రయత్నం చేశారు. కోర్టు ఆంక్షలను ఉల్లంఘించి బస్సు డేలు వద్దంటూ వారించినా విద్యార్థులు మాత్రం తగ్గలేదు. బస్సు మీద నుంచి చిందులేస్తూ, కేరింతలు కొడుతూ పోలీసులకు సవాళ్లు విసరడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఉద్రిక్తత: బస్సు మీదున్న విద్యార్థులను పోలీసు లు బలవంతంగా కిందకు దించే ప్రయత్నం చేశా రు. ఫలితం లేకపోవడంతో లాఠీలకు పనిచెప్పారు. అక్కడి నుంచి విద్యార్థులను చెదరగొట్టారు. ఈ తంతంగం కారణంగా రెండు గంటల పాటుగా అన్నా సాలైలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విద్యార్థులపై లాఠీచార్జిని నిరసిస్తూ నందనం కళాశాల విద్యార్థులు అక్కడే ఆందోళనకు యత్నించారు. అయితే పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగడంతో వెనక్కు తగ్గారు. పరిస్థితి అదుపు తప్పకుండా నందనం కళాశాల, నందనం సిగ్నల్, జెమినీ వంతెన పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.