బస్ డే రగడ!
Published Tue, Jan 28 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో బస్ డేలు జరుపుకోవడం కళాశాల విద్యార్థులకు ఓ ఫ్యాషన్. తమ ప్రాంతా ల నుంచి తమ కళాశాలల మీదుగా వెళ్లే బస్సులకు పూలమాలలు వేసి, ప్రయూణికులతో శృతి మించి వ్యవహరించడం వివాదాలకు దారి తీస్తూ వచ్చింది. బస్ డేల నిర్వహణ కళాశాలల మధ్య పోటీకి దారి తీయడంతో పాటుగా విద్యార్థుల మధ్య పచ్చగ డ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. చెన్నైలో ఈ వ్యవహారం ముదరడంతో ఇటీవల కోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడంతో పాటుగా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడులు జరుగుతుండడంతో బస్ డేలకు మద్రాసు హైకోర్టు బ్రేక్ వేసింది. బస్ డే ఊసెత్తితే చాలు విద్యార్థుల నడ్డి విరిచేందుకు నగర పోలీసు యంత్రాంగం సిద్ధం అయింది. కోర్టు ఆంక్షల్ని ఉల్లంఘించి చాప కింద నీరులా కొన్ని చోట్ల బస్సుడేలు తమ తమ కళాశాల పరిధుల్లో జరుపుకుంటున్నారు. అయితే, సోమవారం నందనం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు పోలీసులను సవాల్ చేస్తూ బస్‌డేకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది.
వీరంగం: నందనం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉదయాన్నే థౌజండ్ లైట్ పరిసరాల్లో మోహరించారు. అటువైపుగా ఐనావరం నుంచి బీసెంట్ నగర్ వెళ్లే బస్సు రావడంతో, దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బస్సుకు బ్యానర్ కట్టారు. బస్సు మీదెక్కి కేరింత లు కొడుతూ, ఈలలు, కేకలు వేస్తూ ముందుకు కదిలారు. విద్యార్థుల చర్యలతో ఆ బస్సులోని ప్రయాణికులు నానా కష్టాలు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు జెమినీ వంతెన వద్ద ఆ బస్సును అడ్డుకున్నారు. తమ కళాశాల వైపుగా బస్సును మళ్లించేందుకు విద్యార్థులు విశ్వ ప్రయత్నం చేశారు. కోర్టు ఆంక్షలను ఉల్లంఘించి బస్సు డేలు వద్దంటూ వారించినా విద్యార్థులు మాత్రం తగ్గలేదు. బస్సు మీద నుంచి చిందులేస్తూ, కేరింతలు కొడుతూ పోలీసులకు సవాళ్లు విసరడం ఉద్రిక్తతకు దారి తీసింది.
ఉద్రిక్తత: బస్సు మీదున్న విద్యార్థులను పోలీసు లు బలవంతంగా కిందకు దించే ప్రయత్నం చేశా రు. ఫలితం లేకపోవడంతో లాఠీలకు పనిచెప్పారు. అక్కడి నుంచి విద్యార్థులను చెదరగొట్టారు. ఈ తంతంగం కారణంగా రెండు గంటల పాటుగా అన్నా సాలైలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విద్యార్థులపై లాఠీచార్జిని నిరసిస్తూ నందనం కళాశాల విద్యార్థులు అక్కడే ఆందోళనకు యత్నించారు. అయితే పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగడంతో వెనక్కు తగ్గారు. పరిస్థితి అదుపు తప్పకుండా నందనం కళాశాల, నందనం సిగ్నల్, జెమినీ వంతెన పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
Advertisement