పఠాన్‌చెరు డిపోలో నిద్రిస్తున్న ్రౖడైవర్లు, కండక్టర్లు, అపరిశుభ్రంగా ఉన్న వాష్‌బెషిన్
సాక్షి, సిటీబ్యూరో: నైట్ అవుట్ సర్వీసుల్లో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. రెస్ట్ రూంలలో మంచాలు లేక, కనీస సదుపాయాలు లేక కటిక నేలపైనే పడుకుంటున్నారు. తిరిగి నిద్రలేమితోనే తెల్లవారు జామున విధులు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజూ వందలాది బస్సులు వివిధ ప్రాంతాల్లో నైట్ అవుట్ సర్వీసులుగా నిలిచిపోతాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు సర్వీసులను ఉదయాన్నే అక్కడి నుంచి ప్రారంభించేందుకు అనుగుణంగా నైట్ అవుట్ çసర్వీసులను ఏర్పాటు చేశారు. కానీ డ్రైవర్లు, కండక్టర్లకు విశ్రాంతి గదులలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల బస్సుల్లోనే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. దీంతో వారు సరైన నిద్రకు నోచుకోవడం లేదు. తిరిగి తెల్లవారు జామునే బస్సులు నడపాల్సి రావడంతో నిద్రలేమి, బడలిక కారణంగా విధి నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగరంలోని గౌలిగూడ సెంట్రల్ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, ఉప్పల్, జగద్గిరిగుట్ట, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు సుమారు 250కి పైగా సిటీ బస్సులను నైట్ అవుట్ సర్వీసులుగా నిలుపుతారు. ఈ బస్సుల్లో 500 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం రెండో షిఫ్టు విధుల్లో చేరిన బస్సులు ఆఖరి ట్రిప్పు పూర్తయిన తరువాత ఇలా నైట్ అవుట్‌లుగా ఉండి ఉదయం ట్రిప్పులతో డిపోలకు చేరుకుంటాయి.
సిబ్బందిపై చిన్న చూపు
పటాన్‌చెరులో ప్రతి రోజు సుమారు 100 బస్సులు నిలిచి ఉంటాయి. 200 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఈ బస్సుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వారి కోసం ఏర్పాటు చేసిన రెస్ట్‌రూమ్‌లు దారుణంగా ఉన్నాయి. ఉప్పల్‌లో 70 బస్సులు, జేబీఎస్‌లో మరో 50 బస్సులు, సీబీఎస్‌లో 70 బస్సులకు పైగా రాత్రి పూట నిలిపి ఉంచుతారు. సీబీఎస్ విశ్రాంతి గదుల్లో డ్రైవర్, కండక్టర్లకు మంచాలు ఉన్నప్పటికీ ఫ్యాన్లసైతం లేకపోవడంతో నిద్ర కరవువవుతోందని పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
జగద్గిరిగుట్టలో బస్సుల్లోనే నిద్ర
వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులతో పాటు, నగరంలోని పలు డిపోలకు చెందిన 40 బస్సులను జగద్గిరిగుట్టలో నిలిపి ఉంచుతారు. ఇక్కడ ఎలాంటి విశ్రాంతి గదులు లేకపోవడం వల్ల సిబ్బంది బస్సుల్లోనే నిద్ర పోవాల్సి వస్తుంది. ‘‘ బస్సులో పడుకొంటే నిద్ర రాదు. బయట ఎక్కడా పడుకోలేం. పైగా బస్సుల భద్రత కూడా ముఖ్యమే కదా. ఇలా జగద్గిరిగుట్టకు వచ్చినప్పుడల్లా నరకాన్ని చవి చూస్తున్నాం.’’ అని జనగామ డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా వాహనాల రొద తమకు నిద్ర లేకుండా చేస్తుందన్నారు. ఉప్పల్‌లో విశ్రాంతి గదులు ఉన్నప్పటికీ సరైన వసతులు లేవు. జేబీఎస్‌లోనూ అదే పరిస్థితి.
ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు
విశ్రాంతి గదుల్లో కనీస సదుపాయాలపై ఇప్పటికి చాలా సార్లు అధికారులకు విన్నవించాం, అయినా పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల టాయిలెట్లు లేవు. కొన్ని చోట్ల విశ్రాంతి గదులే లేవు. నైట్ అవుట్ డ్యూటీ కింద రూ.30 అలవెన్స్ ఇస్తారు. ఈ రోజుల్లో ఆ డబ్బులు ఎందుకూ సరిపోవడం లేదు. – హనుమంతు ముదిరాజ్, ఆర్టీసీ టీజేఎంయూ
అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి
నిద్ర లేమి వల్ల చాలా మంది డ్రైవర్లు, కండక్టర్లు అనారోగ్యానికి గురవుతున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం దారణం.
– ఆర్‌ఎన్. రావు, కార్మిక నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment