చిల్లర గల్లంతైతే ఉద్యోగం ఊడినట్టే!
చిల్లర గల్లంతైతే ఉద్యోగం ఊడినట్టే!
Published Fri, Jan 27 2017 2:43 AM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM
కండక్టర్లు, డ్రైవర్లపై ఆర్టీసీ కఠిన వైఖరి
- అప్పీళ్లపై జాలి వద్దని తాజాగా ఆదేశం
- సహేతుక ఆధారాలు లేకుంటే తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: చిరుద్యోగికి 'చిల్లర' తంటా వచ్చి పడింది. టికెట్‌కు సంబంధిం చిన చిల్లర డబ్బులు గల్లంతు చేస్తే, ఇక కండక్టర్లు, డ్రైవర్ల (టిమ్ సర్వీసు) ఉద్యోగాలు ఊడినట్టే. గల్లంతైన మొత్తం ఎంత స్వల్పమైనా వారు అక్రమాలకు పాల్పడ్డట్టు తేలితే ఉద్యోగం ఊడిపోతుంది. ఉద్యోగాలు కోల్పోయినవారి అప్పీల్‌ను ఆమోదించడంలో అప్పీలేట్ అ«థారిటీ అధికారులు కఠినంగానే వ్యవహరించబోతున్నారు. ఈ మేరకు తాజాగా ఆర్టీసీ యాజమాన్యం అప్పీలేట్ అథారిటీ అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. చిల్లర గల్లంతు చేసి ఉద్యోగాలు కోల్పోయిన వారి అప్పీళ్లను అధికారులు గుడ్డిగా ఆమోదించి తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నారని పేర్కొన్న యాజమాన్యం, ఇక నుంచి అలా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించడం గమనార్హం.
భారీ అక్రమాలు వదిలి...
యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్‌పై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించటంలో తప్పులేదు. కఠినంగా ఉంటేనే మళ్లీ అక్రమాలకు పాల్పడరు. కానీ రూ.లక్షల్లో అక్రమాలకు పాల్పడే అధికారులపై ఈగవాలనివ్వకుండా, చిల్లర గల్లంతు చేసే కండక్టర్లనే లక్ష్యంగా చేసుకుని కఠినంగా వ్యవహరించటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఒక జిల్లాలోని కొన్ని ప్రధాన బస్టాండ్ల ఆవరణలో కొత్త అద్దె దుకాణాల ఏర్పాటుకు స్థానిక అధికారులు టెండర్లు పిలిచారు. ఒకే రకమైన వస్తువుల విక్రయం కోసం దుకాణం అద్దెకు తీసుకుని అన్ని రకాల వస్తువులు అమ్మే వ్యాపారులను నియంత్రించారు.
దీనివల్ల ఆర్టీసీకి సాలీనా రూ.కోటి అదనపు ఆదాయం సమకూరింది. కానీ, గతంలో ఆ జిల్లాలో పనిచేసి పదోన్నతిపై బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి ఆ టెండర్లు రద్దు చేయించారు. ఇందులో రూ.లక్షల్లో నిధులు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. ఇలాంటి అధికారులు దర్జాగా తిరుగుతున్నా పట్టించుకోకుండా రూ.5, రూ.10 చొప్పున గల్లంతయ్యాయన్న కారణంతో కండక్టర్లు, టిమ్ సర్వీసు డ్రైవర్లపై విరుచుకుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లేలా చేసి నిధులు స్వాహా చేసిన అధికారులపై చర్యలు తీసుకుని, ఆ తర్వాత చిల్లర గల్లంతు చేసే కండక్టర్ల విషయంలో చర్యలు తీసుకుంటే బాగుంటుందని కార్మికులు పేర్కొంటున్నారు.
గడువు తర్వాత అప్పీళ్లకు నో...
టికెట్ డబ్బులు గల్లంతు చేసిన కండక్టర్లు/డ్రైవర్లను ఉద్యోగం నుంచి తొలగించిన పక్షంలో వారు అప్పీల్ చేసుకోవటానికి కేవలం రెండు నెలల గడువు ఉంటుంది. ఆ లోపే ఆ అప్పిల్‌పై తుది నిర్ణయం తీసుకోవాలి. కానీ గడువు దాటిన తర్వాత కూడా అప్పీళ్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సంబంధిత అధికారులపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇలాంటి కేసుల్లో కోర్టులు కూడా తప్పు పట్టిన విషయాన్ని యాజమాన్యం అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. అప్పీళ్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అందుకు పక్కా ఆధారాలు చూపాలని, అది కూడా గడువు లోపే ఉండాలని, అనవసరపు జాలి చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. అక్రమాలను అదుపు చేసే విషయంలో యాజమాన్యం తీరు సరైనదే అయినప్పటికీ భారీ అక్రమాలకు పాల్పడే అధికారులను రక్షిస్తూ కండక్టర్లపై చర్యలకు దిగటం ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది.
Advertisement
Advertisement