
మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
♦ 280 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం
♦ ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు
♦ రాష్ట్ర రవాణాశాఖామంత్రి మహేందర్‌రెడ్డి
చేవెళ్ల : తెలంగాణ రాష్ట్రంలోని 95 బస్ డిపోలలో వసతులను మెరుగుపరచడానికి, ఆధునికరించడానికి ప్రభుత్వం 32 కోట్ల రూపాయలను మంజూరు చేసిం దని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. కోటి రూపాయల వ్యయంతో చేవెళ్ల మండల కేంద్రంలోని బస్‌స్టేషన్ విస్తరణ పనులను టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని బస్‌డిపోలు, బస్‌స్టేషన్లలో ప్రయాణికులకు పూర్తిస్థాయి వసతులు కల్పించడానికి ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలోని పలు బస్‌డిపోలు, బస్‌స్టేషన్లను ఆధునీకరించడానికి, విస్తరించడానికి 11కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. వీటిలో సీసీరోడ్లు, టాయిలెట్లు, మంచినీరు, తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కొత్తగా 280 బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు.
వీటిలో 80 ఏసీ బస్సులు, 200 బస్సులు ఎక్స్‌ప్రెస్‌లని అన్నారు. తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి కృషిచేస్తున్నామన్నారు. ప్రతి బస్‌డిపోలో ఉత్తమ సేవలను అందించిన కండక్టర్, డ్రైవర్లకు ప్రోత్సాహక బహుమతులు, అవార్డులు అందజేస్తామన్నారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీకి పలు బస్సుల ద్వారా ఏడాదికి సుమారుగా 900 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందజేస్తామన్నారు. పల్లెవెలుగు బస్సు ల ద్వారా సంవత్సరానికి రూ. 550కోట్ల నష్టం, సిటీ సర్వీసుల ద్వారా 350 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నదన్నారు. ఈ నష్టంలో జీహెచ్‌ఎంసీ మాత్రం నెలకు 18 కోట్ల రూపాయల రీయింబర్స్‌మెంట్ ఆర్టీసీకి ఇస్తున్నదని చెప్పారు.
కాగా ఎక్స్‌ప్రెస్, నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల ద్వారా మాత్రం కొంత ఆదాయం ఆర్టీసీకి వస్తున్నదన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ నగరానికి అతి చేరువగా ఉన్న చేవెళ్ల కేంద్రానికి సబర్బన్ బస్సులు నడపడానికి మంత్రి, ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలన్నారు. చేవెళ్ల బస్‌స్టేషన్‌ను మోడల్ బస్‌స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. బస్‌డిపోను దామరగిద్ద వద్ద కాకుండా చేవెళ్ల సమీపంలో నిర్మించడానికి అనుమతించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, ఈడీ నాగరాజు, ఆర్‌ఎం ఆర్.గంగాధర్, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ వెంకన్న, ట్రాఫిక్ మేనేర్ విజయభాను, పలు డిపోల మేనేజర్లు, ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, వైస్‌ఎంపీపీ పోలీస్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పద్మ, స్వరూప, సర్పంచ్ మధుసూదన్‌గుప్త, టీఆర్‌ఎస్ నాయకులు మాణిక్‌రెడ్డి, బర్కల రాంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, మాసన్నగారి మాణిక్‌రెడ్డి, వసంతం, యాదగిరి, రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.