అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటుండగా, ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు సర్వీసులు నడుపుతూ ప్రజలను దోచుకునే పనిలో పడ్డాయని ఆర్టీసీ ఉద్యోగులు విమర్శిచారు. మంగళవారం నగరంలోని అన్ని ప్రైవేటు ట్రావె ల్ ఏజెన్సీల కార్యాలయాల వద్ద వారు ఆందోళన నిర్వహించారు. ప్రైవేటు బస్సులు రోడ్డెక్కితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ప్రైవేటు బస్సుల యజమానులు తెలంగాణవాదులా లేక టీఆర్‌ఎస్ తొత్తులా అంటూ విమర్శించారు. సమైక్యాంధ్రకు జైకొడుతూనే ప్రయాణికులను రాత్రికి రాత్రి తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన నాయకులే కాసుల కోసం కక్కుర్తి పడడం ఆవేదనకు గురి చేస్తోందని వాపోయారు. తక్షణం బస్సులను షెడ్లకు పరిమితం చేసి ఉద్యమాలకు సహకరించాలని, లేని పక్షంలో జరగబోయే నష్టానికి వారే బాధ్యులవుతారని హెచ్చరించారు.
ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో దివాకర్ ట్రావెల్స్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారన్న సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని హింసాత్మక చర్యలు, బెదిరింపులకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించగా, ఆర్టీసీ సిబ్బంది అదే స్థాయిలో సమాధానమిచ్చారు.తమపై కేసులు పెడతామని బెదిరించడం ఎంత వరకు న్యాయమని సీఐ మాధవ్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆందోళన దృశ్యాలను ఎస్‌ఐ ధరణికిశోర్ తన కెమెరాలో బంధించారు.