
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సు ఇక స్మార్ట్‌గా మారనుంది. ఏ బస్సు ఎక్కడ ఉందో, ఎంత సేపట్లో బస్టాపునకు చేరుకుంటుందో తెలిపే సాంకేతిక పరిజ్ఞానం మన అరచేతుల్లో నిక్షిప్తం కానుంది. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(వీటీపీఐఎస్)తో సిటీ బస్సులను అనుసంధానించనున్నారు. బస్సుల రాకపోకల్లో వేగాన్ని, నాణ్యతను, పారదర్శకతను పెంచేం దుకు అనుగుణంగా రూపొందించిన ఈ పరిజ్ఞానాన్ని ఫ్రాన్స్ మనకు అందజేయనుంది.
ఈ మేరకు శనివారం బస్‌భవన్‌లో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ నేతృత్వంలోని ప్రతి నిధుల బృందంతో రవాణా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఎండీ రమణారావు ఫ్రాన్స్ బృందంతో సంప్రదింపులు జరిపారు. పూర్తిగా ఫ్రాన్స్ ఆర్థిక సాయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును వచ్చే 9 నెలల్లో 2 రూట్లలో మూడు దఫాలుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు.
ఈ ఫలితాలను బట్టి అన్ని రూట్లకు, అన్ని బస్సులకు జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను అనుసంధానం చేస్తారు. వీటీపీఐఎస్‌ను సమర్థంగా అమలు చేసేందుకు ప్రతి బస్సు ట్రాకింగ్‌ను ప్రయాణికులకు అందుబాటులో ఉంచేందుకు ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా రూపొందించనున్నారు. ఈ యాప్ ద్వారా బస్సు జాడ తెలుసుకున్న ప్రయాణికులు తమ రాకపోకల్లో అంతరాయాలను అధిగమించేందుకు అవకాశం లభించనుంది.
రెండు మార్గాల్లో ప్రయోగాత్మకం..
ఫ్రాన్స్‌కు చెందిన లుమిప్లాన్, ఇక్సి అనే సంస్థలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని ప్రజారవాణా వ్యవస్థ మొత్తాన్ని ఈ వీటీపీఐఎస్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. పారిస్‌లో తిరిగే రైళ్లు, బస్సులను ఈ పరిజ్ఞానంతో అనుసంధానించారు. ఈ సంస్థల సహకారంతోనే హైదరాబాద్‌లో వీటీపీఐఎస్ అమలు చేస్తారు. లుమి ప్లాన్, ఇక్సి సంస్థల ప్రతినిధులు గత నెలలోనే రెండు రూట్లను ఎంపిక చేశారు.
సికింద్రాబాద్ నుంచి వారాసిగూడ మీదుగా కోఠీ వరకు రాకపోకలు సాగించే 86 రూట్‌లో 17 బస్సులు, సికింద్రాబాద్ నుంచి అశోక్‌నగర్ మీదుగా నడిచే 40వ రూట్‌లో 22 బస్సులకు వచ్చే నెల నుంచి జీపీఎస్ ఆధారిత వీటీపీఐఎస్‌ను అమలు చేయనున్నారు. ఈ 2 మార్గాల్లోని బస్టాపులను జియోఫెన్సింగ్ చేశారు. రూట్ మ్యాప్‌లను సేకరించారు. టికెట్ ఇష్యూ మిషన్స్(టీమ్స్) సహాయంతో ట్రిప్పులు, సమయపాలన వివరాలు సేకరించారు. త్వరలో కొత్త టెక్నాలజీని అమలు చేయనున్నారు.
బస్‌భవన్‌లో కేంద్రీకృత వ్యవస్థ..
ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో తాజాగా ఒక కేంద్రీకృత వ్యవస్థను, సోలార్ పవర్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీంతో ఏ బస్సు ఎక్కడ ఉందో బస్‌భవన్ నుంచే పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టు దశలో 4 సోలార్ పవర్ డిస్‌ప్లేలను కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ఎంపిక చేసిన రెండు రూట్లలోని అన్ని బస్సులకు ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తారు.
ప్రజారవాణా బలోపేతం: మహేందర్‌రెడ్డి
ఫ్రాన్స్ అధికారులతో ఒప్పందంపై మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా పూర్తిగా ఫ్రాన్స్ ఆర్థిక, సాంకేతిక సహాయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు వల్ల నగరంలో ప్రజారవాణా వ్యవస్థ బలపడుతుందన్నారు. ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే అవకాశం లభించడం వల్ల ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎదురుచూపులు లేకుండా పయనిస్తారన్నారు.
టీఎస్‌ఆర్టీసీ ఇంటలెక్చువల్ ఐటీ సొల్యూషన్స్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ మాట్లాడుతూ.. రవాణా రంగంలో సమయం ఎంతో విలువైందని, ఈ విధానం అమలుతో ప్రయాణికులకు సకాలంలో ఆర్టీసీ సేవలు లభిస్తాయని చెప్పారు. ఆర్టీసీ సేవల విస్తరణ, కచ్చితమైన సమాచారం కోసం ఈ ప్రాజెక్టును ఎంపిక చేసినట్లు చైర్మెన్ సత్యనారాయణ తెలిపారు. సోలార్ డిస్‌ప్లే బోర్డుల వల్ల ప్రయాణికులను ఎప్పటికప్పుడు బస్సుల సమాచారం లభిస్తుందని ఎండీ రమణారావు తెలిపారు. ఈ సందర్భంగా బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన సోలార్ ఆధారిత ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే పనితీరును అధికారులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment