గుంటురు జిల్లా నారాకోడూరులో బైక్‌ను ఢీకొట్టిన సిటీ బస్సు
Published Fri, Aug 23 2013 4:26 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
చేబ్రోలు, తెనాలి రూరల్, న్యూస్‌లైన్: ఉదయాన్నే కళాశాలకు బయలుదేరిన ఇంజినీరింగ్ విద్యార్థుల పాలిట సిటీ బస్సు మృత్యుశకటమైంది. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. గుంటురు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు శివారులోని సీఎంఎస్ హాస్టల్ ఎదురుగా తెనాలి రోడ్డులో గురువారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన తోటి విద్యార్థులు, మృతుల కుటుంబ సభ్యులను కలచివేసింది.
పోలీసుల కథనం ప్రకారం..రణస్థలానికి చెందిన వి.భార్గవ్‌నాయుడు (18) గుంటూరు కొత్తపేటకు చెందిన ఎన్.గోపీకృష్ణ(18), శీలం శెట్టి శివరామకృష్ణ(18), అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన తేజ్‌బాషా(18) వడ్లమూడి విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో కొద్ది రోజులుగా కళాశాలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికి హాజరుకావడానికి గోపీకృష్ణ, శివరామకృష్ణ, భార్గవ్, బాషా కలిసి ఒకే ద్విచక్రవాహనంపై కళాశాలకు బయలుదేరారు.
నారాకోడూరు తెనాలి రోడ్డులోని సీఎంఎస్ హాస్టల్ వద్ద ఎదురుగా వస్తున్న సిటీ బస్సు వీరిని ఢీ కొట్టింది. ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరిని తెనాలి వైద్యశాలకు తరలిస్తుండగా మరణించారు. మృతదేహాలకు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం చేపట్టి బంధువులకు అప్పగించారు. ప్రమాద విషయం తెలుసుకున్న విజ్ఞాన్ విద్యార్థులు తెనాలి రోడ్డులో గురువారం మధ్యాహ్నం కొద్ది సేపు రాస్తారోకో నిర్వహించారు. ప్రమాదంలో మరణించిన జిల్లాకు చెందిన భార్గవ్ తండ్రి రెవెన్యూ శాఖలో తహశీల్దార్ స్థాయిలో విజయనగరంలో పని చేస్తున్నారు.
Advertisement