
ఆర్టీసీకి ‘మెట్రో’ బ్రేక్
గ్రేటర్‌లో రోజుకు 3000 ట్రిప్పుల రద్దు
మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ రద్దీయే కారణం
రోజుకు 1.5 లక్షల ప్రయాణికులపై ప్రభావం
సిటీబ్యూరో: సికింద్రాబాద్ నుంచి సనత్‌నగర్‌కు సిటీ బస్సుకు నిర్ణయించిన రన్నింగ్ టైమ్ 35 నిమిషాలు. కానీ ఇప్పుడు గంట దాటినా గమ్యానికి చేరుకోవడంలేదు. అన్ని చోట్లా అదే పరిస్థితి. కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, వేవ్‌రాక్, కొండాపూర్, బోరబండ, మాదాపూర్, లింగంపల్లి, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, మెహదీపట్నం, చార్మినార్, తదితర మార్గాల్లో నడిచే సిటీ బస్సులు ట్రాఫిక్ రద్దీ కారణంగా నత్తనడక నడుస్తున్నాయి. బస్సులకు కేటాయించిన రన్నింగ్ టైమ్ ట్రాఫిక్‌లోనే హరించుకు పోతోంది. దీంతో గ్రేటర్‌లోని 28 డిపోల పరిధిలో ప్రతి రోజు 3000కు పైగా ట్రిప్పులు రద్దవుతున్నాయి. 1.5 లక్షల మంది ప్రయాణ సదుపాయాన్ని కోల్పోతున్నారు. బేగంపేట్, జేబీఎస్, సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్డి, కోఠి, మలక్‌పేట్, తదితర మార్గాల్లో జరుగుతున్న మెట్రో పనులు, ట్రాఫిక్ రద్దీ ట్రిప్పుల రద్దుకు కారణమవుతున్నాయి.
ఆర్టీసీకి భారీ నష్టం..
బేగంపేట్‌లో చేపట్టిన మెట్రో పనుల వల్ల సికింద్రాబాద్-అమీర్‌పేట్ మార్గంలో 500 బస్సులను రద్దు చేశారు. తిరుగుతున్నవాటిలో ఏ ఒక్కటీ నిర్ణీత వేళకు గమ్యం చేరడం లేదు. ఈ ఒక్క రూట్‌లోనే వేలాది మంది ప్రయాణికులు సకాలంలో బస్సులు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం సైతం భారీగా ృధా అవుతోంది. ఒక లీటర్ డీజిల్ వినియోగానికి కనీసం 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన బస్సులు.. మూడు కిలోమీటర్ల కంటే ముందుకు వెళ్లడం లేదు. నగర శివారు ప్రాంతాలు మినహాయించి మిగతా అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి. ట్రిప్పుల రద్దుతో ప్రయాణికుల ఆక్యుపెన్సీ సైతం పడిపోతుంది. ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. రూ. 354.75 కోట్ల న ష్టాల్లో ఉన్న గ్రేటర్ ఆర్టీసీకి ఇది పెను ముప్పుగా మారింది.
ఇబ్బందులు ఇలా..
జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద చేపట్టిన మెట్రో పనులతో సికింద్రాబాద్ నుంచి బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, మేడ్చెల్, సుచిత్ర, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిర్ధారించిన రన్నింగ్ టైమ్‌కు చేరుకోక పోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి బోయిన్‌పల్లికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవ్సాలిన బస్సులు 40 నిమిషాలు దాటినా చేరుకోవడం లేదు.
సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద చేపట్టిన మెట్రో పనుల వల్ల సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ మీదుగా కోఠి, నాంపల్లి, ఆఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు బ్రేకులు పడుతున్నాయి. మలక్‌పేట్, కోఠిలో జరుగుతున్న పనులతో దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ నుంచి మెహిదీపట్నం, పటాన్ చెరు వైపు బస్సుల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంటుంది.
భారీగా ఇంధన వినియోగం..
3850 బస్సులకు ప్రతి రోజు 1.75 లక్షల ఇంధనం వినియోగమవుతోంది. గంటల తరబడి బస్సులు ట్రాఫిక్‌లో నిలిచిపోవడం వల్ల వేలకొద్దీ లీటర్ల డీజిల్ ృధా అవుతుంది. ఒక లీటర్ డీజిల్‌కు 4 నుంచి 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన బస్సులు 2 నుంచి 3 కిలోమీటర్లు దాటడం లేదు. ప్రతి రోజు 5 వేల నుంచి 10 వేల లీటర్ల డీజిల్ దుర్వినియోగవుతున్నట్టు అంచనా.