సిటీ బస్సులో కాల్పులు | Gun Fire In City Bus | Sakshi
Sakshi News home page

సిటీ బస్సులో కాల్పులు

Published Fri, May 3 2019 3:13 AM | Last Updated on Fri, May 3 2019 8:04 AM

Gun Fire In City Bus - Sakshi

బస్సును పరిశీలిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో భద్రతా విధులు నిర్వర్తించే ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ విచక్షణ కోల్పోయాడు. సిటీ బస్సులో ఫుట్‌బోర్డుపై ప్రయాణించడమే కాకుండా లోపలకు జరగాలంటూ కోరిన సహచర ప్రయాణికుడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో అనాలోచితంగా తన సర్వీస్‌ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. రంగంలోకి దిగిన హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు సమాచారం అందించారు.

విచక్షణ కోల్పోయి...
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన శ్రీనివాస్‌ నాయుడు (59) ఆ జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా డెప్యుటేషన్‌పై ఏపీ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో (ఏపీ ఐఎస్‌డబ్ల్యూ) విధులు నిర్విర్తిస్తున్నాడు. ఏపీకి చెందిన ప్రముఖులకు, రాజకీయ/కీలక కార్యాలయాలకు ఈ విభాగం భద్రత కల్పిస్తుంటుంది. ఏడాదిగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వద్ద విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలసి కూకట్‌పల్లిలో ఉంటున్నారు. గురువారం ఉదయం విధులకు హాజరైన శ్రీనివాస్‌... తన జీతం డబ్బు డ్రా చేసుకోవడానికి 10.30 గంటలకు పంజాగుట్టలో ఉన్న ఆంధ్రా బ్యాంక్‌కు వెళ్లారు. అక్కడ పని ముగించుకొని తిరిగి విధులకు వెళ్లేందుకు పంజాగుట్ట హిమాలయ బుక్‌హౌస్‌ వద్ద ఉన్న బస్టాప్‌లో కంటోన్మెంట్‌ డిపోకు చెందిన 47సీ (సికింద్రాబాద్‌ నుంచి మణికొండ) రూట్‌ నంబర్‌ బస్సు ఎక్కారు. అయితే ఆయన బస్సు ఫుట్‌బోర్డుపైనే నిలబడి ఉండటంతో మరో స్టాప్‌ వద్ద ఓ చానల్‌ కెమెరామెన్‌ బస్సు ఎక్కుతూ శ్రీనివాస్‌ను లోపలకు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో శ్రీనివాస్‌ ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి తన నడుముకు ఉన్న .9 ఎంఎం సర్వీస్‌ పిస్టల్‌ తీసి పైకి గురిపెట్టి బెదిరింపు ధోరణిలో ట్రిగ్గర్‌ నొక్కారు. అప్పటికే ఆ ఆయుధం కాగ్‌ (తూటా పేలేందుకు సిద్ధమై ఉండటం) అయి ఉండటంతో ట్రిగ్గర్‌ నొక్కగానే పెద్ద శబ్దం చేస్తూ టాప్‌లో నుంచి దూసుకుపోయింది. అయితే బస్సు టైరు పేలిందేమోనని డ్రైవర్‌ బస్సును పక్కకు ఆపగా శ్రీనివాస్‌ వెంటనే బస్సు దిగి పంజాగుట్ట చౌరస్తా వైపు పరిగెత్తారు. బస్సులో వచ్చిన శబ్దంపై సహచర ప్రయాణికుల్ని ఆరా తీయగా ఓ వ్యక్తి కాల్పులు జరిపారని, బస్సు టాప్‌లోంచి తూటా దూసుకుపోయిందని వారు చూపించారు. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ దుస్తులు వేసుకొని పోలీస్‌లా ఉన్నారని తెలిపారు. దీంతో డ్రైవర్, కండక్టర్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు మణికొండ వరకు వెళ్లి ప్రయాణికుల్ని గమ్యస్థానానికి చేర్చి తిరిగి డిపోకు చేరుకున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైంది.


బస్సు పైకప్పులోకి దూసుకెళ్లిన బుల్లెట్‌, బస్సు దిగి పరిగెడుతున్న శ్రీనివాస్‌ 

సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు...
ఈ ఘటనపై దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు కండక్టర్, డ్రైవర్‌తోపాటు సదరు చానల్‌ కెమెరామెన్‌ను కూడా విచారించారు. కాల్పులు జరిపింది పోలీసు విభాగానికి చెందిన వ్యక్తిగా అనుమానించారు. హిందూ శ్మసాన వాటిక వద్ద బస్సు దిగిన ఆ వ్యక్తి తిరిగి వెనక్కి వచ్చినట్లు తేలడంతో ఆ మార్గంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో రికార్డు అయిన అనుమానితుడి ఫీడ్‌ నుంచి ఫొటోలు సంగ్రహించారు. వాటి ఆధారంగా అతడిని ఏపీ ఐఎస్‌డబ్ల్యూకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌ నుంచి సర్వీస్‌ పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌ డిసెంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఈలోగా ఇలా కేసులో చిక్కుకోవడం గమనార్హం. కాగా,  ఈ ఘటనపై ఆరా తీసిన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకుర్‌ జనాల మధ్య శ్రీనివాస్‌ కాల్పులు జరపడం చట్టారీత్యా తీవ్ర నేరంగా అభివర్ణించారు. నిందితుడిపై శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement