
బొమ్మనహళ్లి (బెంగళూరు): బెంగళూరు సిటీ బస్సులో ప్రయాణిస్తున్న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు ప్రయాణికుల ముందే కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోనప్పన అగ్రహారలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు ప్రొద్దుటూరుకు చెందిన సురేష్ (30) బుధవారం ఉదయం నగర సమీపంలోని ఆనేకల్ పట్టణం నుంచి బెంగళూరుకు వస్తున్న సిటీ బస్సులో ఎక్కాడు. మార్గమధ్యంలో దుండగులు బస్సును మరో వాహనంతో చేజింగ్ చేస్తూ వచ్చి కోనప్పన అగ్రహార సమీపంలో సిటీ బస్సులోకి ఎక్కారు. బస్సులో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నా లెక్క చేయకుండా దుండగులు కత్తులు, కొడవళ్లతో సురేష్‌ను నరికారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత బస్సు నుంచి పరారీ అయ్యారు.
బస్సులో కలకలం రేగడంతో డ్రైవర్ బస్సును నిలిపాడు. ఈ రక్తపాతంతో ప్రయాణికులు కేకలు వేసుకుంటూ తలోదిక్కు పరుగులు పెట్టారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment