బస్సు..జీపీఎస్సు
మనం ప్రయాణిస్తున్న సిటీ బస్సు గంటకు కిలోమీటరు దూరమైనా వెళ్లకపోవడం... ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడడం... ఆఫీసుకో... ఇంటికో... ఆలస్యంగా చేరుకోవడం... ట్రాఫిక్ పోలీసులను నిందించడం... నిత్యం నగరంలో ఎదురవుతున్న సమస్యే. ఈ సమస్య నుంచి బయట పడేందుకు అధికారులు యోచిస్తున్నారు. సిటీ బస్సు సాయంతోనే దీన్ని అధిగమించేందుకు యత్నిస్తున్నారు.
- ‘సిటీబస్సు’తో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ
- కంట్రోల్ రూమ్‌తో ఆర్టీసీ జీపీఎస్ అనుసంధానం
- వాహన కదలికల ఆధారంగా గుర్తింపు
- ప్రత్యేక కార్యాచరణకు ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధం
సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సు ఇక ట్రాఫిక్ పోలీసు అవతారమెత్తనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వాహనాల రద్దీ నియంత్రణకు దిక్సూచిగా మారనుంది. బస్సు వేగం, కదలికల ఆధారంగా రోడ్లపై వాహనాల రద్దీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకొనేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. నగరంలో ప్రస్తుతం మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఓల్వో బస్సులను ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లోని జీపీఎస్‌తో అనుంధానించిన సంగతి తెలిసిందే. వీటిలో ఏర్పాటు చేసిన వెహికల్ మానిటరింగ్ యూనిట్స్ ఆధారంగా బస్సు కదలికలు నమోదవుతాయి.
బస్సు ఎంత వేగంతో వెళుతోందో ఇట్టే తెలిసిపోతుంది. ఒకే సారి నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లోనూ జీపీఎస్ ఆధారిత బస్సుల కదలికలను బట్టి ట్రాఫిక్ రద్దీ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. రద్దీ తీవ్రంగా ఉంటే నివారించేందుకు... అవ సరమైన చోట వాహనాలను దారి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటారు. దీని కోసం ఆర్టీసీ రూపొందించిన జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలో పోలీస్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేయనున్నారు. కొన్ని ప్రైవేట్ క్యాబ్ సంస్థలు, ట్యాక్సీలు జీపీఎస్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ వాటి కదలికల ఆధారంగా ట్రాఫిక్ రద్దీని తె లుసుకోవడం సాధ్యం కాదని అధికారులు గుర్తించారు.
ఆర్టీసీ జీపీఎస్‌లో మాత్రమే ప్రతి 10 సెకన్లకు బస్సు వేగాన్ని తెలుసుకునే పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దీనివల్ల వాహనాల రద్దీ తీవ్రతను కచ్చితంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులకు మాత్రమే పరిమితమైన జీపీఎస్‌ను దశల వారీగా ఆర్డినరీ సర్వీసులకు విస్తరించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. దీంతో పోలీసులు మరింత సమర్ధంగా ట్రాఫిక్ నియత్రణ చర్యలు తీసుకోగలుగుతారని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
రద్దీ రూట్లపై ప్రత్యేక శ్రద్ధ
రోజు రోజుకూ వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం గ్రేటర్‌లో 43 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా రహదారులు విస్తరించకపోవడం... మరోవైపు మెట్రో పనులతో అనేక మార్గాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఇరుకు రోడ్లతో వాహనాల సగటు వేగం దారుణంగా పడిపోయింది. కనీసం గంటకు 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వెళ్లవలసిన వాహనాలు పట్టుమని 10 కిలోమీటర్లు దాటడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణం మరింత నరకప్రాయంగా మారింది. రద్దీ తీవ్రంగా ఉన్న సమయాల్లో సిటీబస్సుల వేగం మరింత పడిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు వీటి వేగాన్ని, కదలికలను ప్రామాణికంగా తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్-తార్నాక-సికింద్రాబాద్, లకిడికాఫూల్-అమీర్‌పేట్-కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్-దిల్‌సుఖ్‌నగర్-కోఠి వంటి మార్గాల్లో ఆర్టీసీ వినియోగిస్తున్న జీపీఎస్ ఆధారంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.