ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
సైబరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ పోలీసుల సూచన
ట్రాఫిక్ రద్దీ నియంత్రణపై వివిధ సంస్థలతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు.. ఇలా ఎన్ని నిర్మించినా హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గడం లేదు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. చినుకు పడితే చాలు కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. దీంతో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ ఐటీ కంపెనీలు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గచ్చిబౌలిలోని ఫీనిక్స్ ఇన్ఫోసిటీలో సమావేశమయ్యారు.
ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతోపాటు నిర్వహణ వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. ఢిల్లీలో అమలవుతున్న కార్ పూలింగ్ విధానాన్ని ఐటీ కారిడార్ పరిధిలోనూ అమలు చేయడాన్ని ఐటీ సంస్థలు పరిశీలించాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ సూచించారు. ఈ విధానంతో వాహనాల రద్దీ, కాలుష్యం తగ్గడంతోపాటు ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగులందరికీ ఒకే పనివేళలు కాకుండా వేర్వేరు సమయాలను కేటాయించాలన్నారు. దీనివల్ల కూడా వాహనాల రద్దీ గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ రమేష్ కాజా తదితరులు పాల్గొన్నారు.
కార్ పూలింగ్ అంటే?
ఒకే ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు ఒక్కో వాహనంలో వచ్చే బదులు నలుగురు చొప్పున కలిసి ఒకే కారులో ఆఫీసుకు రావడాన్ని కార్ పూలింగ్ అంటారు. ఈ విధానంలో ఒకరోజు ఒక ఉద్యోగి కారు తీసుకొస్తే ఆ మరుసటి రోజు మరో ఉద్యోగి కారులో ప్రయాణిస్తారు. దీంతో ప్రతిరోజూ ఒకే సమయంలో, ఒకే రహదారిలో నాలుగు కార్లు రోడ్లపైకి రాకుండా ఒకే కారులో నలుగురు ఉద్యోగులు ఆఫీసుకు చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment