గ్రేట్ రిలీఫ్!
► మలక్‌పేట వద్ద ‘మూడో మార్గానికి’ మార్గం సుగమం
► రైల్వే అండర్ పాస్‌కు సన్నాహాలు
► రూ.10 కోట్లు డిపాజిట్ చేసేందుకు
► మెట్రోరైల్ సంస్థ అంగీకారం వారంలో క్షేత్రస్థాయి సర్వే
► ఈ రూట్లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: మలక్‌పేట రైలు వంతెన సమీపంలో వాహనాల కోసం మరో అండర్ పాస్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఉన్న రెండింటికి తోడు మరోటి ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ అంగీకరించింది. ఇందుకు అవసరమైన ఖర్చు భరించడానికి హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్) ముందుకు వచ్చింది. పనులు ప్రారంభించడానికి ముందే రూ.10 కోట్లు రైల్వే శాఖ దగ్గర డిపాజిట్ చేయడానికీ అంగీకరించింది. గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో బల్దియా నేతృత్వంలో జరిగిన వివిధ శాఖల ఉమ్మడి కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందుల్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు మూడో మార్గం కావాలంటూ ఈ ఏడాది జనవరిలోనే ప్రతిపాదనలు పంపారు.
అత్యంత కీలక రహదారుల్లో ఒకటి...
నగరంలోని అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్‌సుఖ్‌నగర్-చాదర్‌ఘాట్ మధ్యలోనిది ప్రధానమైంది. ఈ రూట్‌లో నగరానికి చెందిన అంతర్గత వాహనాలే కాకుండా విజయవాడ వైపు వేళ్లేవీ నడుస్తుంటాయి. ఫలితంగా దాదాపు 24 గంటలూ ఈ మార్గం రద్దీగానే ఉంటుంది. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కన ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్ ఈ రూట్‌లో తిరిగే వాహనచోదకులకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చాదర్‌ఘాట్ వైపు మెట్రో రైల్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీని ప్రభావంతో రద్దీ వేళల్లో చాదర్‌ఘాట్ కాజ్ వే వరకు వాహనాలుబారులు తీరుతున్నాయి. ఈ మార్గాన్ని అనుసరించాలంటేనే వాహనచోదకులు హడలిపోతున్నారు.
‘మెట్రో’ వస్తే మరింత ఘోరం...
మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న రైలు వంతెన అటు-ఇటు ఉన్న రహదారి కంటే ఇరుకుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సర్వకాలసర్వావస్థల్లోనూ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పట్లేదు. ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండుగల సీజన్‌లో... ప్రధానంగా రాత్రి వేళ ఈ ప్రాంతంలో మరింత నరకం చవిచూడాల్సిందే. ఇప్పటికే ఉన్న ఈ ఇబ్బందులకు తోడు మెట్రోరైల్ ప్రారంభమైతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ రైల్ వంతెనకు సమీపంలోనే మెట్రో రైల్‌స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. అది కూడా పూర్తైఅందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు రెట్టింపు అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ వివరాలన్నింటినీ పొందుపరుస్తూ జనవరిలో జరిగిన సమావేశంలో రైల్వే శాఖకు ప్రతిపాదనలు ఇచ్చారు.
ఇప్పటికే రెండు చోట్ల నిర్మాణం...
ఇప్పటికే నగరంలోని రెండుచోట్ల రైల్ అండర్ పాస్‌లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్ నిలయం, కాలాడేరా ప్రాంతంలో చేపట్టిన ఈ చర్యలతో చెప్పుకోదగ్గ ఊరట లభించింది. ఇలానే మలక్‌పేట రైల్ వంతెన వద్ద మూడో మార్గం ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ అధికారులు కోరారు.
తర్వాతి దశలో మూసీపై వంతెన
మలక్‌పేటలో మూడో అండర్ పాస్ ఏర్పాటుకు రూ.10 కోట్లు ఖర్చవుతాయని రైల్వే శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మొత్తం చెల్లించేందుకు హెచ్‌ఎంఆర్ ముందుకు రావడంతో రైల్వే అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. వారం రోజుల్లో అన్ని విభాగాల అధికారులతో ఉన్న ఉమ్మడి కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేపడతాం. వీలైనంత త్వరలో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ అండర్ పాస్ నిర్మాణం పూర్తయిన తర్వాత మలక్‌పేట వైపు మూసీపై ఉన్న వంతెన విస్తరణ అంశానికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందిస్తాం’. - ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ