HMR
-
హైదరాబాద్ మెట్రో.. ఊపిరి పీల్చుకో..
లాభాల బాట పట్టడమే తరువాయి అనే తరుణంలో కోవిడ్ రూపంలో ఆపద వచ్చి పడింది హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకి. గత రెండేళ్లుగా విడతల వారీగా వచ్చి పడుతున్న కరోనా వేవ్స్ ఈ భారీ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోజువారీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో అప్పుల కుప్పగా మారిపోయింది మెట్రో. కాగా తాజా గణాంకాలు హైదరాబాద్ మెట్రో కోలుకుంటుందనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ఇటీవల ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీనికి తగ్గట్టుగానే నగరంలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. క్రమంగా ఆఫీసులు పూర్వ స్థితికి వస్తున్నాయి. విద్యాలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీనికి తగ్గట్టుగానే మెట్రో ఎక్కుతున్న ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్‌తో 2022 జనవరిలో రోజువారీ మెట్రో ప్రయాణికుల సంఖ్య 1.60 లక్షలకు పడిపోయింది. అయితే థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఫిబ్రవరి ఆరంభానికి ఈ సంఖ్య 1.80 లక్షలకు చేరుకుంది. ఈ నెల చివరి నాటికి రోజువారీ ప్రయాణికుల సంఖ్య 2 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది హైదరాబాద్ మెట్రో. ఇదే జోరు కొనసాగితే మే నాటికి కోవిడ్ పూర్వ స్థితికి మెట్రో చేరుకుంటుందని, దీంతో క్రమంగా నిర్వాహణ నష్టాలు తగ్గుతాయని ఆ సంస్థ అంచనా వేస్తోంది. కరోనాకి ముందు 2020 ఫిబ్రవరిలో మెట్రో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.75 లక్షలుగా ఉండేది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులు, ఐటీ ప్రొఫెషనల్స్ ఈ సర్వీసులను ఎక్కువగా ఉపయోగించేవారు. వరుసగా వచ్చి పడ్డ కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో మెట్రో రైడర్‌షిప్ సంఖ్య దారుణంగా పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ 2021 డిసెంబరు నాటికి డైలీ రైడర్‌షిప్ సంఖ్య 2.40 లక్షలకు చేరువ అవుతుండగా థర్డ్ వేవ్ వచ్చి పడింది. కరోనా ఎఫెక్ట్‌తో ఇన్నాళ్లు ఉద్యోగస్తులు ఇళ్లకే పరిమితం కావడంతో రోజువారీ మెట్రో ప్రయాణికుల సంఖ్య దారుణంగా పడిపోయింది. దీంతో గత రెండేళ్లుగా నిర్వాహన నష్టాలు పెరిగాయి. చివరకు బాండ్ల ద్వారా రుణాలు సేకరించాలని మెట్రో నిర్ణయించింది. ఈ క్రమంలో తిరిగి ప్రయాణికులు మెట్రో వైపు చూస్తుండటం ఆ సంస్థకు కొత్త ఊపిరి అందిస్తోంది. -
ఆర్థిక ఇబ్బందుల్లో హైదరాబాద్ మెట్రో.. గట్టెక్కెందుకు కొత్త ప్లాన్
మెట్రో రైలు ప్రాజెక్టుకు అడ్డంకిగా మారిన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ నడుం బిగించింది. మార్కెట్ నుంచి భారీ ఎత్తున నిధుల సేకరణ రెడీ అయ్యింది. వరుస నష్టాలు ఎల్ అండ్ టీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి హైదరాబాద్ మెట్రో రైలు గాడిన పడే సమయంలో కరోనా సంక్షోభం ఎదురైంది. ఏడాదిన్నరగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో పాటు కమర్షియల్ స్పేస్ నుంచి ఆశించిన ఆదాయం రావడం లేదు. రోజురోజుకు నష్టాల భారం పెరిగి పోయి చివరకు నిర్వహాణ భారంగా మారే పరిస్థితి వచ్చింది. దెబ్బ మీద దెబ్బ హైదరాబాద్ మెట్రోని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలంటూ ఇప్పటే పలు మార్లు ప్రభుత్వాలను కోరింది ఎల్ అండ్ టీ. మరోవైపు బ్యాంకుల నుంచి సాఫ్ట్‌లోన్ కోసం కూడా ప్రయత్నాలు చేసింది. అక్కడ జాప్యం అవుతుండటం మరోవైపు కోవిడ్ నిబంధనలు, వర్క్ ఫ్రం హోం, ఓమిక్రాన్ వేరియంట్ ఇలా అనేక అంశాల కారణంగా ఆశించిన స్థాయిలో మెట్రో ఆదాయం పెరగడం లేదు. దీంతో ఆర్థిక పరిపుష్టి కోసం ఎల్ అండ్ టీ సంస్థ మార్కెట్‌కు వెళ్లాలని నిర్ణయించింది. రూ. 13,600 కోట్లు మార్కెట్లో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ చేయడం ద్వారా రూ. 8,600 కోట్లు కమర్షియల్ పేపర్ల ద్వారా మరో రూ.5,000 కోట్లు మొత్తంగా రూ. 13,600 కోట్ల నిధులు సమీకరించాలని ఎల్ అండ్ టీ మెట్రో నిర్ణయించినట్టు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు కమర్షియల్ పేపర్ ద్వారా సేకరించే నిధులకు వన్ ఇయర్ మెచ్యూరిగా టైంగా ఉండగా వడ్డీ 5 నుంచి 5.30 శాతం వరకు ఉండవచ్చని అంచనా. ఇక నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ విషయంలో మెచ్యూరిటీ సమయం ఐదేళ్లు ఉండగా వడ్డీ రేటు 6.30 శాతం నుంచి 6.60 శాతం వరకు ఉండవచ్చని అంచనా. క్రిసిల్ రేటింగ్.. ఎస్బీఐ క్యాపిటల్ ప్రముఖ రేటింగ్ సంస్థ అంచనాల ప్రకారం హైదరాబాద్ మెట్రో సంస్థకి ట్రిపుల్ ఏ (సీఈ) ఉంది. కాబట్టి మార్కెట్ నుంచి కన్వర్టబుల్ డిబెంచర్స్, కమర్షియల్ పేపర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ సులువుగానే జరుగుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ ద్వారా డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు జారీ కానున్నట్టు సమాచారం. నష్టం రూ.1,767 కోట్లు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్)ని డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్దతిన ఎల్ అండ్ టీ నిర్మించింది. 35 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు సర్వ హక్కులు ప్రభుత్వానికి దాఖలు పడతాయి. ప్రస్తుతం మూడు కారిడార్లలో 69.2 కిలోమీటర్ల మేర హెచ్ఎంఆర్ విస్తరించి ఉంది. ప్రస్తుతం మెట్రో రైలుకి రూ.1.767 కోట్ల నష్టాల్లో ఉంది. ఇందులో రూ.382 కోట్ల నష్ట గతేడాది కాలంలో వచ్చింది. చదవండి: ఒమిక్రాన్ భయం.. మెట్రోకు దూరం దూరం! -
ఢిల్లీ తరహాలో ఎయిర్పోర్ట్ వరకు హైదరాబాద్ ‘మెట్రో’
దేశ రాజధాని న్యూఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లో మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మెట్రో రైలులో వేగంగా ఎయిర్‌పోర్టుని చేరుకునేలా సరికొత్త ప్రాజెక్టుకు రూపు ఇస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రోరైల్ ప్రాజెక్టును రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించేందుకు అక్షరాలా రూ.4 వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. రాయదుర్గం నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా మీదుగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 31 కి.మీ మేర ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. దీంతో రాయదుర్గం నుంచి కేవలం 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలవుతుంది. ఈ మెట్రో కారిడార్ ఏర్పాటుతో గ్రేటర్ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల అవస్థలు తప్పనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్ల నుంచి విమానాశ్రయానికి కనెక్టివిటీ లేదు. రాయదుర్గం నుంచి రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతున్న విషయం విదితమే. 5 కి.మీకి ఒక స్టేషన్! విమానాశ్రయ మార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లను ఔటర్‌రింగ్‌రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పాజంక్షన్, కిస్మత్పూర్, గండిగూడా చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా మట్టి నాణ్యత పరీక్షలు చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. త్వరలో స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టతరానుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నిధుల అన్వేషణలో ఎస్పీవీ యంత్రాంగం.. రాయదుర్గం–శంషాబాద్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ ఏర్పాటుకు వీలుగా స్పెషల్ పర్పస్ వెహికిల్ (ప్రత్యేకయంత్రాంగం)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ యంత్రాంగంలో హైదరాబాద్ మెట్రోరైలు, టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ విభాగాలున్నాయి. ప్రస్తుతం ఈవిభాగాల ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. గతేడాది బడ్జెట్లో సుమారు రూ.వెయ్యి కోట్లను హెచ్ఎంఆర్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో ప్రాజెక్టును మొదలుపెడతారా..లేక ఇతర మార్గాల్లో రుణ సేకరణ ద్వారా ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని సమకూర్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. కాగా ప్రస్తుతం నగరంలో ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం రూట్లలో 69.1 కి.మీ మేర మెట్రో రైలు సదుపాయం అందుబాటులో ఉంది. చదవండి:కూకట్పల్లి టూ కోకాపేట్.. త్వరలో లైట్ రైల్ ? -
కూకట్పల్లి టూ కోకాపేట్.. త్వరలో లైట్ రైల్ ?
ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా మరో కొత్త ప్రాజెక్టును హైదరాబాద్‌లో చేపట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇప్పటికే నగరంలో ఉన్న మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్), హైదరాబాద్ మెట్రోరైల్ (హెచ్ఎంఆర్)లకు తోడుగా లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎల్ఆర్టీఎస్)ను తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. నగరంలో గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ఏరియాల్లో అనేక బహుళజాతి కంపెనీలు ఇప్పటికే కొలువై ఉన్నాయి. మరిన్ని కంపెనీలు ఈ ఏరియాలో రాబోతున్నాయి. లక్షల మంది ఉద్యోగులు నిత్యం ఇక్కడ పని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరంతా ఆఫీసులకు వచ్చి పోయేందుకు ఇబ్బంది రాకుండా ఉండాలనే ప్రస్తుతం ఉన్న రవాణ వ్యవస్థకు అదనంగా మరొకటి తేవాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అతి పెద్ద హౌజింగ్ బోర్డుల్లో ఒకటిగా ఉన్న కూకట్పల్లి నుంచి కోకాపేట వరకు లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్‌పోర్ట్ అథారిటీ (హెచ్‌యూఎంటీఏ)లు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రెడీ చేస్తున్నట్టు సమాచారం. హెచ్‌యేఎంటీఏలో హెచ్ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌లు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం కూకట్పల్లి హౌజింగ్ బోర్డు నుంచి కోకాపేట వరకు మొత్తం 24.50 కిలోమీటర్ల మేర ఎల్‌ఆర్‌టీఎస్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ మార్గం వల్ల ఒకేసారి కేపీహెచ్‌బీ, రాయదుర్గం మెట్రోస్టేషన్లు, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ అనుసంధానం అయ్యే అవకాశం ఉంది. నార్సింగి దగ్గర మెట్రో ఫేట్ 2 లైన్ సైతం టచ్ అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు. -
దశల వారీగా మెట్రో జర్నీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈనెల 7 నుంచి మెట్రో రైళ్లను దశలవారీగా తిరిగి ప్రారంభించనున్న నేపథ్యంలో అమలు చేయాల్సిన మార్గదర్శకాలను, రైళ్ల రాకపోకల షెడ్యూల్‌ను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం వెల్లడించింది. గురువారం రసూల్‌పురాలోని మెట్రోరైల్ భవన్లో నిర్వహించిన సుదీర్ఘ సమావేశం అనంతరం హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తాజా మార్గదర్శకాలను ప్రకటించారు. దశలవారీగా హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల రాకపోకలను పెంచనున్నామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ఐదు స్టేషన్లలో మెట్రో రైళ్లు నిలపబోమని స్పష్టంచేశారు. నగరంలోని గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ స్టేషన్లలో మెట్రో రైలు ఆగదని.. ప్రయాణికులను స్టేషన్లలోకి అనుమతించబోరని వెల్లడించారు. సమావేశంలో ఎల్అండ్టీ మెట్రో రైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనిల్‌కుమార్ సైనీ, డీవీఎస్ రాజు, దాస్ తదితరులు పాల్గొన్నారు. మార్గదర్శకాలివే.. ► ప్రతి 5 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు రైళ్లను నడిపే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. ► స్టేషన్లు, బోగీల్లో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు ప్రత్యేకంగా వృత్తాకార మార్కింగ్‌లు అమర్చనున్నారు. బోగీల్లోనూ ప్రయాణికులు పక్కపక్క సీట్లలో కూర్చోకుండా ఏర్పాట్లు చేశారు. ► ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉందా లేదా అన్న విషయాన్ని సీసీటీవీలతో పాటు ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు. ► మాస్క్‌లేని ప్రయాణికులను స్టేషన్‌లోనికి అనుమతించబోరు. మాస్క్‌లు విక్రయించేందుకు స్టేషన్లలో ఏర్పాట్లు చేయనున్నారు. ► మార్గదర్శకాలను అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తారు. ► స్టేషన్లోకి ప్రవేశించే సమయంలోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ► ఆరోగ్య సేతు యాప్‌ని వినియోగించేలా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తారు. ► స్టేషన్‌లోనికి ప్రవేశించే ముందు శానిటైజర్ వినియోగించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ► భద్రత పరంగా మాక్‌డ్రిల్స్‌ను అవసరాన్ని బట్టి నిర్వహిస్తారు. ► మెట్రో సిబ్బందికి అవసరమైన మేర పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు సరఫరా చేస్తారు. ► స్మార్ట్‌మెట్రో కార్డ్, మొబైల్ క్యూఆర్ టికెట్లతో జర్నీ చేసేలా ప్రయాణికులను ప్రోత్సహించనున్నారు. ► ప్రయాణికులు స్వల్ప లగేజీ (మెటల్ కాకుండా)తో ప్రయాణించొచ్చు. శానిటైజర్ తెచ్చుకోవచ్చు. ► యథావిధిగా పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంటాయి. ► ఆరోగ్యశాఖ, పోలీసు శాఖ సౌజన్యంతో మెట్రో స్టేషన్లు, పరిసరాల్లో రద్దీని క్రమబద్ధీకరిస్తారు. ఫేజ్–1 ఈనెల 7 నుంచి ప్రారంభమయ్యే మియాపూర్–ఎల్బీనగర్ (కారిడార్–1) రూట్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో రైళ్లు నడపనున్నారు. ఫేజ్–2 ఈ నెల 8 నుంచి ప్రారంభమయ్యే నాగోల్–రాయదుర్గం రూట్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. తిరిగి సాయంత్రం 4 నుంచి 9 రాత్రి గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. ఫేజ్–3 ఈ నెల 9వ తేదీ నుంచి జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. అయితే మొత్తం మూడు రూట్లలోనూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. -
కొత్త రూట్లో మెట్రో కూత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు మరో కొత్త రూట్లో పరుగులు తీయడానికి సిద్ధమైంది. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో ఇది ప్రయాణికులకు అందుబా టులోకి రానుంది. 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు జేబీఎస్ వద్ద జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జెండా ఊపి ఈ మూడవ మెట్రో రైలు కారిడార్‌ను ప్రారంభిస్తారు. హైదరాబాద్ –సికింద్రాబాద్ జంటనగరాలను అనుసంధానించే ఈ మార్గాన్ని.. మెట్రో అధికారులు వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేశారు. తొలుత సంక్రాం తి నాటికి ప్రారంభించేందుకు ప్రయత్నించినా, మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైంది. ఈ మార్గం అందుబాటులోకి రానుండటంతో నగరంలో తొలి దశ మెట్రో ప్రాజెక్టు సంపూర్ణమైంది. ప్రస్తుతం ఎల్బీ నగర్–మియాపూర్ రూటులో 29 కి.మీ., నాగోలు– రాయదుర్గం రూటులో 29 కి.మీ. మేర మెట్రో మార్గం అందుబాటులో ఉంది. ఈ రూట్లలో నిత్యం 3.8 లక్షల నుంచి 4 లక్షల మంది రాకపోకలు సాగి స్తున్నారు. 7న ప్రారంభమయ్యే నూతన మార్గం తో కలిపి 3 కారిడార్ల పరిధిలో 69 కి.మీ. మేర నగరంలో మెట్రో రైలు అందుబాటులోకి వస్తుం ది. ఢిల్లీ తర్వాత అత్యంత నిడివి గల మెట్రో మార్గమున్న నగరంగా హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన మొదటి, అతి పెద్ద మెట్రో ప్రాజెక్టు మనదే కావడం విశేషం. పాతనగరానికి మరింత ఆలస్యం.. జేబీఎస్–ఎంజీబీఎస్.. ఈ రెండు బస్సుస్టేషన్లకు పొరుగు రాష్ట్రాలు, దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నగరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు ప్రయాణించేందుకు ఈ మెట్రో మార్గం వీలు కల్పిస్తుంది. కొత్త మార్గం లో 45 రోజుల పాటు మెట్రో రైళ్లకు 18 రకాల సామర్థ్య పరీక్షలు విజయవంతంగా నిర్వహిం చారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ ధ్రువీకరణ సైతం లభించింది. కాగా, ఈ మార్గాన్ని పాతనగరంలోని ఫలక్‌నుమా వరకు పొడిగించాలని తొలుత నిర్ణయించారు. సుల్తాన్‌బజార్‌లో ఆస్తుల సేకరణ, అలైన్మెం ట్ చిక్కులతో ప్రాజెక్టు ఆలస్యమైంది. ఆస్తులు కోల్పోయిన బాధితులకు మెరుగైన పరిహారం అందించడంతో పాటు వాణిజ్య కాంప్లెక్స్‌లో వారి వ్యాపార సముదాయాలకు చోటుకల్పించడంతో ఎట్టకేలకు మార్గం సుగమమైం ది. ఈ కారిడార్‌ను పాతనగరం వరకు విస్తరించే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ►3వ కారిడార్ స్వరూపం ►11 కి.మీ. జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గం నిడివి ►9 ఈ రూట్లో గల స్టేషన్లు ►18 ని‘‘ప్రయాణ సమయం ►1,00,000 రోజువారీ ప్రయాణికుల సంఖ్య (అంచనా) -
మా మంచి మెట్రో!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచవ్యాప్తంగా విశ్వనగరాలుగా ప్రసిద్ధి చెందిన లండన్, మెల్బోర్న్, మాంచెస్టర్, బోస్టన్ తదితర మహానగరాల కంటే మెరుగైన మెట్రో సేవలందిస్తూ ప్రయాణికులను సంతృప్తి పరుస్తోందని తేలింది. ప్రయాణికుల సంతృప్తి, భద్రత, సౌకర్యాల విషయంలో 98 శాతం మెరుగైన స్కోరు సాధించి ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్నట్లు మెట్రో ప్రాజెక్టు నిర్వహణ సంస్థ కియోలిస్ (ఫ్రాన్స్) సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. కియోలిస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో వివిధ రకాల ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. ఇందులో లండన్ ఆటోమెటిక్ మెట్రో, మెల్బోర్న్ ట్రామ్వే, బోస్టన్ కమ్యూటర్ ట్రెయిన్, స్టాక్‌హోమ్ సిటీ బసెస్, లయాన్ మెట్రో అండ్ బస్ సర్వీసెస్, మాంచెస్టర్ ట్రామ్వే తదితర ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. నగరంలో మూడు మార్గాల్లో పరుగులు తీయనున్న 57 మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోలు, ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ, టికెటింగ్, టికెట్ల విక్రయాలు, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ వ్యవస్థల నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టును కియోలిస్ సంస్థ 2012లో దక్కించుకున్న విషయం విదితమే. సర్వే సాగిందిలా.. ఈ సర్వేలో ప్రధానంగా మెట్రో సేవల పట్ల ప్రయాణికులు సంతృప్తి చెందుతున్నారా.. మెట్రో సిబ్బంది అందిస్తున్న సేవల పట్ల ఎలా ఫీలవుతున్నారు.. ప్రయాణికులకు మెట్రో స్టేషన్లలో సరైన సమాచారం అందుతుందా.. సిబ్బంది వారికి సహకరిస్తున్నారా.. మెట్రో ప్రయాణం సురక్షితమని ప్రయాణికులు భావిస్తున్నారా.. తాము చెల్లించిన డబ్బుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తున్నామని ప్రయాణికులు అనుకుంటున్నారా.. తదితర అంశాలపై సుమారు వెయ్యి మంది అభిప్రాయాలను కియోలిస్ సంస్థ పరిశీలించింది. ఈ ఏడాది 25 జూన్ నుంచి– జూలై 11 మధ్య కాలంలో సేకరించిన ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ఎల్బీనగర్– మియాపూర్ 1.14 లక్షల మంది.. ఎల్బీనగర్– మియాపూర్ మార్గం (29 కి.మీ)లో మంగళవారం రికార్డు స్థాయిలో ప్రయాణికులు మెట్రో ప్రయాణం చేశారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 10.30 వరకు మెట్రో రైళ్లు నిండుగా రాకపోకలు సాగించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఎల్బీనగర్– అమీర్‌పేట్ మార్గంలో ఏకంగా 69 వేల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించారని చెప్పారు. ఇక మియాపూర్– అమీర్‌పేట్ మార్గంలో 45 వేల మంది రాకపోకలు సాగించారన్నారు. నిత్యం ఈ మార్గంలో సుమారు లక్షమంది రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నామని చెప్పా రు. ఇక మంగళవారం నాగోల్– అమీర్‌పేట్ మార్గంలో 51 వేల మంది మెట్రో ప్రయాణం చేశారని తెలిపారు. -
ప్రభుత్వ ప్రాజెక్టుగా ‘మెట్రో’ రెండో విడత!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశను ప్రభుత్వ ప్రాజెక్టుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దశ ప్రాజెక్టు కింద నగర శివార్లలో తక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతాలను మెట్రో రైలుతో అనుసంధానం చేస్తుండటంతో భవిష్యత్తులో ఆదాయం రూపంలో పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని తేల్చింది. హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) తొలి దశ కింద నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు కారిడార్ల పరిధిలో ఇప్పటికే రవాణా సేవలు ప్రారంభించగా, ఆశించిన రీతిలో ప్రయాణికుల నుంచి స్పందన లేదు. నగరంలో ఆర్టీసీ బస్సుల ద్వారా సగటున రోజుకు 40 లక్షల మంది ప్రయాణిస్తుండగా, మెట్రో రైలును రోజుకు సగటున 70 వేల మందే వినియోగించుకుంటున్నారు. తొలి దశ ప్రాజెక్టుతో పోల్చితే రెండో దశ ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో జన సాంద్రత చాలా తక్కువగా ఉంది. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టులన్నీ నిర్వహణలో తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుల విషయంలోనూ ప్రైవేటు పెట్టుబడిదారులు ముందుకు రాలేదని ప్రభుత్వం గుర్తించింది. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వెళితే పెట్టుబడులు వచ్చే అవకాశం అంతంతేనని అంచనాకు వచ్చింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.9,378 కోట్లు ఈ క్రమంలో పూర్తిగా ప్రభుత్వ ప్రాజెక్టుగానే మెట్రో రెండో దశ ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులతో మెట్రో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పంపించింది. రెండో దశ ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.9,378 కోట్ల అంచనా వ్యయంతో మూడు మార్గాల్లో మొత్తం 62 కి.మీ. పొడవున మెట్రో రైలు నిర్మాణానికి అనుమతులు జారీ చేయాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమ యాజమాన్య ప్రాజెక్టు (ఈక్వల్ వోనర్షిప్ ప్రాజెక్టు)గా రెండో దశ చేపట్టాలని, కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడి వాటాలు పోగా మిగిలిన వ్యయ భాగాన్ని విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరిస్తామని పేర్కొంది. డీపీఆర్ రూపకల్పనకు రూ.50 కోట్ల నిధులు మెట్రో రైలు రెండో విడత సవివర పథక నివేదిక (డీపీఆర్) రూపకల్పన కోసం హెచ్ఎంఆర్కు రూ.50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండో దశ ప్రాజెక్టుకు డీపీఆర్ రూపకల్పన బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు సంస్థ (డీఎంఆర్‌సీఎల్)కు హెచ్ఎంఆర్ అప్పగించింది. తొలి దశ కింద ఇప్పటికే మూడు కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, రెండో దశ కింద నాలుగో కారిడార్‌గా గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు నుంచి శంషా బాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 30.7 కి.మీ. పొడవున ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదో కారిడార్‌లో బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ మీదుగా లక్డీకాపూల్ వరకు 26.2 కి.మీ. మెట్రో రైలు మార్గం ఏర్పాటు కానుంది. అదేవిధంగా తొలిదశలో మూడో కారిడార్ (నాగోల్–రాయ్‌దుర్గ్) విస్తరణలో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5.1 కి.మీ. మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. -
గ్రేట్ రిలీఫ్!
► మలక్‌పేట వద్ద ‘మూడో మార్గానికి’ మార్గం సుగమం ► రైల్వే అండర్ పాస్‌కు సన్నాహాలు ► రూ.10 కోట్లు డిపాజిట్ చేసేందుకు ► మెట్రోరైల్ సంస్థ అంగీకారం వారంలో క్షేత్రస్థాయి సర్వే ► ఈ రూట్లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ సాక్షి, సిటీబ్యూరో: మలక్‌పేట రైలు వంతెన సమీపంలో వాహనాల కోసం మరో అండర్ పాస్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఉన్న రెండింటికి తోడు మరోటి ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ అంగీకరించింది. ఇందుకు అవసరమైన ఖర్చు భరించడానికి హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ముందుకు వచ్చింది. పనులు ప్రారంభించడానికి ముందే రూ.10 కోట్లు రైల్వే శాఖ దగ్గర డిపాజిట్ చేయడానికీ అంగీకరించింది. గురువారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో బల్దియా నేతృత్వంలో జరిగిన వివిధ శాఖల ఉమ్మడి కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందుల్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు మూడో మార్గం కావాలంటూ ఈ ఏడాది జనవరిలోనే ప్రతిపాదనలు పంపారు. అత్యంత కీలక రహదారుల్లో ఒకటి... నగరంలోని అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్సుఖ్నగర్-చాదర్‌ఘాట్ మధ్యలోనిది ప్రధానమైంది. ఈ రూట్లో నగరానికి చెందిన అంతర్గత వాహనాలే కాకుండా విజయవాడ వైపు వేళ్లేవీ నడుస్తుంటాయి. ఫలితంగా దాదాపు 24 గంటలూ ఈ మార్గం రద్దీగానే ఉంటుంది. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కన ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్ ఈ రూట్లో తిరిగే వాహనచోదకులకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చాదర్‌ఘాట్ వైపు మెట్రో రైల్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీని ప్రభావంతో రద్దీ వేళల్లో చాదర్‌ఘాట్ కాజ్ వే వరకు వాహనాలుబారులు తీరుతున్నాయి. ఈ మార్గాన్ని అనుసరించాలంటేనే వాహనచోదకులు హడలిపోతున్నారు. ‘మెట్రో’ వస్తే మరింత ఘోరం... మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న రైలు వంతెన అటు-ఇటు ఉన్న రహదారి కంటే ఇరుకుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సర్వకాలసర్వావస్థల్లోనూ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పట్లేదు. ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండుగల సీజన్లో... ప్రధానంగా రాత్రి వేళ ఈ ప్రాంతంలో మరింత నరకం చవిచూడాల్సిందే. ఇప్పటికే ఉన్న ఈ ఇబ్బందులకు తోడు మెట్రోరైల్ ప్రారంభమైతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ రైల్ వంతెనకు సమీపంలోనే మెట్రో రైల్స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. అది కూడా పూర్తైఅందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు రెట్టింపు అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ వివరాలన్నింటినీ పొందుపరుస్తూ జనవరిలో జరిగిన సమావేశంలో రైల్వే శాఖకు ప్రతిపాదనలు ఇచ్చారు. ఇప్పటికే రెండు చోట్ల నిర్మాణం... ఇప్పటికే నగరంలోని రెండుచోట్ల రైల్ అండర్ పాస్‌లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్ నిలయం, కాలాడేరా ప్రాంతంలో చేపట్టిన ఈ చర్యలతో చెప్పుకోదగ్గ ఊరట లభించింది. ఇలానే మలక్‌పేట రైల్ వంతెన వద్ద మూడో మార్గం ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ అధికారులు కోరారు. తర్వాతి దశలో మూసీపై వంతెన మలక్‌పేటలో మూడో అండర్ పాస్ ఏర్పాటుకు రూ.10 కోట్లు ఖర్చవుతాయని రైల్వే శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మొత్తం చెల్లించేందుకు హెచ్ఎంఆర్ ముందుకు రావడంతో రైల్వే అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. వారం రోజుల్లో అన్ని విభాగాల అధికారులతో ఉన్న ఉమ్మడి కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేపడతాం. వీలైనంత త్వరలో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ అండర్ పాస్ నిర్మాణం పూర్తయిన తర్వాత మలక్‌పేట వైపు మూసీపై ఉన్న వంతెన విస్తరణ అంశానికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందిస్తాం’. - ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
హెచ్ఎమ్ఆర్ ఎమ్‌డి NVS రెడ్డితో చిట్‌ఛాట్