లాభాల బాట పట్టడమే తరువాయి అనే తరుణంలో కోవిడ్ రూపంలో ఆపద వచ్చి పడింది హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకి. గత రెండేళ్లుగా విడతల వారీగా వచ్చి పడుతున్న కరోనా వేవ్స్ ఈ భారీ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోజువారీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో అప్పుల కుప్పగా మారిపోయింది మెట్రో. కాగా తాజా గణాంకాలు హైదరాబాద్ మెట్రో కోలుకుంటుందనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
కరోనా థర్డ్ వేవ్ ఇటీవల ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీనికి తగ్గట్టుగానే నగరంలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. క్రమంగా ఆఫీసులు పూర్వ స్థితికి వస్తున్నాయి. విద్యాలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీనికి తగ్గట్టుగానే మెట్రో ఎక్కుతున్న ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది
కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్‌తో 2022 జనవరిలో రోజువారీ మెట్రో ప్రయాణికుల సంఖ్య 1.60 లక్షలకు పడిపోయింది. అయితే థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఫిబ్రవరి ఆరంభానికి ఈ సంఖ్య 1.80 లక్షలకు చేరుకుంది. ఈ నెల చివరి నాటికి రోజువారీ ప్రయాణికుల సంఖ్య 2 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది హైదరాబాద్ మెట్రో. ఇదే జోరు కొనసాగితే మే నాటికి కోవిడ్ పూర్వ స్థితికి మెట్రో చేరుకుంటుందని, దీంతో క్రమంగా నిర్వాహణ నష్టాలు తగ్గుతాయని ఆ సంస్థ అంచనా వేస్తోంది.
కరోనాకి ముందు 2020 ఫిబ్రవరిలో మెట్రో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.75 లక్షలుగా ఉండేది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులు, ఐటీ ప్రొఫెషనల్స్ ఈ సర్వీసులను ఎక్కువగా ఉపయోగించేవారు. వరుసగా వచ్చి పడ్డ కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో మెట్రో రైడర్‌షిప్ సంఖ్య దారుణంగా పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ 2021 డిసెంబరు నాటికి డైలీ రైడర్‌షిప్ సంఖ్య 2.40 లక్షలకు చేరువ అవుతుండగా థర్డ్ వేవ్ వచ్చి పడింది.
కరోనా ఎఫెక్ట్‌తో ఇన్నాళ్లు ఉద్యోగస్తులు ఇళ్లకే పరిమితం కావడంతో రోజువారీ మెట్రో ప్రయాణికుల సంఖ్య దారుణంగా పడిపోయింది. దీంతో గత రెండేళ్లుగా నిర్వాహన నష్టాలు పెరిగాయి. చివరకు బాండ్ల ద్వారా రుణాలు సేకరించాలని మెట్రో నిర్ణయించింది. ఈ క్రమంలో తిరిగి ప్రయాణికులు మెట్రో వైపు చూస్తుండటం ఆ సంస్థకు కొత్త ఊపిరి అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment