సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈనెల 7 నుంచి మెట్రో రైళ్లను దశలవారీగా తిరిగి ప్రారంభించనున్న నేపథ్యంలో అమలు చేయాల్సిన మార్గదర్శకాలను, రైళ్ల రాకపోకల షెడ్యూల్‌ను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం వెల్లడించింది. గురువారం రసూల్‌పురాలోని మెట్రోరైల్ భవన్‌లో నిర్వహించిన సుదీర్ఘ సమావేశం అనంతరం హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తాజా మార్గదర్శకాలను ప్రకటించారు. దశలవారీగా హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల రాకపోకలను పెంచనున్నామని తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్న ఐదు స్టేషన్లలో మెట్రో రైళ్లు నిలపబోమని స్పష్టంచేశారు. నగరంలోని గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ స్టేషన్లలో మెట్రో రైలు ఆగదని.. ప్రయాణికులను స్టేషన్లలోకి అనుమతించబోరని వెల్లడించారు. సమావేశంలో ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనిల్‌కుమార్ సైనీ, డీవీఎస్ రాజు, దాస్ తదితరులు పాల్గొన్నారు.
మార్గదర్శకాలివే..
► ప్రతి 5 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు రైళ్లను నడిపే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.
► స్టేషన్లు, బోగీల్లో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు ప్రత్యేకంగా వృత్తాకార మార్కింగ్‌లు అమర్చనున్నారు. బోగీల్లోనూ ప్రయాణికులు పక్కపక్క సీట్లలో కూర్చోకుండా ఏర్పాట్లు చేశారు.
► ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉందా లేదా అన్న విషయాన్ని సీసీటీవీలతో పాటు ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు.
► మాస్క్‌లేని ప్రయాణికులను స్టేషన్‌లోనికి అనుమతించబోరు. మాస్క్‌లు విక్రయించేందుకు స్టేషన్లలో ఏర్పాట్లు చేయనున్నారు.
► మార్గదర్శకాలను అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తారు.
► స్టేషన్‌లోకి ప్రవేశించే సమయంలోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు.
► ఆరోగ్య సేతు యాప్‌ని వినియోగించేలా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తారు.
► స్టేషన్‌లోనికి ప్రవేశించే ముందు శానిటైజర్ వినియోగించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
► భద్రత పరంగా మాక్‌డ్రిల్స్‌ను అవసరాన్ని బట్టి నిర్వహిస్తారు.
► మెట్రో సిబ్బందికి అవసరమైన మేర పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు సరఫరా చేస్తారు.
► స్మార్ట్‌మెట్రో కార్డ్, మొబైల్ క్యూఆర్ టికెట్లతో జర్నీ చేసేలా ప్రయాణికులను ప్రోత్సహించనున్నారు.
► ప్రయాణికులు స్వల్ప లగేజీ (మెటల్ కాకుండా)తో ప్రయాణించొచ్చు. శానిటైజర్ తెచ్చుకోవచ్చు.
► యథావిధిగా పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంటాయి.
► ఆరోగ్యశాఖ, పోలీసు శాఖ సౌజన్యంతో మెట్రో స్టేషన్లు, పరిసరాల్లో రద్దీని క్రమబద్ధీకరిస్తారు.
ఫేజ్–1
ఈనెల 7 నుంచి ప్రారంభమయ్యే మియాపూర్–ఎల్బీనగర్ (కారిడార్–1) రూట్‌లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో రైళ్లు నడపనున్నారు.
ఫేజ్–2
ఈ నెల 8 నుంచి ప్రారంభమయ్యే నాగోల్–రాయదుర్గం రూట్‌లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. తిరిగి సాయంత్రం 4 నుంచి 9 రాత్రి గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.
ఫేజ్–3
ఈ నెల 9వ తేదీ నుంచి జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. అయితే మొత్తం మూడు రూట్లలోనూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment