అమీర్‌పేట: లాక్‌డౌన్ తరువాత హైదరాబాద్‌లో దశలవారీగా మెట్రోరైల్ సర్వీసులను పునఃప్రారంభిస్తున్నామని మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి తెలిపారు. శనివారం అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో ఎల్‌అండ్‌టీ సంస్థ సీఈఓ కేబీఎన్‌రెడ్డితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి దశలో కారిడార్ 1 మియాపూర్, ఎల్‌బీనగర్ మార్గంలో ఈ నెల 7 నుంచి మెట్రోరైల్ అందుబాటులోకి రానుందని చెప్పారు. రెండో దశలో కారిడార్ 3 నాగోల్, రాయదుర్గ్ మార్గంలో, 8వ తేదీ, 9వ తేదీల్లో కారిడార్ 2తో పాటు అన్ని ఇతర మార్గాల్లో సర్వీసులు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. అన్‌లాక్ – 4 నిబంధనలు పాటిస్తూ సర్వీసులను నడిపిస్తామన్నారు. మెట్రోరైళ్లతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు కోవిడ్–19 నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని సూచించారు.
చేతి మణికట్టు వద్ద థర్మల్ స్క్రీనింగ్, చేతులను శానిటైజ్ చేశాకే లోపలికి అనుమతిస్తామన్న ఆయన.. ప్రయాణికులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, ఒకవేళ మరచిపోయి వస్తే స్టేషన్లలో మాస్కులు కొనుక్కుని ధరించాలని, ప్రతిచోట భౌతికదూరం పాటించాలని వివరించారు. టెంపరేచర్ ఉంటే వెనక్కి పంపిస్తామని, అలాగే మెటల్ వస్తువులు వెంట తీసుకురాకూడదని స్పష్టంచేశారు. రైల్లో 75 శాతం తాజా గాలి ఉండేలా టెర్మినల్స్ వద్ద రైళ్ల డోర్స్‌ను ఎక్కువ సమయం తెరిచి ఉంచుతామని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలును నడిపిస్తామని, ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామని పేర్కొన్నారు. గతంలో ఒక్కో రైలులో 1,000 మంది ప్రయాణించే వారని, కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం 300 మంది వరకు మాత్రమే ప్రయాణించడానికి అవకాశముందని తెలిపారు.
స్మార్ట్‌కార్డుతో ప్రయాణాలు
కాయిన్స్, కరెన్సీ వాడకం ద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశముందని మెట్రో అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు ఇది వరకే కలిగి ఉన్న స్మార్ట్ కార్డు ద్వారా క్యూఆర్‌కోడ్ టికెటింగ్‌తో ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణం ముగిసిన ప్రతీసారి క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేయాలి. భౌతికదూరం పాటిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. లిఫ్ట్‌లో కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతిస్తారు. కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించిన భరత్‌నగర్, మూసాపేట, యూసుఫ్‌గూడ, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్ స్టేషన్లలో రైలు ఆగదు. రైలులో క్రాస్ మార్కు పెట్టిన చోట కూర్చోకూడదు. మార్కు చేసిన ప్రాంతంలోనే నిలబడాల్సి ఉంటుంది. వైద్యం, అత్యవసర సేవల కోసం 7995999533 నంబర్‌ను సంప్రదించవచ్చని మెట్రో అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment