మెట్రో రైలు ప్రాజెక్టుకు అడ్డంకిగా మారిన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ నడుం బిగించింది. మార్కెట్ నుంచి భారీ ఎత్తున నిధుల సేకరణ రెడీ అయ్యింది.
వరుస నష్టాలు
ఎల్ అండ్ టీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి హైదరాబాద్ మెట్రో రైలు గాడిన పడే సమయంలో కరోనా సంక్షోభం ఎదురైంది. ఏడాదిన్నరగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో పాటు కమర్షియల్ స్పేస్ నుంచి ఆశించిన ఆదాయం రావడం లేదు. రోజురోజుకు నష్టాల భారం పెరిగి పోయి చివరకు నిర్వహాణ భారంగా మారే పరిస్థితి వచ్చింది.
దెబ్బ మీద దెబ్బ
హైదరాబాద్ మెట్రోని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలంటూ ఇప్పటే పలు మార్లు ప్రభుత్వాలను కోరింది ఎల్ అండ్ టీ. మరోవైపు బ్యాంకుల నుంచి సాఫ్ట్‌లోన్ కోసం కూడా ప్రయత్నాలు చేసింది. అక్కడ జాప్యం అవుతుండటం మరోవైపు కోవిడ్ నిబంధనలు, వర్క్ ఫ్రం హోం, ఓమిక్రాన్ వేరియంట్ ఇలా అనేక అంశాల కారణంగా ఆశించిన స్థాయిలో మెట్రో ఆదాయం పెరగడం లేదు. దీంతో ఆర్థిక పరిపుష్టి కోసం ఎల్ అండ్ టీ సంస్థ మార్కెట్‌కు వెళ్లాలని నిర్ణయించింది.
రూ. 13,600 కోట్లు
మార్కెట్‌లో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ చేయడం ద్వారా రూ. 8,600 కోట్లు కమర్షియల్ పేపర్ల ద్వారా మరో రూ.5,000 కోట్లు మొత్తంగా రూ. 13,600 కోట్ల నిధులు సమీకరించాలని ఎల్ అండ్ టీ మెట్రో నిర్ణయించినట్టు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది.
డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు
కమర్షియల్ పేపర్ ద్వారా సేకరించే నిధులకు వన్ ఇయర్ మెచ్యూరిగా టైంగా ఉండగా వడ్డీ 5 నుంచి 5.30 శాతం వరకు ఉండవచ్చని అంచనా. ఇక నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ విషయంలో మెచ్యూరిటీ సమయం ఐదేళ్లు ఉండగా వడ్డీ రేటు 6.30 శాతం నుంచి 6.60 శాతం వరకు ఉండవచ్చని అంచనా.
క్రిసిల్ రేటింగ్.. ఎస్‌బీఐ క్యాపిటల్
ప్రముఖ రేటింగ్ సంస్థ అంచనాల ప్రకారం హైదరాబాద్ మెట్రో సంస్థకి ట్రిపుల్ ఏ (సీఈ) ఉంది. కాబట్టి మార్కెట్ నుంచి కన్వర్టబుల్ డిబెంచర్స్, కమర్షియల్ పేపర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ సులువుగానే జరుగుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్ ద్వారా డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు జారీ కానున్నట్టు సమాచారం.
నష్టం రూ.1,767 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్)ని డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌ఓటీ) పద్దతిన ఎల్ అండ్ టీ నిర్మించింది. 35 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు సర్వ హక్కులు ప్రభుత్వానికి దాఖలు పడతాయి. ప్రస్తుతం మూడు కారిడార్లలో 69.2 కిలోమీటర్ల మేర హెచ్‌ఎంఆర్ విస్తరించి ఉంది. ప్రస్తుతం మెట్రో రైలుకి రూ.1.767 కోట్ల నష్టాల్లో ఉంది. ఇందులో రూ.382 కోట్ల నష్ట గతేడాది కాలంలో వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment