Hyderabad Metro Extension To Shamshabad Airport, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

ఢిల్లీ తరహాలో ఎయిర్‌పోర్ట్‌ వరకు హైదరాబాద్‌ ‘మెట్రో’

Nov 18 2021 8:38 AM | Updated on Nov 18 2021 10:57 AM

Hyderabad Metro Will Extended To Shamshabad Airport - Sakshi

దేశ రాజధాని న్యూఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లో మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మెట్రో రైలులో వేగంగా ఎయిర్‌పోర్టుని చేరుకునేలా సరికొత్త ప్రాజెక్టుకు రూపు ఇస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌వాసుల కలల మెట్రోరైల్‌ ప్రాజెక్టును రాయదుర్గం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించేందుకు అక్షరాలా రూ.4 వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. రాయదుర్గం నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా మీదుగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 31 కి.మీ మేర ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. దీంతో రాయదుర్గం నుంచి కేవలం 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలవుతుంది. ఈ మెట్రో కారిడార్‌ ఏర్పాటుతో గ్రేటర్‌ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల అవస్థలు తప్పనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్ల నుంచి విమానాశ్రయానికి కనెక్టివిటీ లేదు. రాయదుర్గం నుంచి రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతున్న విషయం విదితమే. 

5 కి.మీకి ఒక స్టేషన్‌!
విమానాశ్రయ మార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లను ఔటర్‌రింగ్‌రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పాజంక్షన్, కిస్మత్‌పూర్, గండిగూడా చౌరస్తా, శంషాబాద్‌ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా మట్టి నాణ్యత పరీక్షలు చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. త్వరలో స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టతరానుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

నిధుల అన్వేషణలో ఎస్‌పీవీ యంత్రాంగం..
రాయదుర్గం–శంషాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కారిడార్‌ ఏర్పాటుకు వీలుగా స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ప్రత్యేకయంత్రాంగం)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ యంత్రాంగంలో హైదరాబాద్‌ మెట్రోరైలు, టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ విభాగాలున్నాయి. ప్రస్తుతం ఈవిభాగాల ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. గతేడాది బడ్జెట్‌లో సుమారు రూ.వెయ్యి కోట్లను హెచ్‌ఎంఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో ప్రాజెక్టును మొదలుపెడతారా..లేక ఇతర మార్గాల్లో రుణ సేకరణ ద్వారా ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని సమకూర్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. కాగా ప్రస్తుతం నగరంలో ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం రూట్లలో 69.1 కి.మీ మేర మెట్రో రైలు సదుపాయం అందుబాటులో ఉంది.

చదవండి:కూకట్‌పల్లి టూ కోకాపేట్‌.. త్వరలో లైట్‌ రైల్‌ ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement