ప్రభుత్వ ప్రాజెక్టుగా ‘మెట్రో’ రెండో విడత!  | Second Phase Of Metro As Government Project | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ప్రాజెక్టుగా ‘మెట్రో’ రెండో విడత! 

Published Tue, Jul 17 2018 1:02 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

Second Phase Of Metro As Government Project - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశను ప్రభుత్వ ప్రాజెక్టుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దశ ప్రాజెక్టు కింద నగర శివార్లలో తక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతాలను మెట్రో రైలుతో అనుసంధానం చేస్తుండటంతో భవిష్యత్తులో ఆదాయం రూపంలో పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని తేల్చింది. హైదరాబాద్‌ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్‌) తొలి దశ కింద నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు కారిడార్ల పరిధిలో ఇప్పటికే రవాణా సేవలు ప్రారంభించగా, ఆశించిన రీతిలో ప్రయాణికుల నుంచి స్పందన లేదు. నగరంలో ఆర్టీసీ బస్సుల ద్వారా సగటున రోజుకు 40 లక్షల మంది ప్రయాణిస్తుండగా, మెట్రో రైలును రోజుకు సగటున 70 వేల మందే వినియోగించుకుంటున్నారు.

తొలి దశ ప్రాజెక్టుతో పోల్చితే రెండో దశ ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో జన సాంద్రత చాలా తక్కువగా ఉంది. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టులన్నీ నిర్వహణలో తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుల విషయంలోనూ ప్రైవేటు పెట్టుబడిదారులు ముందుకు రాలేదని ప్రభుత్వం గుర్తించింది. ప్రైవేటు పబ్లిక్‌ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వెళితే పెట్టుబడులు వచ్చే అవకాశం అంతంతేనని అంచనాకు వచ్చింది.  

ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.9,378 కోట్లు 
ఈ క్రమంలో పూర్తిగా ప్రభుత్వ ప్రాజెక్టుగానే మెట్రో రెండో దశ ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులతో మెట్రో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పంపించింది. రెండో దశ ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.9,378 కోట్ల అంచనా వ్యయంతో మూడు మార్గాల్లో మొత్తం 62 కి.మీ. పొడవున మెట్రో రైలు నిర్మాణానికి అనుమతులు జారీ చేయాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమ యాజమాన్య ప్రాజెక్టు (ఈక్వల్‌ వోనర్‌షిప్‌ ప్రాజెక్టు)గా రెండో దశ చేపట్టాలని, కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడి వాటాలు పోగా మిగిలిన వ్యయ భాగాన్ని విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరిస్తామని పేర్కొంది. 

డీపీఆర్‌ రూపకల్పనకు రూ.50 కోట్ల నిధులు  
మెట్రో రైలు రెండో విడత సవివర పథక నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన కోసం హెచ్‌ఎంఆర్‌కు రూ.50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండో దశ ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు సంస్థ (డీఎంఆర్‌సీఎల్‌)కు హెచ్‌ఎంఆర్‌ అప్పగించింది. తొలి దశ కింద ఇప్పటికే మూడు కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, రెండో దశ కింద నాలుగో కారిడార్‌గా గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు నుంచి శంషా బాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 30.7 కి.మీ. పొడవున ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదో కారిడార్‌లో బీహెచ్‌ఈఎల్‌ నుంచి మియాపూర్‌ మీదుగా లక్డీకాపూల్‌ వరకు 26.2 కి.మీ. మెట్రో రైలు మార్గం ఏర్పాటు కానుంది. అదేవిధంగా తొలిదశలో మూడో కారిడార్‌ (నాగోల్‌–రాయ్‌దుర్గ్‌) విస్తరణలో భాగంగా నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు 5.1 కి.మీ. మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement