మార్చిలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ రెడీ! | Kanaka Durga flyover to be inaugurated by March | Sakshi
Sakshi News home page

మార్చిలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ రెడీ!

Published Sun, Feb 23 2020 3:38 AM | Last Updated on Sun, Feb 23 2020 9:04 AM

Kanaka Durga flyover to be inaugurated by March - Sakshi

ఫ్లైఓవర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్న కార్మికులు

సాక్షి, అమరావతి బ్యూరో: బెజవాడ వాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నగరవాసుల ఆశలు తీర్చేలా ఫ్లైఓవర్‌ పనులు సంపూర్ణంగా పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం శరవేగంగా కృషిచేస్తోంది. మరో నెలరోజుల్లో.. అంటే మార్చి నెలాఖరుకల్లా తుది దశ పనులు పూర్తయ్యేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం ఏప్రిల్‌ మొదటి వారంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత ఈ వంతెనపై అనధికారికంగా వాహనాల రాకపోకలకు వీలు కల్పిస్తారు. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం జరిగాక అధికారికంగా వాహనాలకు అనుమతిస్తారు.

కొత్త సర్కారుతో ఊపందుకున్న పనులు
2.6 కిలోమీటర్ల మేర దాదాపు రూ.325 కోట్ల వ్యయంతో  సోమా ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఈ ఫ్‌లైఓవర్‌ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. 46 స్పాన్లతో ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. 2015 డిసెంబర్‌ 28 నుంచి పనులు మొదలుపెట్టారు. వాస్తవానికి  రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తికావల్సి ఉన్నా పలు అవాంతరాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ ఫ్‌లైఓవర్‌ను సత్వరమే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించడంతో గడిచిన ఆరేడు నెలల్లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే స్పాన్లు, వింగ్స్‌ పూర్తయ్యాయి. ప్రస్తుతం కనకదుర్గ అమ్మవారి గుడి కొండపైకి వెళ్లే ప్రవేశ ద్వారానికి ఎదురుగా జరుగుతున్న రెండు స్పాన్ల పనులు ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద వై డక్ట్, రాజీవ్‌గాంధీ పార్క్‌ వైపు అప్రోచ్‌ రోడ్ల పనులు తుది దశలో ఉన్నాయి. ఈ పనులు కూడా నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు.. ఫ్‌లైఓవర్‌కు ఇప్పటికే అందమైన రంగులు అద్దారు. వంతెనపై విద్యుద్దీపాల ఏర్పాటు 75 శాతం పూర్తయింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ రెండ్రోజుల క్రితం కాంట్రాక్టరు ప్రతినిధులు, సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కనకదుర్గ ఫ్‌లైఓవర్‌ పనులన్నీ వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ఏప్రిల్‌ మొదటి వారంలో ఈ ఫ్‌లైఓవర్‌పై ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని యోచిస్తున్నట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ ‘సాక్షి’కి తెలిపారు. రాజీవ్‌గాంధీ పార్క్‌ నుంచి సగం వరకు ఫినిషింగ్‌ వర్క్‌ పూర్తయిందని,  భవానీపురం వైపు పనులు సత్వరమే పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఈ వంతెన పనులను పర్యవేక్షిస్తున్న ఆర్‌ అండ్‌ బీ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (క్వాలిటీ కంట్రోల్‌) జాన్‌మోషే ‘సాక్షి’కి చెప్పారు. చివరి దశలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన నిర్ణీత గడువులో పూర్తవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement