సాక్షి, విజయవాడ : నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు శుక్రవారం వర్చువల్ కార్యక్రమం ద్వారా ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. అనంతరం రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్‌లు జాతికి అంకితం ఇచ్చారు. కాగా, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది. 900 పని దినాలలో ఫ్లైఓవర్ పూర్తయింది.
ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్రంలో అనుకూల పరిస్థితులున్నాయి. ఏపీ రహదారుల సమస్యలపై త్వరలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమావేశం అవుతాం. రాయలసీమలో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తాం. హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల’’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment