AP: CM YS Jagan Speech In Benz Circle Flyover Inauguration Program Full Details Here - Sakshi
Sakshi News home page

AP CM YS Jagan: 51 ప్రాజెక్టులకు ముందడుగు

Published Thu, Feb 17 2022 6:23 PM | Last Updated on Thu, Feb 17 2022 7:16 PM

CM YS Jagan Speech In Benz Circle Flyover Inauguration Program - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో  కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 1380 కిలోమీటర్ల పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు గురువారం శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే...: 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చిన నితిన్‌ గడ్కరీకి ధన్యవాదాలు. మీ దార్శనికత, ముందుచూపు ఈ దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ఆంధ్రప్రదేశ్‌ కూడా చోటు దక్కించుకుంది. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ ట్రాక్స్‌ కార్యక్రమం మీరు చేస్తున్న అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయిలా చేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మీరు రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖలను అత్యంత నేర్పరితనంతో, వేగవంతంగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. 

పెరిగిన జాతీయ రహదారుల పొడవు
మీ హయాంలో రహదారుల నిర్మాణం 2014లో రోజుకు 12 కిలోమీటర్ల స్ధాయి నుంచి ప్రస్తుతం మన మాట్లాడుకుంటున్నట్టు 37 కిలోమీటర్ల స్ధాయికి చేరుకుంది. మా రాష్ట్రంలో మీ సమర్ధవంతమైన పనుల వల్ల జాతీయరహదారుల పొడవు 2014లో ఉన్న 4193 కిలోమీటర్ల నుంచి 95 శాతం గ్రోత్‌ రేటుతో నేడు 8163 కిలోమీటర్లకు చేరింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  

51 ప్రాజెక్టులు ముందడుగు
కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మొత్తం 51 ప్రాజెక్టులకు సంబంధించి ముందడుగులు పడుతున్నాయి. ఇందులో రూ.10,400 కోట్ల వ్యయంతో నిర్మించిన 741 కిలోమీటర్ల పొడవైన 30 రహదారుల పనులకు శంకుస్ధాపనతో పాటు, ఇప్పటికే రూ.11,157 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన మరో 21 రహదారులను ఇవాళ ప్రారంభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీ గారికి, ప్రత్యేకించి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద రద్దీను దృష్టిలో ఉంచుకుని మరో ఫ్లైఓవర్‌ నిర్మించాలని 2019 ఆగష్టులో నేను విజ్ఞప్తి చేశాను. ఆ మేరకు మంత్రి గడ్కరీ వెంటనే మంజూరు చేసి, 2020లోనే నిర్ణయం తీసుకుని,ఆ పై నిర్మాణ పనులు కూడా వేగవంతం చేసి.. ఆ ఫ్లైఓవర్‌ను కూడా గౌరవ కేంద్రమంత్రి ప్రారంభిస్తుండటం చాలా సంతోషం. గతంలో ఇదే విజయవాడలో 2019లో మనం అధికారంలోకి వచ్చేనాటికి కూడా పూర్తికాని బెంజ్‌ సర్కిల్‌లోని తూర్పున ఉన్న ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గడ్కరీ సహకారంతో వాయువేగంతో పూర్తి చేయగలిగామని సంతోషంగా చెపుతున్నాం. 

రూ.10,600 కోట్లతో పనులు
రాష్ట్రంలో జాతీయరహదారుల విస్తరణ, అభివృద్ది, నిర్మాణంలో వీటి అన్నింటికి సంబంధించి అత్యంత చొరవతో మన ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. భూసేకరణతో పాటు ఎక్కడ ఏ సమస్య కూడా తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ... రహదారుల నిర్మాణం వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు మనం తీసుకుంటున్నాం. ఇదే సందర్భంలో మరో విషయం కూడా చెప్పాలి. రాష్ట్రంలోని మిగిలిన రహదారులు అంటే.. జాతీయరహదారులు కాకుండా మిగిలిన రహదారులకు సంబంధించిన పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతంగా అడుగులు ముందుకేస్తోంది. ఇందుకోసం మనం రూ.10,600 కోట్లు కేటాయించాం. ఇప్పుడే ఆర్‌ అండ్‌ బి కార్యదర్శి కృష్ణబాబు ఆ రూ.10,600 కోట్లకు సంబంధించిన పనుల వివరాలన్నీ చెప్పారు.

ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కనెక్టవిటీ
ప్రతి మండల కేంద్రం నుంచి కూడా జిల్లా కేంద్రం వరకు రెండు లైన్ల  రోడ్లుగా మారుస్తూ... దాదాపుగా రూ.6,400 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. పూర్తిగా రోడ్లన్నీ కూడా  రిపేర్లు, మెయింటైనెన్స్‌ చేయడం కోసం మాత్రమే మరో రూ.2300 ఖర్చు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న ప్రతి రోడ్డు పూర్తి చేసేందుకు మరో రూ.1700 కోట్లు ఖర్చుతో కలిపి రూ.10,600 కోట్లకు సంబంధించిన రహదారి పనులకు శ్రీకారం చుట్టాం. 

ఇందులో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఇక రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున మీరు చేసిన మంచి పనులన్నింటికీ కూడా ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి రాజకీయాలు లేకుండా ప్రజల మందుర మీకు మా సంతోషాన్ని,  కృతజ్ఞతలూ తెలియజేస్తున్నాను. ఇవాళ మరికొన్ని రోడ్ల నిర్మాణం కూడా ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని విజ్ఞప్తి చేస్తూ.. మీ ఆమోదం కోసం కొన్ని ప్రతిపాదనలను మీ ముందు ఉంచుతున్నాను.

మరికొన్ని ప్రతిపాదనలు
విశాఖతీరంలో విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి– భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు రహదారి నిర్మాణం.  రుషికొండ, భీమిలి కొండలను, సముద్ర తీరాన్ని తాకుతూ పర్యాటక రంగానికే వన్నె తెచ్చే విధంగా .. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు కనెక్ట్‌ చేసే విధంగా నేషనల్‌ హైవే 60ను కలుపూతూ 6 లేన్ల రహదారి చాలా అవసరం అని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే విజయవాడ తూర్పున బైపాస్‌... కృష్ణానదిపై వంతెన సహా దాదాపు 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణం అవసరం. నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌ దృష్ట్యా ఈ బైపాస్‌ చాలా అవసరం అవుతుంది. మీరు వెస్ట్రన్‌ బైపాస్‌కు శాంక్షన్‌ ఇచ్చారు, ఈస్ట్రన్‌ బైపాస్‌కు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను.  ప్రధాన జాతీయ రహదారులు నగరం గుండా వెళ్తుండడంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటికీ కూడా ఈ రెండు బైపాస్‌లు పరిష్కారమార్గాలవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.  

జాతీయ రహదారులుగా..
అలాగే వైఎస్సార్‌ కడప జిల్లా భాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బెస్తవారిపేట రహదారి, పుంగనూరు నుంచి పులిచెర్ల మీదుగా చిన్నగొట్టికల్లు రహదారి, సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని రహదారి, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదుగా భద్రాచలం వరకు ఉన్న రహదారి.. వీటన్నింటినీ కూడా జాతీయ రహదారులగా గుర్తించి అభివృద్ది చేయాలని మనసారా కోరుతున్నాను. నిండుమనస్సుతో మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే తెలుగువారైన మన కిషన్‌ రెడ్డి గారు కూడా.. మన రాష్ట్ర అభివృద్ది కొరకు నాలుగడుగులు ఎప్పుడూ ముందుకు వేస్తూనే ఉన్నారు.  ఆయన కూడా మరింత చొరవ చూపాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

చివరిగా..
ఈ ప్రతిపాదనలన్నింటినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయరహదారుల శాఖకు పంపించాం. గడ్కరీ దయచేసి వీటన్నింటినీ పరిశీలించి, పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. మరోవైపు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటీవలే రాష్ట్ర రహదారులపై ఆర్‌ఓబీల నిర్మాణాలకు సంబంధించి కేంద్రం అడిగిన 20 ప్రతిపాదనలు సిద్ధం చేశాం. దీనికి సంబంధించి కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నాం. వీటన్నింటితో పాటు మంచి చేస్తున్న మంచి వారికి ఎప్పుడూ మంచి జరగాలని ఆశిస్తూ.. కోరుకుంటూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా మనందరి ప్రభుత్వానికి కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, కె నారాయణస్వామి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement