krishan district
-
అల్లు అర్జున్ను టార్గెట్ చేసిన మరో జనసేన నేత
సాక్షి, కృష్ణా జిల్లా: జనసేన నేతలు అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోతున్నారు. ఆయనపై మరో జనసేన నేత నోరు పారేసుకున్నారు. అల్లు అర్జున్ ఓ కమెడియన్ అంటూ ఆ పార్టీ గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌బాబు నోటి దురుసు ప్రదర్శించారు. ‘‘చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు అండతో ఇండస్ట్రీకి వచ్చావు. మెగా ఫ్యామిలీని విమర్శించే స్థాయి నీకు లేదు. నీ బాబు అల్లు అరవింద్ పిల్లికి బిక్షం కూడా పెట్టడు. నీ స్థాయిని మరచి మాట్లాడుతున్నావు’’ అంటూ వ్యాఖ్యానించారు.‘‘చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లుకడిగి నీళ్లు నెత్తిన చల్లుకుని తప్పుని సరిచేసుకో. అలా చేయని పక్షంలో డిసెంబర్ లో రిలీజ్ అయ్యే నీ సినిమాలను అడ్డుకుంటాం. గన్నవరం నియోజకవర్గంలో నీ సినిమా ఒక్క థియేటర్లోకూడా విడుదలయ్యే పరిస్థితి ఉండదు.’’ అని చలమశెట్టి హెచ్చరించారు.కాగా, ‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అంటూ తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
‘సార్ మీరు ఇటువైపు రావద్దు’
‘చంద్రబాబు వస్తున్నారు మీరంతా వచ్చేయండి’ అని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) బృందం భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది. ‘సార్ (బాబు) మీరు ఇటువైపు రావద్దు. మీరొస్తే వాళ్లు ఎక్కువగా చెప్పుకుంటారు’ అని కేశినేని శివనాథ్ (చిన్ని) బృందం గట్టిగా కోరింది. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ నగరంలోని భవానీపురం ఈద్గా గ్రౌండ్స్‌లో ఆదివారం ఎం.కె.బేగ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు నేపథ్యంలో విజయవాడ లోక్‌సభ పరిధిలోని నాయకుల మధ్య జరిగిన వ్యవహారమిది. ఇఫ్తార్ విందుకు హాజరవ్వాలా? వద్దా? అనే తర్జనభర్జనలో చివరకు చంద్రబాబునాయుడు ఆగిపోయారు. కేశినేని నాని బృందం, చిన్ని వర్గాల మధ్య రాజకీయ పోరు ఎలాగున్నా చంద్రబాబు పరిస్థితి మాత్రం హే కృష్ణా! అని తలపట్టుకోక తప్పడంలేదు. పూర్వపు కృష్ణా జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని సీనియర్లు ఆందో ళన చెందుతుండగా పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఆవేదనకు లోనవుతున్నారు. అవకాశ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రత్యేక గుర్తింపున్న.. సమయానుకూలంగా నాయకుల మధ్య వర్గాలను రాజేసి అవసరాలకు వాడుకుని వదిలేస్తారనే పేరున్న చంద్రబాబుకు ఉమ్మడి కృష్ణాలో తలపోటు తీవ్రత పెరిగిపోతోంది. ఎంతలా అంటే విజయవాడలో ఏర్పాటుచేసిన ఇప్తార్ విందుకు హాజరుకాలేనంత. ఓ వర్గం రా ర మ్మని ఆహ్వానిస్తే.. మరో వర్గం రావద్దు పో పొమ్మని పోరుపెట్టింది. గడచిన రెండేళ్లుగా పార్టీ పరంగా ఇఫ్తార్ విందుకు దూరంగా ఉంటున్న నాయకులు మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకున్నారు. విజయవాడ వెస్ట్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంపీ నాని పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని, మీరంతా రావాలని ఎన్టీఆర్ జిల్లా లోని తన వర్గీయులను ఆహ్వానించారు. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎంఎస్ బేగ్ తదితరులతోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న నాని సోదరుడు కేశినేని చిన్ని, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తదితరులు ఇఫ్తార్ విందులో పాల్గొనవద్దని గట్టిగా మొరపెట్టుకోవడంతో బాబు అటువైపు రాలేదు. గతంలో పలుసార్లు ఇఫ్తార్‌కు హాజరైన బాబు ఇప్పుడు రాకపోవడమంటే తమకు ప్రాధాన్యమిచ్చినట్లేనని చిన్ని, బుద్దా, మీరా చెప్పుకుంటున్నారని నగరానికి చెందిన సీనియర్ నాయకులు పేర్కొన్నారు. ఎవరికి వారే యమునా తీరే... మైలవరం నియోజకవర్గం పరిధిలోని గొల్లపూడికి చెందిన బొమ్మసాని సుబ్బారావు ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేసి మాజీ మంత్రి దేవినేని ఉమా పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఉమా అభ్యర్థి అయితే ఓటమి తప్పదని నియోజవర్గానికి చెందిన పలువురు ముఖ్యనాయకులు బాహాటంగానే చెబుతున్నారు. తిరువూరులో మూడుముక్కలాటగా మునెయ్య, దేవదత్తు, స్వామిదాసు మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా మునెయ్య కేశినేనికి దూరమయ్యారు. నందిగామలోనూ అంతకన్నా తీసికట్టుగా తయారైంది. తంగిరాల సౌమ్యకు ప్రత్యామ్నాయం అంటూ జీవరత్నంను నాని ప్రోత్సహిస్తున్నారని, ఇతనికి గన్నే ప్రసాద్ (అన్న) కూడా జతయ్యారని పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. తూర్పులో అభ్యర్థి మార్పు తప్పదని, గద్దె ప్రయాణం గన్నవరమేనని విశ్లేషణలు కొనసాగుతున్నాయి. బొండా ఉమా పరిస్థితి కూడా దాదాపు అంతేనంటున్నారు. కొనకళ్ల కింకర్తవ్యం కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు పరిస్థితిపైనా పార్టీలో చర్చ నడుస్తోంది. పార్టీల మధ్య పొత్తులు కుదిరితే మచిలీపట్నం లోక్‌సభ స్థానాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుందని, అందువల్ల పెడన టికెట్‌ను నారాయణరావు ఆశించవచ్చంటున్నారు. మాజీ మంత్రి కాగిత వెంకట్రావు కుమారుడు అక్కడి టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. గన్నవరం నియోజకవర్గం విషయంలో టీడీపీకి తలపోటు తీరడంలేదు. బచ్చుల అర్జునుడుతో రాజకీయం నడిపిన అధిష్ఠానానికి ఆయన మృతితో ఇప్పుడు అక్కడెవరన్నది ప్రశ్నగా మిగిలింది. గుడివాడలో రావి, పిన్నమనేని టికెట్టు ఆశిస్తుండగా వెనిగండ్ల రామును రంగంలోకి దింపారు. ఇక్కడా ముగ్గురిమధ్య పోటీ కొనసాగుతోంది. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్‌కు ఎప్పుడైనా చెక్ పెట్టే పరిస్థితే. ఇక్కడా పార్టీల మధ్య పొత్తులు కుదిరితే టీడీపీ అభ్యర్థి టికెట్‌కు ప్రమాదం పొంచి ఉన్నట్లే. పెనమలూరుపై ముఖ్యుల కన్ను ఎప్పుడూ ఉండనే ఉంది. వర్ల రామయ్య కుమారుడికి పామర్రు సీటు అంటున్నప్పటికీ సామాజికవర్గ సర్దుబాట్ల ప్రశ్న ఉత్పన్నమవుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘మా అధినేత పార్టీ నేతల మధ్య విభేదాలు రాజేయడం, వాటిని ఆయనే చివరి వరకు పెంచి పోషిస్తుండటం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన అన్ని నియోజకవర్గాల్లోనూ ఇబ్బందులు తామరతంపర్లా కొనసాగుతున్నాయి. ఇవి నానాటికీ ఇంకా పెరిగిపోయేవే తప్ప ఏమాత్రం తగ్గేవి కావు. ఇఫ్తార్ విందుకు వెళ్లవద్దు అనేంతగా విభేదాలు ముదిరిపోయాయంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. బాగా పట్టుందనే భావించే ఇక్కడే ఇలా ఉంటే ఇక ఇతర జిల్లాల్లో పరిస్థితి ఏంటో’ అని విజయవాడకు చెందిన సీనియర్ నేత నిట్టూర్చడం పరిశీలనాంశం. నెట్టెం నెట్టుకొచ్చేదెలా? ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన నెట్టెం రఘురాంకు సహకరించే నియోజకవర్గ ఇన్చార్జులు దాదాపు ఎవరూలేరనే చెప్పాలి. ఎంపీ నానితో సన్నిహితంగా ఉంటున్న ఆయన ఇప్పటి వరకు జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం ఒక్కసారి కూడా నిర్వహించలేకపోవడాన్ని బట్టి నెట్టెం నాయకత్వ సామర్థ్యం ఏపాటిదో తేటతెల్లమవుతోందనే వ్యాఖ్యానాలు లేకపోలేదు. చివరకు జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తాతయ్య సహకారం కూడా లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్టు దక్కించుకోవాలనే ఉద్దేశంతో తన బావమరిది టీడీ జనార్దన్‌తో కలిసి తాతయ్యకు రఘురాం చెక్ పెడుతున్నారని, అందులో భాగంగానే రామకృష్ణ (ఆర్కే)ను రంగంలోకి దింపారని గుర్తుచేస్తున్నారు. తక్కిన ఆరు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకుల నుంచి కనీస సహకారం కూడా లేదని అంటున్నారు. -
కృత్తివెన్ను తీరంలో డాల్ఫిన్ కళేబరాలు
సాక్షి, కృష్ణా కృత్తివెన్ను: కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలోని పెదగొల్లపాలెం బీచ్‌కి శుక్రవారం మూడు డాల్ఫిన్ కళేబరాలు కొట్టుకొచ్చాయి. సాధారణంగా మన సముద్ర జలాల్లో ఇవి చాలా అరుదుగా ఉంటాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. వీటిని సౌచాచైనెన్íÙస్ శాస్త్రీయనామం కలిగిన ఇండో ఫసిఫిక్ హంప్ బ్యాక్ డాల్ఫిన్లుగా పిలుస్తారు. ఇవి లోతైన ప్రాంతాలలో ఉండటానికి ఇష్టపడవు. తీరానికి దగ్గరగా ఉండటానికే మక్కువ చూపుతాయి. సాధారణ వేటగాడి వలకు కూడా చిక్కుతాయి. ప్రస్తుతం ఈ జాతి డాల్ఫిన్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇవి ఇండియన్ సముద్ర జలాల్లో అరుదుగా కనిపిస్తాయి. మనుషులతో మమేకమయ్యే డాల్ఫిన్లు క్షీరద జాతికి చెందినవి. గతంలో కూడా ఈ ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో డాల్ఫిన్లు వచ్చిన ఘటనలు ఉన్నాయి. -
హతవిధీ! ఇక్కడే ఇలా ఉంటే.. ఇతర జిల్లాల్లో మన పరిస్థితి ఏంటి?
సాక్షి, కృష్ణా: ‘జిల్లాలో పార్టీ పరిస్థితి ఇంతలా దిగజారిపోతుందని నేనస్సలు ఊహించనేలేదు. ఇక్కడ పార్టీ పరిస్థితి అయిపోయిందేమో అనిపిస్తోంది. ఇక్కడే ఇలా ఉంటే ఇక ఇతర జిల్లాల్లో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ ముఖ్య నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆవేదన, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ నాపై దాడి జరిగినా ఇంతేగా’ అంటూ వాపోయారనేది పార్టీ వర్గాల ద్వారా అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం. గన్నవరంలో కె.పట్టాభిరాం హల్చల్, పోలీసులపై దాడి తదితర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగిందని, తక్షణం గన్నవరానికి శ్రేణులను పెద్దఎత్తున తీసుకెళ్లండని ఆదేశించారు. ఎవరూ అంతగా స్పందించలేదని తెలుసుకున్న చంద్రబాబు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పలు సూచనలు చేసి ఆయనతోనూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహింపజేశారు. అయినా ముఖ్యులు ముఖం చాటేయడంతో అధినేత ఆగ్రహం కట్టలు తెంచుకుందని సీనియర్ నేత ఒకరు వివరించారు. కృష్ణాలోనే పార్టీ పరిస్థితి ఇలా తయారవుతుందని తాను ఊహించలేదని, ఇక్కడే ఇలా ఉంటే ఇతర జిల్లాల్లో ఇంకెలా ఉంటుందో మీరే ఆలోచించాలంటూనే.. ఇక్కడంతా అయిపోయిందని ఆవేదన వ్యక్తంచేయడంతో తామంతా మౌనం వహించిక తప్పలేదన్నారు. ఒకానొక దశలో మీరెందుకూ పనికిరారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. జిల్లా నాయకులకు కొంతకాలం పాటు అపాయింట్మెంట్ కూడా ఇవ్వొద్దని సంబంధితులను ఆదేశించారని సమాచారం. ఇంతలా మీరెందుకు ఉన్నారని ప్రశ్నించడంతో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తొలుత స్పందిస్తూ ప్రభుత్వ చర్యల వల్ల, పోలీసుల తీరుతో నాయకులు ఎవరూ బయటకు రావడంలేదని, కేసులకు భయపడుతున్నారని చెప్పుకొచ్చినట్లు తెలిసింది. గన్నవరంలో ముఖ్య నాయకులు అందుబాటులో లేకపోవడం, పార్టీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినమాట వాస్తవమేనని వివరించడంతో చంద్రబాబు కాస్త చల్లబడినట్లు మరో నాయకుడు అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కారణంగానే ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బాగా డిస్టర్బ్ అయ్యిందని బుద్దా వెంకన్న తనదైన శైలిలో వల్లెవేశారనేది సమాచారం. ఏది ఏమైనా గన్నవరం వెళ్లాలి కదా... గన్నవరంలో వరుస సంఘటనల తర్వాత మీరంతా వెళ్లండని చెప్పినా స్పందించకపోవడం తప్పేనని, నాయకులే ఉదాశీన వైఖరితో ఉంటే పార్టీ క్యాడర్, ప్రజలకు ఏం సందేశం వెళుతుందని చంద్రబాబు అనడంతో ఇకపై జాగ్రత్తగా ఉంటామని ముఖ్యులు చెప్పుకొచ్చారని తెలిసింది. పట్టాభి తప్పుడు వ్యవహారశైలి ఎవరికీ నచ్చకపోవడమే అసలు కారణమని ఆ తరువాత అంతర్గత చర్చల్లో వివరించారనేది సమాచారం. అయినా బోడె ప్రసాద్, రావి వెంకటేశ్వరరావు, మాగంటి బాబు, కేశినేని శివనాథ్ (చిన్ని), వెనిగండ్ల రాము తదితరులు వెళ్లారని కొనకళ్ల చెప్పుకొచ్చారు. కొల్లు రవీంద్ర, కేశినేని నాని, దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, బొండా ఉమాతో పాటు ఇతర నియోజకవర్గాల నాయకులూ ముఖం చాటేశారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చి హౌస్ అరెస్టు చేయాలని కోరినట్లు అధినేత దృష్టికి వెళ్లింది. ఆరోగ్యం బాగోలేదని పలువురు, జిల్లాలో లేమని మరికొందరు సాకులు వెతుకున్నారని చంద్రబాబుకు తెలిసింది. చివరకు గన్నవరం నేతలూ.. చివరకు గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండల పార్టీ నాయకులు, ఇతర సీనియర్లు కూడా అటువైపు రాకపోవడంతో చంద్రబాబుకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ వాస్తవ పరిస్థితిపై మరింత అవగాహన వచ్చిందని సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు బాబు వెన్నంటి.. టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యులకు తలంటడంతో ఎట్టకేలకు శుక్రవారం చంద్రబాబుతో పాటు గన్నవరం పర్యటనలో కృష్ణా, ఎనీ్టఆర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు కొనకళ్ల, నెట్టెం రఘురాం, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య, రావి వెంకటరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: బాలకృష్ణ డైలాగులు రాసిస్తే లోకేష్ చెప్తున్నారు: జోగి రమేష్ -
నా చావుకు కారణం వారే.. పిన్ని వాయిస్ రికార్డ్ బయట పెట్టడంతో..
కృష్ణా (కంకిపాడు): పిన్ని వరుస అయ్యే మహిళ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయటంతో యువకుడిని విచారణకు పిలిచిన పోలీసులు అతడిని కొట్టడం, దూషించటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో కలకలం రేపింది. కంకిపాడు చెందిన రాజులపాటి అరవింద్ (25) ఉద్యోగ అన్వేషణలో బెంగళూరులో ఉంటున్నాడు. పోలీసుస్టేషన్‌కు ఎదురుగా ఉన్న నివాసాల్లో తన తల్లిదండ్రులు, పక్కనే బాబాయ్ పిన్ని వాళ్ల ఇళ్లు ఉన్నాయి. రెండు రోజుల క్రితం తల్లికి, పిన్నికి మధ్య గొడవ జరగటంతో విషయం తెలుసుకున్న అరవింద్ తన వద్ద పిన్నికి సంబంధించి బయటి వ్యక్తులతో మాట్లాడిన వాయిస్ రికార్డులను తమ్ముడికి ఫోన్లో పంపాడు. ఈ విషయమై పిన్నిని ఆమె కొడుకు నిలదీశాడు. గతం నుంచి వాయిస్ రికార్డుల పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అరవింద్‌పై పిన్ని స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ నిమిత్తం అరవింద్‌ను పిలవటంతో గురువారం కంకిపాడుకు వచ్చాడు. పోలీసుస్టేషన్‌కు విచారణకు వెళ్లి తిరిగి వచ్చిన అరవింద్ శుక్రవారం తన నివాసంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొట్టి, తిట్టారు...బతుకు మీద ఆశ చచ్చిపోయింది ‘కొన్నేళ్లుగా పిన్ని మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. నా వద్ద ఉన్న వాయిస్ రికార్డులను తమ్ముడికి పంపితే తల్లిని మార్చుకుంటాడని భావించాను. ఆరేళ్లుగా మాట్లాడని వ్యక్తిని నేను ఎలా వేధింపులకు గురిచేస్తాను. పిన్ని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. విచారణకు పిలిచి ఓ కానిస్టేబుల్ కొట్టిన దెబ్బలకు, తిట్టిన తిట్లకు, బూతులకు బతకాలనే ఆశ చచ్చిపోయింది. నిందితుడికి మాట్లాడే అవకాశం ఇవ్వమని ఎస్ఐకి విన్నవిస్తున్నా. నా చావుకు కారణం, పిన్ని, కానిస్టేబుల్’ అని రాసిన సూసైడ్ నోట్ వెలుగుచూసింది. దీంతో పోలీసుల వ్యవహారం వివాదాస్పదం అయింది. చేతికి అందివస్తాడనుకున్న కొడుకు శవంగా మారటంతో మృతుడి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. పోలీసుస్టేషన్లో తప్పుడు ఫిర్యాదుచేసిన తోటికోడలు, విచారణ పేరుతో పిలిచి ఇష్టానుసారం కొట్టిన కానిస్టేబులే తమ కుమారుడి మృతికి కారణం అని ఆరోపిస్తున్నారు. -
అడ్డగోలు ఈఎంఐలు.. భర్తపై కోపంతో బలవన్మరణం
కృష్ణా (మచిలీపట్నం): ఇంట్లో వాయిదాల పద్ధతిపై కొనుగోలు చేసిన వస్తువుల కారణంగా ఏర్పడిన వివాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అనవసరమైన ఖర్చులు పెడుతూ పిల్లల భవిష్యత్తును గాలికి వదిలేస్తున్నాడంటూ భర్తపై కోపం తెచ్చుకున్న భార్య ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ నాగకళ్యాణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మచిలీపట్నం అరుణోదయకాలనీకి చెందిన రాగోలు సత్యవతి (25) అదే కాలనీకి చెందిన అశోక్‌బాబును ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం నారాయణపురంలో నివాసం ఉంటున్నారు. సజావుగా సాగిపోతున్న వీరి కాపురంలో ఈఎంఐలు కలతలు రేపాయి. భర్త ఇంట్లోకి అవసరమైన ఫ్రిజ్, వాషింగ్ మిషన్ తదితర వస్తువులను వాయిదాల పద్ధతిలో ఇటీవల కొనుగోలు చేశాడు. ప్రతి నెల వాయిదాలు చెల్లించటం కష్టంగా మారటంతో సత్యవతి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా అప్పులు చేసి వస్తువులు కొనుగోలు చేయటం మనకు అవసరమా అంటూ మందలించటం మొదలుపెట్టింది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుండగా బుధవారం తీవ్ర మనస్తాపానికి చెందిన సత్యవతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి తండ్రి రాజేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
అభివృద్ధి విపక్షాలకు కనబడటం లేదా?
మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి విపక్షాల కంటికి కనబడటం లేదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన కొడాలి నాని.. మ్యానిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేస్తున్న గొప్ప సీఎం జగన్ అని కొనియాడారు. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌పై మండిపడ్డారు నాని. ‘ మహానాడును చంద్రబాబు నవ్వులు పాలు చేశాడు. టీడీపీ నేతలకు చిన్న కర్మకు, పెద్ద కర్మకు తేడా తెలియదు. పనికిరాని దద్దమ్మ చంద్రబాబు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారు. లోకేష్ గెటప్‌కు సరిగ్గా సరిపోయే పేరు సిద్ధప్ప’ అని విమర్శించారు. -
ఒడ్డుకు రాగానే ఫోన్ చేస్తానన్నావు కదమ్మా!
కృష్ణా (మచిలీపట్నంటౌన్): సరదాగా బీచ్‌లో గడుపుదామని వచ్చిన విద్యార్థినులను రాకాసి అలలు మింగేశాయి. మచిలీపట్నానికి చెందిన కళ్లేపల్లి పూజిత (22), ఏలూరు జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన ప్రమీలారాణి జాస్మిన్(22), అదే మండలం గరగపర్రు గ్రామానికి చెందిన దత్తల ఆశాజ్యోతి భీమవరంలోని విష్ణు కాలేజీలో బీ–ఫార్మసీ చదువుతున్నారు. ఈ నెల 21వ తేదీతో ఫైనల్ ఇయర్ పరీక్షలు ముగియటంతో జాస్మిన్, ఆశాజ్యోతి కలసి స్నేహితురాలు పూజితతో మచిలీపట్నం వచ్చారు. పూజిత ఇంటి వద్ద ఆదివారం ఉల్లాసంగా గడిపారు. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో బీచ్‌కు చేరుకున్నారు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా రాకాసి అల దాడితో ముగ్గురూ నీళ్లలోకి వెళ్లిపోయారు. స్థానికులు వెంటనే గమనించి ఆశాజ్యోతిని రక్షించగలిగారు. పూజిత, జాస్మిన్లను మెరైన్ పోలీసులు గాలించి ఒడ్డుకు చేర్చినా, అప్పటికే వారిరువురు మృతి చెందారు. రూరల్ ఎస్ఐ జి.వాసు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను 108లో బందరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు పంచనామా నిర్వహించారు. ఒడ్డుకు రాగానే ఫోన్ చేస్తానన్నావు కదమ్మా! అమ్మా! నేను బీచ్‌లో స్నానానికి వెళుతున్నా.. ఒడ్డుకు రాగానే నేనే ఫోన్ చేస్తా... ఈలోపు నువ్వు చేయొద్దని చెప్పావు... సముద్రంలోకి వెళ్లి మాయ మైపోయావా అమ్మా..అంటూ జాస్మిన్ తల్లి కాకర్ల సుభాషిణి భోరున విలపించటం చూపరులను కలచివేసింది. జాస్మిన్ మృతి వార్త తెలిసిన ఆమె తల్లిదండ్రులు అగస్టీన్, సుభాషిణి, సోదరుడు రాజు హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. జాస్మిన్ తండ్రి పిప్పర లోని పెంతెకోస్తు చర్చి పాస్టర్. తల్లిదండ్రులిద్దరూ తమ కుమార్తెను తలుచుకుంటూ రోదించటం స్థానికులను కంట తడి పెట్టించింది. కానరాని లోకాలకు తరలిపోయావా తల్లీ! బీచ్‌లో తమ కుమార్తె పూజిత, ఆమె స్నేహితురాలు జాస్మిన్ మృతి చెందిన వార్త తెలుసుకున్న పూజిత తండ్రి కృష్ణవరప్రసాద్, తల్లి లక్ష్మి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కుప్పకూలిపోయారు. పూజిత మృతదేహంపై పడి భోరున విలపించారు. బందరు మండలం గుండుపాలెంకు చెందిన కృష్ణవరప్రసాద్ పది ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుమార్తెను చదివిస్తున్నారు. పెద్దకుమార్తెకు పెళ్లి చేశారు. కుమారుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. స్వగ్రామం గుండుపాలెం నుంచి కొన్నేళ్ల క్రితం నగరంలోని పరాసుపేటకు వచ్చి నివసిస్తున్నారు. శనివారం చివరి పరీక్ష కావటంతో కృష్ణవరప్రసాద్ భీమవరం కారు వేసుకుని వెళ్లి కుమార్తె పూజితతో పాటు ఆమె స్నేహితురాళ్లు జాస్మిన్, ఆశాజ్యోతిలను బందరు తీసుకువచ్చారు. జూన్ 1న కోయంబత్తూరు ఇంటర్వ్యూకు వెళ్లేవాళ్లం పూజిత, నేను జూన్ 1న కోయంబత్తూరుకు ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్లేవాళ్లం. మేమిద్దరం క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాం. ఈలోగా ఇలా జరిగింది. కలిసి ఆనందంగా గడిపిన మా ముగ్గురిలో ఇద్దరు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. – ఆశాజ్యోతి, మృత్యుంజయురాలు -
Jogi Ramesh: ముక్కు సూటితత్వం.. నిలదీసే లక్షణం..
ఎన్టీఆర్ జిల్లా: ముక్కు సూటితత్వం, ప్రశ్నించే గళం, నిలదీసే లక్షణం.. ఇవీ నాయకుడిగా జోగి రమేష్‌ను నిలబెట్టాయి. గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ బీసీల అభివృద్ధి కోసం జరిగిన ఉద్యమాల్లో ముందు నిలిచారు. కృష్ణా జిల్లా ( ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా) ఇబ్రహీంపట్నంలో 1970లో జోగి మోహనరావు, పుష్పవతి దంపతులకు పుట్టిన జోగి రమేష్ బీఎస్సీ చదువుకున్నారు. జోగి రమేష్‌కు భార్య - శకుంతల దేవి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు జోగి రమేష్. కృష్ణాజిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా, ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా వివిధ పదవుల్లో పని చేశాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కాగిత వెంకట్రావు పై 1192 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జోగి రమేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారు. 2019లో పెడన నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. టీడీపీ అభ్యర్ధి కాగిత కృష్ణప్రసాద్ పై 7839 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో జోగి రమేష్‌ను పలు మార్లు లక్ష్యంగా చేసుకుంది తెలుగుదేశం. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలపడానికి వెళ్లినప్పుడు జోగి రమేష్‌పై భౌతిక దాడికి ప్రయత్నించింది. ఆ ఘటనలో ఆయన కారును ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. -
కొండపల్లి బొమ్మ.. తరతరాల జ్ఞాపకం
‘కొండపల్లి కొయ్యబొమ్మ... కోటగట్టి కూచుందమ్మ...’ అని పాడుకోవడానికే కాదు.. కొండపల్లి బొమ్మ పాటకు తగ్గట్టే తరతరాలకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది కూడా. అమ్మకు చిన్నప్పుడు తిరునాళ్లలో తాతయ్య కొనిచ్చిన ‘అమ్మాయి– అబ్బాయి’ బొమ్మ ఉంటుంది. అన్నయ్య కొనిపించుకున్న ఎడ్లబండి అదే షెల్ఫ్‌లో చోటు చేసుకుంటుంది. నానమ్మ ముచ్చటపడి తెచ్చుకున్న దశావతారాల బొమ్మ ఉండనే ఉంటుంది. కొండపల్లి బొమ్మ ఒకసారి ఇంట్లో షోకేస్‌లోకి వచ్చిందంటే ఇక తరాలు మారినా ఆ బొమ్మ చెక్కు చెదరదు. బొమ్మ చెక్కు చెదరదు... కానీ ఇటీవల బొమ్మలు చేసే వాళ్లు కనుమరుగైపోతున్నారు. వందలాది కుటుంబాలు ఈ కళను కొనసాగించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయాయి. ఈ దశలో కళను బతికించుకోవడానికి, కళతోనే తమ బతుకును నిర్మించుకోవడానికి ముందుకు వచ్చారు మహిళలు. బావుదరి పట్టారు! నలభై ఏళ్ల కిందట కొండపల్లి కళాకారుల చేతిలో 84 రకాల కళాఖండాలు రూపుదిద్దుకునేవి. ఇప్పుడా సంఖ్య ఐదారుకు మించడం లేదు. ఈ కళ మీద ఆధారపడి ఉపాధి పొందే పరిస్థితులు సన్నగిల్లడంతో ఈ తరం యువకులు ఎవరూ ముందుకు రావడం లేదు. కళ అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదనే పరిస్థితి పదేళ్ల కిందటే మొదలైంది. ఈ దశలో మహిళలు ముందుకు వచ్చారు. ఇంతవరకు మగవాళ్లు బొమ్మలు చేస్తుంటే, మహిళలు ఆ బొమ్మలకు రంగులు వేయడం, ప్యాకింగ్ వంటి సహాయక బాధ్యతలకే పరిమితమయ్యారు. ఇప్పుడు మహిళలే కలప కొట్టడం, రంపంతో కోసి చిన్న దిమ్మలు చేయడం, ఆ దిమ్మలను కుంపటి మీద ఆరబెట్టడం నుంచి బొమ్మను చెక్కి రంగులు వేయడం వరకు అన్ని పనులూ చేస్తున్నారు. ‘ఈ బొమ్మల తయారీలో ఉపయోగించే మెటీరియల్ మొత్తం సహజమైనదే. చెట్ల బెరళ్లు, కాయల పై తొక్కలు, గింజల పొడులతో రంగులు తయారు చేస్తారు. ఈ కలప మెత్తగా ఉంటుంది. కాబట్టి పిల్లలు నోట్లో పెట్టుకున్నా, ఒకరి మీద ఒకరు విసురుకున్నా అంతగా దెబ్బ తగలదు. కాబట్టి స్కూల్ కిట్ల కోసం ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా మంచి డిమాండ్ రావచ్చ’ని ఆశాభావం వ్యక్తం చేశారు అభిహార స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు సుధారాణి. అంతర్జాతీయ వేదికల మీద మన కొండపల్లి బొమ్మలు కనిపించాలనేది ఆమె ఆకాంక్ష. ఇన్నాళ్లూ బావుదరికి దూరంగా ఉన్న మహిళలు ఇప్పుడు తమ కెరీర్‌ని స్వయంగా చెక్కుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల దృష్టి కార్లలో వేళ్లాడే నారింజ రంగు హనుమాన్ బొమ్మ మీద పడింది. కొండపల్లి హనుమాన్ రూపకల్పనలో మునిగిపోయారు. కార్లలో షోపీస్‌లుగా కొండపల్లి బొమ్మలు కనిపించే రోజు ఎంతో దూరం ఉండకపోవచ్చు. ఇప్పుడు మేమే చెక్కుతున్నాం! నేను ముప్పై ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు అన్ని పనులూ నేర్చుకున్నాను. కలపను ముక్కలు చేయడం, ఆరబెట్టడం వంటివి పది బొమ్మలకు సరిపడిన మెటీరియల్ ఒకేసారి సిద్ధం చేసుకుంటాం. ఆకారాలు చెక్కడం రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఈ బొమ్మల్లో మనిషి దేహం చెక్కేటప్పుడు పాదాల నుంచి తల వరకు ఒకే ముక్కలో చెక్కుతాం. చేతులను విడిగా చెక్కి అతికిస్తాం. ఆ తర్వాత తల మీద కిరీటం వంటి అలంకరణ చేసి రంగులు వేస్తాం. అడుగు ఎత్తున్న బొమ్మల జత ధర నాలుగు నుంచి ఆరువేలవుతుంది. మొదట్లో మేము లేపాక్షి హస్తకళల ఎంపోరియమ్‌కి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అభిహార సంస్థ వాళ్లు మాకు మరికొన్ని కొత్త వస్తువులు చేయడంలో కూడా శిక్షణ ఇస్తున్నారు. మేము చేసిన బొమ్మలను మార్కెట్ చేయడానికి వాళ్లకే ఇస్తున్నాం. ఇప్పుడు రోజూ పని ఉంటోంది. కొండపల్లి బొమ్మ చేయడానికి తెల్ల పొణికి చెక్క వాడతాం. ఎన్నేళ్లయినా ఈ చెక్కలో పగుళ్లు రావు. అందుకే బొమ్మలు కలకాలం అంత అందంగా ఉంటాయి. – చందూరి స్వరాజ్యం, కొండపల్లి బొమ్మల కళాకారిణి ‘చెక్క’ని విప్లవం కొండపల్లి బొమ్మల తయారీలో మహిళల శ్రమ చిన్నది కాదు. కానీ ఆ శ్రమ ప్రధాన బొమ్మ తయారీ కాకపోవడంతో వాళ్లకు ఆర్టిజాన్ గుర్తింపు కార్డు వచ్చేది కాదు. నాలుగు నెలల శిక్షణలో ఇప్పుడు మహిళలు ఎవరి సహాయమూ లేకుండా స్వయంగా బొమ్మ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మహిళలు కూడా హక్కుగా ఆర్టిజాన్ కార్డు పొందవచ్చు. ఇప్పటి వరకు మహిళలకు కళాకారులుగా గుర్తింపు లేకపోవడంతో కళాఖండాల ప్రదర్శన, కళాకారుల అవార్డుల విషయంలో మహిళలు కనిపించేవాళ్లు కాదు. ఇప్పుడు ఈ మహిళలు ఆ పరిధిని చెరిపివేశారు. – సుధారాణి, అభిహార సంస్థ నిర్వహకురాలు బొమ్మల బడి! కొండపల్లి బొమ్మలు చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ కళాకారుల చేతిలో చెక్క చక్కని బొమ్మగా ఎంత లాలిత్యంగా రూపుదిద్దుకుంటుందో వర్ణించడం సాధ్యం కాదు. ఇంత గొప్ప కళ అంతరించిపోతుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఆ కళ తరతరాలకు అందాలి, ఈ కళాకారులు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. అందుకే మాకు వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెడుతున్నాం. స్కూల్ కిట్‌కు ఐడియా ఇచ్చాం. ఆ కిట్‌లో తెలుగు, ఇంగ్లిష్ అక్షరమాల ఉంటాయి. అలాగే పిల్లలు లాయర్, టీచర్, డాక్టర్, రైతు, జాలరి వంటి వృత్తులను తెలుసుకోవడానికి వీలుగా ఆ బొమ్మలు చేయించాం. ఆఫీస్‌లో ఉపయోగించే ట్రే, పెన్ స్టాండ్, ఇళ్లలో ఉపయోగించే వస్తువులను కూడా ఈ మెటీరియల్‌తో చేయవచ్చు. ఇలాంటి మార్పును స్వాగతిస్తే కళాకారులకు చేతినిండా పని ఉంటుంది. ఈ కళాకారుల కోసం బీటూబీ మీటింగ్ వంటి మార్కెట్ వేదికల గురించి ఆలోచిస్తున్నాం. – విజయశారదారెడ్డి, వైస్ చైర్పర్సన్, ఏపీఎస్‌ఈఆర్‌ఎమ్‌సీ కొండపల్లి కృష్ణుడు నేను చేసిన తొలి బొమ్మ గోపికల మధ్య కృష్ణుడు. బావుదరి మీద పట్టు రావడానికి నెల రోజులు పట్టింది. అది వస్తే ఇక బొమ్మలు చేయడం ఏ మాత్రం కష్టం కాదు. మా బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి కావస్తోంది. తర్వాత బ్యాచ్‌కి మరో పది మంది సిద్ధంగా ఉన్నారు. – పద్మావతి వెన్నవల్లి, శిక్షణలో ఉన్న విద్యార్థి – వాకా మంజులారెడ్డి ఫొటోలు : ఎ. బాబు, సాక్షి, ఇబ్రహీంపట్నం -
AP: పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
-
51 ప్రాజెక్టులకు ముందడుగు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 1380 కిలోమీటర్ల పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు గురువారం శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు. మీ దార్శనికత, ముందుచూపు ఈ దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా చోటు దక్కించుకుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్స్ కార్యక్రమం మీరు చేస్తున్న అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయిలా చేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మీరు రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖలను అత్యంత నేర్పరితనంతో, వేగవంతంగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. పెరిగిన జాతీయ రహదారుల పొడవు మీ హయాంలో రహదారుల నిర్మాణం 2014లో రోజుకు 12 కిలోమీటర్ల స్ధాయి నుంచి ప్రస్తుతం మన మాట్లాడుకుంటున్నట్టు 37 కిలోమీటర్ల స్ధాయికి చేరుకుంది. మా రాష్ట్రంలో మీ సమర్ధవంతమైన పనుల వల్ల జాతీయరహదారుల పొడవు 2014లో ఉన్న 4193 కిలోమీటర్ల నుంచి 95 శాతం గ్రోత్ రేటుతో నేడు 8163 కిలోమీటర్లకు చేరింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 51 ప్రాజెక్టులు ముందడుగు కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మొత్తం 51 ప్రాజెక్టులకు సంబంధించి ముందడుగులు పడుతున్నాయి. ఇందులో రూ.10,400 కోట్ల వ్యయంతో నిర్మించిన 741 కిలోమీటర్ల పొడవైన 30 రహదారుల పనులకు శంకుస్ధాపనతో పాటు, ఇప్పటికే రూ.11,157 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన మరో 21 రహదారులను ఇవాళ ప్రారంభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీ గారికి, ప్రత్యేకించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద రద్దీను దృష్టిలో ఉంచుకుని మరో ఫ్లైఓవర్ నిర్మించాలని 2019 ఆగష్టులో నేను విజ్ఞప్తి చేశాను. ఆ మేరకు మంత్రి గడ్కరీ వెంటనే మంజూరు చేసి, 2020లోనే నిర్ణయం తీసుకుని,ఆ పై నిర్మాణ పనులు కూడా వేగవంతం చేసి.. ఆ ఫ్లైఓవర్‌ను కూడా గౌరవ కేంద్రమంత్రి ప్రారంభిస్తుండటం చాలా సంతోషం. గతంలో ఇదే విజయవాడలో 2019లో మనం అధికారంలోకి వచ్చేనాటికి కూడా పూర్తికాని బెంజ్ సర్కిల్లోని తూర్పున ఉన్న ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గడ్కరీ సహకారంతో వాయువేగంతో పూర్తి చేయగలిగామని సంతోషంగా చెపుతున్నాం. రూ.10,600 కోట్లతో పనులు రాష్ట్రంలో జాతీయరహదారుల విస్తరణ, అభివృద్ది, నిర్మాణంలో వీటి అన్నింటికి సంబంధించి అత్యంత చొరవతో మన ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. భూసేకరణతో పాటు ఎక్కడ ఏ సమస్య కూడా తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ... రహదారుల నిర్మాణం వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు మనం తీసుకుంటున్నాం. ఇదే సందర్భంలో మరో విషయం కూడా చెప్పాలి. రాష్ట్రంలోని మిగిలిన రహదారులు అంటే.. జాతీయరహదారులు కాకుండా మిగిలిన రహదారులకు సంబంధించిన పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతంగా అడుగులు ముందుకేస్తోంది. ఇందుకోసం మనం రూ.10,600 కోట్లు కేటాయించాం. ఇప్పుడే ఆర్ అండ్ బి కార్యదర్శి కృష్ణబాబు ఆ రూ.10,600 కోట్లకు సంబంధించిన పనుల వివరాలన్నీ చెప్పారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కనెక్టవిటీ ప్రతి మండల కేంద్రం నుంచి కూడా జిల్లా కేంద్రం వరకు రెండు లైన్ల రోడ్లుగా మారుస్తూ... దాదాపుగా రూ.6,400 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. పూర్తిగా రోడ్లన్నీ కూడా రిపేర్లు, మెయింటైనెన్స్ చేయడం కోసం మాత్రమే మరో రూ.2300 ఖర్చు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న ప్రతి రోడ్డు పూర్తి చేసేందుకు మరో రూ.1700 కోట్లు ఖర్చుతో కలిపి రూ.10,600 కోట్లకు సంబంధించిన రహదారి పనులకు శ్రీకారం చుట్టాం. ఇందులో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఇక రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున మీరు చేసిన మంచి పనులన్నింటికీ కూడా ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి రాజకీయాలు లేకుండా ప్రజల మందుర మీకు మా సంతోషాన్ని, కృతజ్ఞతలూ తెలియజేస్తున్నాను. ఇవాళ మరికొన్ని రోడ్ల నిర్మాణం కూడా ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని విజ్ఞప్తి చేస్తూ.. మీ ఆమోదం కోసం కొన్ని ప్రతిపాదనలను మీ ముందు ఉంచుతున్నాను. మరికొన్ని ప్రతిపాదనలు విశాఖతీరంలో విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి– భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు రహదారి నిర్మాణం. రుషికొండ, భీమిలి కొండలను, సముద్ర తీరాన్ని తాకుతూ పర్యాటక రంగానికే వన్నె తెచ్చే విధంగా .. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు కనెక్ట్ చేసే విధంగా నేషనల్ హైవే 60ను కలుపూతూ 6 లేన్ల రహదారి చాలా అవసరం అని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే విజయవాడ తూర్పున బైపాస్... కృష్ణానదిపై వంతెన సహా దాదాపు 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణం అవసరం. నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఈ బైపాస్ చాలా అవసరం అవుతుంది. మీరు వెస్ట్రన్ బైపాస్కు శాంక్షన్ ఇచ్చారు, ఈస్ట్రన్ బైపాస్కు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధాన జాతీయ రహదారులు నగరం గుండా వెళ్తుండడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటికీ కూడా ఈ రెండు బైపాస్‌లు పరిష్కారమార్గాలవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జాతీయ రహదారులుగా.. అలాగే వైఎస్సార్ కడప జిల్లా భాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బెస్తవారిపేట రహదారి, పుంగనూరు నుంచి పులిచెర్ల మీదుగా చిన్నగొట్టికల్లు రహదారి, సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని రహదారి, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదుగా భద్రాచలం వరకు ఉన్న రహదారి.. వీటన్నింటినీ కూడా జాతీయ రహదారులగా గుర్తించి అభివృద్ది చేయాలని మనసారా కోరుతున్నాను. నిండుమనస్సుతో మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే తెలుగువారైన మన కిషన్ రెడ్డి గారు కూడా.. మన రాష్ట్ర అభివృద్ది కొరకు నాలుగడుగులు ఎప్పుడూ ముందుకు వేస్తూనే ఉన్నారు. ఆయన కూడా మరింత చొరవ చూపాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగా.. ఈ ప్రతిపాదనలన్నింటినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయరహదారుల శాఖకు పంపించాం. గడ్కరీ దయచేసి వీటన్నింటినీ పరిశీలించి, పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. మరోవైపు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటీవలే రాష్ట్ర రహదారులపై ఆర్ఓబీల నిర్మాణాలకు సంబంధించి కేంద్రం అడిగిన 20 ప్రతిపాదనలు సిద్ధం చేశాం. దీనికి సంబంధించి కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నాం. వీటన్నింటితో పాటు మంచి చేస్తున్న మంచి వారికి ఎప్పుడూ మంచి జరగాలని ఆశిస్తూ.. కోరుకుంటూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా మనందరి ప్రభుత్వానికి కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, కె నారాయణస్వామి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ కార్యకర్తల బరితెగింపు !
కంచికచర్ల(కృష్ణా జిల్లా): వైఎస్సార్ సీపీ నాయకుల ఫ్లెక్సీను చింపేసిన సంఘటన సోమవారం గొట్టుముక్కల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ సర్పంచ్ గుదే రంగారావు, ఎంపీటీసీ సభ్యురాలు గుదే సరస్వతి వైఎస్సార్ సీపీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇది జీర్ణించుకోలేని ఆకతాయిలు రాత్రి వేళ ఫ్లెక్సీని చింపివేశారు. చదవండి: AP: బండారుపై తిరగబడ్డ జనం.. వెళ్లవయ్యా.. వెళ్లు! 2014లో గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు ఆలోకం కృష్ణారావును చిన్నపాటి వివాదానికి టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. గతంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావుపై టీడీపీ నాయకులు హత్య ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీని టీడీపీ నాయకులే ధ్వంసం చేసి ఉంటారని వైఎస్సార్ సీపీ నాయకులు భావిస్తున్నారు. -
టీడీపీ నేత దేవినేని దుష్ప్రచారం.. మండిపడ్డ గ్రామస్తులు
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. టీడీపీ నేత దేవినేని ఉమా తీరుపై అనాసాగరం గ్రామస్తులు మండిపడ్డారు. జగనన్న లేఅవుట్లో నీటమునిగాయని దుష్ప్రచారం చేసిన దేవినేనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని బూటకపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
విషాదం: ఒక్కసారిగా కృష్ణాలో దూకిన బీటెక్ విద్యార్థి
సాక్షి, తాడేపల్లి: స్నేహితులతోపాటు సరదాగా కృష్ణానదికి వచ్చిన బి.టెక్. విద్యార్థి అనంత లోకాలకు వెళ్లడంతో స్నేహితులు, విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ కృష్ణలంకకు చెందిన బి.టెక్ 4వ సంవత్సరం చదివే సాయి (20), అవినాష్ అనే స్నేహితుడు, మరో ఐదుగురితో కలిసి ఉండవల్లి-అమరావతి కరకట్ట వెంట ఉన్న ఆక్వా డెవిల్స్‌లోకి ఈతకు వెళ్లారు. అవినాష్, మరో ఐదుగురు కృష్ణానదిలోకి దిగి ఈత కొడుతుండగా సాయి గట్టు మీద నుంచొని ఉన్నాడు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ స్నేహితులు ఈత కొట్టడం చూసి ఒక్కసారిగా గట్టు మీద నుంచి కృష్ణానది నీటిలోకి దూకాడు. దూకిన సాయి మునిగిపోయి కనిపించకపోవడంతో ఆక్వా డెవిల్స్ సిబ్బంది వెదికి, బయటకు తీయగా సాయి మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సాయి తల్లిదండ్రులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. సాయి మృతదేహాన్ని స్నేహితులు విజయవాడ తీసుకువెళ్లారు. సాయి వారి తల్లిదండ్రులకు ఏకైక కుమారుడిగా తెలియవచ్చింది. నలుగురు జూదరుల అరెస్ట్ చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కొత్తూరు తాడేపల్లిలో పేకాట ఆడుతున్న నలుగురిని కొత్తపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు తాడేపల్లిలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో సెక్టార్ ఎస్ఐ శేఖర్‌బాబు పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి రూ. 28 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. శానిటైజర్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు చిట్టినగర్: నిబంధనలకు విరుద్దంగా శానిటైజర్లు విక్రయిస్తున్న వ్యక్తిని కొత్తపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కొత్తపేటకు చెందిన పి. మురళి కొంతకాలంగా శానిటైజర్‌ను చిన్నచిన్న బాటిల్స్‌గా చేసి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న సెక్టార్ ఎస్ఐ విశ్వనాథ్ నిందితుడిని అరెస్టు చేసి 80 బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం చిట్టినగర్: పాముల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు కాలువలో ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. కాలువలో సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి నీటిలో కనిపించడంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. గొల్లపూడిలో టీడీపీ కోట బీటలు వారుతుంది. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. సీఎం పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సమక్షంలో వైఎస్సార్సీపీలోకి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రామ్మోహనరావు చేరారు. టీడీపీ కార్యకర్తలు, మండలస్థాయి నేతలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సీఎం పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగామ సురేష్‌లు పార్డీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే వైఎస్సార్సీపీలోకి ఆరుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థి చేరారు. తాజాగా ఉమా అనుచరుడు, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కోమటి రామ్మోహనరావు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వైఎస్సార్సీపీలోకి టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వరుస చేరికలతో గొల్లపూడిలో టీడీపీ జవసత్వాలు కోల్పోతుంది. చదవండి: నమ్మించి నట్టేట ముంచారు.. టీడీపీ ఎమ్మెల్యేపై గుస్సా ఏపీ: బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన గవర్నర్ -
వాకింగ్ స్ట్రీట్: డీసెంట్ రోడ్డు.. !
సాక్షి, అమరావతి: విజయవాడలోని బీసెంట్ రోడ్డు.. ఈ పేరు వినగానే కిటకిటలాడే దుకాణాలు గుర్తుకొస్తాయి. భిన్న రకాల వస్త్రాలు, వస్తువులు అందుబాటు ధరల్లో ఇక్కడ లభిస్తాయి. ప్రస్తుతం దానికి కొత్తరూపును తీసుకొచ్చేందుకు నగర పాలక సంస్థ సిద్ధమైంది. సుందరంగా తీర్చిదిద్దటంతో పాటు కేవలం ఈ రహదారిని పాదచారులే వినియోగించేలా మార్చబోతున్నారు. రూ. 25.84 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ 200కు పైగా శాశ్వత దుకాణాలు, 150కిపైగా తోపుడుబండ్లు్ల, చిరు వ్యాపారులున్నారు. ప్రస్తుతం బీసెంట్‌రోడ్డులో భవనాల మధ్య ఉన్న పాతకాలం నాటి చెట్లు తప్ప పచ్చదనం మచ్చుకు కూడా కనిపించదు. ఈ పరిస్థితిలో పూర్తి మార్పు తీసుకురానున్నారు. హరిత వర్ణం శోభిల్లేలా రోడ్డుకు రెండు వైపులా మొక్కలు నాటనున్నారు. పాదచారులకు ఆహ్లాదం కలిగించేలా వివిధ రకాల మొక్కల్ని పెంచనున్నారు. వాహనాలు తిరిగే అవకాశంలేని నేపథ్యంలో రోడ్డంతా సీసీ కబుల్ స్టోన్(టైల్స్)తో అమర్చాలని నిర్ణయించారు. నడకకు ఇబ్బంది కలిగించని, జారుడు లేని వాటిని అమర్చుతారు. చూడగానే ఆకట్టుకునేలా భిన్న డిజైన్లను ఎంచుకోనున్నారు. భూగర్భంలో తీగలు.. బీసెంట్ రోడ్డులో వెళ్తూ తలపైకెత్తి చూస్తే వివిధ రకాల తీగలు సాలీడు గూళ్లను తలపిస్తుంటాయి. కొన్ని చేతికందే ఎత్తులోనూ ప్రమాదకరంగా వేలాడుతుంటాయి. విద్యుత్ తీగలు, కేబుల్వైర్లతో గందరగోళంగా ఉంటుంది. అవన్నీ ఇక మన కంటికి కనిపించవు. కొత్త ప్రణాళిక ప్రకారం తీగలన్నింటినీ భూగర్భంలోకి మార్చుతారు. ఎక్కడా బయటకు కనిపించవు. షాపులు.. బోర్డులు ప్రస్తుతం ఉన్న దుకాణాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని ముందుకు, మరికొన్ని రోడ్డుపైకి చొచ్చుకొచ్చాయి. ఒక్కో చోట ఒక్కో రకంగా ఉన్నాయి. వాటని్నంటినీ క్రమపద్ధతిలోకి తీసుకురానున్నారు. మొదటి నుంచి చివరి వరకు రోడ్డు పక్కన నిర్దేశించిన స్థలం నుంచే ప్రారంభమవుతాయి. ఒకే వరుసలో కనిపిస్తా యి. అదే క్రమంలో బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నా రు. రంగులు, అక్షరాలు తదితరమైనవి సమానంగా ఉండనున్నాయి. తద్వారా బీసెంట్‌రోడ్డు ప్రత్యేకతను సంతరించుకుంటుందని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చెబుతున్నారు. బీసెంట్ రోడ్డులో ఏర్పాటు చేయనున్న తోపుడుబండ్ల నమూనా చిత్రమిది తోపుడు బండ్లకు ప్రాధాన్యం.. ప్రస్తుతం బీసెంట్ రోడ్డులో శాశ్వత దుకాణాలతో సమానంగా తోపుడుబండ్లుదర్శనమిస్తాయి. నడకదారి పక్కనున్న చిరు వ్యాపారులు వాటికి తోడవుతున్నారు. వెరసి రహదారి సగానికిపైగా వాహన, పాదచారులకు అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తోపుడుబండ్లను కూడా క్రమబద్ధీకరించబోతున్నారు. రోడ్డంతా కాకుండా కొన్ని ప్రాంతాల్ని నిర్దేశించనున్నారు. ఒకే విధంగా ఉండేలా ప్రత్యేక డిజైన్‌తో ఆకట్టుకునేలా సిద్ధం చేయబోతున్నారు. పార్కింగ్‌కు ప్రత్యేకం.. వాహనాలు ఎక్కపడితే అక్కడ నిలుపుతుండటంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. ముందుకెళ్లేందుకు పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించనున్నారు. అన్ని రకాల వాహనాలు అక్కడికే తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆక్రమణల తొలగింపు.. ప్రస్తుతం ఉన్న రోడ్డు చాలా ఇరుకుగా ఉంటోంది. దుకాణదారులు రహదారిని ఆక్రమించేశారు. చిరు వ్యాపారులు, తోపుడుబండ్లతో మరింత ఇరుగ్గా మారింది. పండుగలు, ఇతర శుభ సందర్భాల్లో అడుగు వేయాలంటేనే కష్టతరంగా ఉంటోంది. ఆక్రమణలు తొలగించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా సాఫీగా సాగేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. -
నిమ్మగడ్డ ఓ అజ్ఞాతవాసి: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు లేఖలకు స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరని తెలిపారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా హుందాగా ఉండాలని హితవు పలికారు. ఒకవైపు కోవిడ్ కేసుల తీవ్రత ఉన్నా ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకమని విమర్శించారు. హైదరాబాద్‌లో కూర్చొనే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్ అని సెటైర్ వేశారు. జూమ్ బాబుతో చేతులు కలిపి ప్రజలకు నష్టం కలిగించేలా, ఎన్నికలు నిర్వహిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చదవండి: (ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ప్రజాహితం కాదు: ఏపీ సీఎస్) -
త్వరలో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
సాక్షి, విజయవాడ: ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'స్థానికంగా ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి కలగడంతో పాటు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడేది సచివాలయ వ్యవస్థ. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయాలలో అన్ని కార్యక్రమాలను అమలు చేయనున్నాం. త్వరలో గ్రామ సచివాలయాల పరిధిలోనే భూమి రిజిస్ట్రేషన్లు ప్రక్రియను ప్రారంభిస్తాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం. ఇది రాబోయే రోజుల్లో దేశానికి ఆదర్శంగా ఉంటుంది. (ప్రధాని ప్రశంసలు సైతం దక్కాయి: దేవినేని అవినాష్) ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పటం, దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ దిశగా ఆలోచన చెయ్యాలని చెప్పటం మనకు గర్వకారణం. గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బందికి ప్రతి మూడు నెలలకు పరీక్ష పెట్టి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చెయ్యనున్నట్లు మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (మహాత్ముని అడుగుజాడల్లోనే..) -
విజయవాడలో కుండపోత వర్షాలు
సాక్షి, విజయవాడ: నగరంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వాన నీటితో జలమయమైన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దాంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సైలెన్సర్లలోకి నీళ్లు వెళ్లటంతో ఆటోలు, బైక్‌లు మొరాయిస్తున్నాయి. వన్‌టౌన్‌లోని కొన్ని ప్రాంతల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చేసింది. ఈ ప్రాంతంలోని గణపతి రావు రోడ్, గాంధీబొమ్మ సెంటర్, మహాలక్ష్మి టెంపుల్ స్ట్రీట్, నైజం గేట్ సెంటర్ రోడ్లు జలమయం అయ్యాయి. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడతో పాటు కృష్ణాజిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. -
కరోనా: ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారు వేగంగా కోలుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ రికవరీ రేటు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 140 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనాను జయించిన వారు వాళ్ల సొంత ఇళ్లకు వెళుతున్నారు. జిల్లాలవారిగా పరిశీలిస్తే.. కృష్ణాలో 61, కర్నూలులో 39, చిత్తూరులో 20, అనంతపురంలో 10, తూర్పుగోదావరిలో 4, ప్రకాశం, పశ్చిమ గోదావరిజిల్లాలో ఇద్దరు, వైఎస్సార్ కడప, గుంటూరులో ఒక్కొక్కరు డిశ్చార్జ్ అయ్యారు.(ఏపీలో కొత్తగా 60 కరోనా కేసులు..) ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 729 మంది కరోనా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. దేశ సగటు కంటే అధికంగా డిశ్చార్జ్ రేటు ఏపీలో నమోదు అవుతోంది. గత 24 గంటల్లో 7,782 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 60 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గుజరాత్ నుంచి వచ్చిన 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయటంలో ఏపీ.. దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు లక్షా 41వేల 274 మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. -
సింగ్‌నగర్‌లో మరో కరోనా పాజిటివ్ కేసు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో మరో కరోనా పాజిటివ్ కేసు బుధవారం వెలుగులోకి వచ్చింది. సింగ్‌నగర్ గంగానమ్మగుడి సమీపంలో నివసిస్తున్న లారీ డ్రైవర్ కొంతకాలం క్రితం మహారాష్ట్ర వెళ్లి వారం రోజుల క్రితం అదే లారీలో నగరానికి చేరుకొని గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. వార్డ్ వాలంటీర్లు వివరాలు తెలుసుకునేందుకు వారి ఇంటికి వెళ్లినా విషయం చెప్పకుండా గోప్యంగా ఉంచాడు. అయితే రెండు రోజుల నుంచి లారీ డ్రైవర్ తల్లికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమె చుట్టుపక్కల ఉన్న హాస్పటల్స్‌కు వైద్య సేవలు కోసం వెళ్లగా అనుమానం వచ్చిన వారు గవర్నమెంట్ హాస్పటల్లో చూపించుకోమని సలహా ఇవ్వడంతో రెండు రోజుల క్రితం ప్రభుత్వ హాస్పటల్‌కు వెళ్లి టెస్ట్‌లు చేయించుకుంది. అయితే బుధవారం ఆమెకు కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లుగా రిపోర్టులు రావడంతో అధికార యంత్రాంగం అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వివరాలు విచారించగా ఆమె తన కొడుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన విషయాన్ని తెలిపింది. దీంతో పోలీసు, కార్పొరేషన్ అధికారులు ఆ నివాస చుట్టుపక్కల ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా మార్చారు. లారీ డ్రైవర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులను వైద్య పరీక్షలకు తరలించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, మలేరియా ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్ ఆయా చుట్టుపక్కల ప్రాంతమంతా బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్లను ముమ్మరంగా పిచికారీ చేయించి చర్యలు తీసుకున్నారు. అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు : జేసీ డాక్టర్ మాధవీలత సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్): జిల్లాలో నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత అన్నారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిత్యావసర వస్తువుల ధరల నిర్ణయాక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వర్తక, వాణిజ్య వ్యాపార వర్గాలతో నిత్యావసర వస్తువుల ధరలపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. జేసీ మాధవీలత మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ డీఎం కె.రాజ్యలక్షి్మ, మార్కెటింగ్ శాఖ డీడీ ఎం.దివాకరరావు, డీఎస్ఓ మోహన్‌బాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విద్యాధరరావు, ఆయిల్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లయ్య, కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు పాల్గొన్నారు. కళాశాలలకు మే 3 వరకు సెలవులు మచిలీపట్నం: కృష్ణా యూనివర్శిటీ అనుబంధ కళాశాలలు, పీజీ సెంటర్లుకు మే 3వ తేదీ వరకు సెలవులు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ కె.కృష్ణారెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పొడిగించినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా బుధ వారం సర్క్యులర్ జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. నేటి నుంచి విజయవాడలో నిషేధాజ్ఞలు అమలు భవానీపురం(విజయవాడ): విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం నుంచి సెక్షన్ 144 (2) సీఆర్పీసీ కింద నిషేధాజ్ఞలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నిషేదాజ్ఞలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. నేటి నుంచి మే నెల 31వ తేదీ వరకు అమలులో ఉండే ఈ నిషేదాజ్ఞల సమయంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు లేదా అంతకు మించి ఎక్కువ మంది జనం గుమికూడరాదని తెలిపారు. కర్రలు, రాళ్లు వంట వాటిని పట్టుకుని తిరగకూడదన్నారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కూచిపూడి క్వారంటైన్‌కు 13మంది తరలింపు కూచిపూడి(మొవ్వ): మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పటల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని బుధవారం తీసుకువచ్చినట్లు మొవ్వ మండల వైద్యాధికారి డాక్టర్ శొంటి శివ రామకృష్ణారావు తెలిపారు. వీరు పామర్రు నియోజకవర్గ పరిధిలోని పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి చెందిన వారని తెలిపారు. ఈ కుటుంబంతో సంబంధం కలిగిన ఓ యువకుడు ఢిల్లీ నుంచి రావటం, విజయవాడలో ఉంటున్న ఈ యువకుడికి ఈ నెల 13వ తేదీన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరగటం, ఈ నెల 4వ తేదీ వరకు ఆ యువకుడి తల్లి విజయవాడలో ఉండి, పింఛన్ కోసం బుధవారం యలమర్రు వచ్చినట్లు తెలిపారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కుటుంబాన్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు. -
ఈ ఎనిమిది రోజులు అత్యంత కీలకం
సాక్షి, కృష్ణా: కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో జిల్లాలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఈ ఎనిమిది రోజులు అత్యంత కీలకం కావడంతో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలని సూచిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన బాధితుల ప్రాంతాల్లో ఎవరినీ బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. బారికేడ్లతో రాకపోకలు నిలిపివేస్తున్నారు. డ్రోన్లతో రసాయన ద్రావణాలను పిచికారీ చేయిస్తున్నారు. వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నాయి. హాట్‌స్పాట్.. అంతా అలర్ట్ జిల్లాలో సోమవారం సాయంత్రానికి మొత్తం 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క విజయవాడ నగరంలో అత్యధికంగా 17 పాజిటివ్ కేసులు రావడం.. ముఖ్యంగా భవానీపురం, ఓల్డ్ రాజరాజేశ్వరీపేటలో ఈ ప్రభావం అధికంగా ఉండడంతో ఆ ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. బాధితుల నివాస ప్రాంతాల నుంచి కిలోమీటరు మేర ఎలాంటి రాకపోకలకు వీల్లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా.. ఇతరులెవరూ ఆ ప్రాంతానికి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను ఇళ్లకే అందిస్తున్నారు. సంబంధిత పరిధి వరకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని డ్రోన్లతో స్ప్రే చేయిస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత మెరుగుపరుస్తున్నారు. అలాగే కరోనా బాధితులున్న ప్రాంతాలను నిషేధిత ఏరియాలుగా పేర్కొంటూ వైద్యసిబ్బంది నోటీసులు అంటిస్తున్నారు. హోం క్వారంటైన్లపై డేగ కన్ను.. విదేశాల నుంచి జిల్లాలకు మొత్తం 2,443 మంది వచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడటంలో భాగంగా వీరిని గుర్తించి జిల్లా యంత్రాంగం ఇళ్లకే వారిని పరిమితం చేసింది. వారికి కావల్సిన సరుకులు అందజేసింది. వీరిలో 993 మందికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇది కొంత ఉపశమనం కలిగించే విషయం. వీరంతా 28 రోజుల పాటు గృహ నిర్బంధాన్ని పాటించారు. వీరు కాకుండా మిగిలిన 1,450 మంది గృహ నిర్బంధంలోనే ఉన్నారు. అయితే వీరేవరూ నిబంధనలను అతిక్రమించకుండా ఇంటి వద్దే ఉంటున్నారా? లేదా? అని ప్రతిరోజూ హోం క్వారంటైన్లలో ఉన్నవారి వివరాలపై ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఆరా తీస్తున్నారు. వీరు కాకుండా ప్రత్యేక బృందాలు కూడా వీరి కదలికలపై నిఘా ఉంచాయి. ఎప్పటికప్పుడు వీరి సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఆ బృంద సభ్యులు చేరవేస్తున్నారు. జిల్లాలో నియోజకవర్గ కేంద్రానికి ఒక్కటి చొప్పున 100 పడకల బెడ్లతో 16 క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడలో అదనంగా మరో మూడు క్వారంటైన్లను అందుబాటులో ఉంచారు. జిల్లాలో విజయవాడ, పెనమలూరు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, మచిలీపట్నం ప్రాంతాల్లో 29 పాజిటివ్ కేసులు నమోదు కావడం.. ఆ వెంటనే వారందరినీ ఐసోలేషన్‌కు తరలించడం జరిగింది. తర్వాత అప్రమత్తమైన అధికారులు పాజిటివ్ సోకిన బాధితుడికి కలిసిన కుటుంబ సభ్యులు, సన్నిహితులను 798 మందిని గుర్తించి వారందరినీ వివిధ క్వారంటైన్లకు తరలించారు. ప్రస్తుతం వారందరికీ అక్కడే వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆ క్వారంటైన్లను ఇకపై 100 మంది హౌస్ సర్జన్లు పర్యవేక్షించబోతున్నారు. ఇప్పటి వరకు కరోనా బాధితులను తరలించడానికి మూడు అంబులెన్సులు ఉండేవి. ఇప్పుడు మరో మూడు అంబులెన్సులను కూడా బాధితులకు సేలందించేందుకు సిద్ధం చేశారు. కఠినంగా కర్ఫ్యూ సాక్షి, మచిలీపట్నం: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. కరోనా పాజిటివ్‌గా నమోదైన వ్యక్తి మృతి చెందినట్టుగా ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో పాజిటివ్ కేసు వెలుగు చూసిన చిలకలపూడి చుట్టుపక్కల రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో కర్ఫ్యూ ఆరురోజుల పాటు కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నగరంలో ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినతరం చేశారు. ఈ ప్రాంతంలో ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మంత్రి పేర్ని నాని పర్యవేక్షణ.. హాట్‌స్పాట్ ప్రాంతంలో కర్ఫ్యూ అమలు తీరును రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఆర్డీఓ ఖాజావలి, డీఎస్పీ మహబూబ్ భాషాలు పర్యవేక్షించారు. మంత్రి నాని స్వయంగా హాట్‌స్పాట్ ప్రాంతంలో పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపారు. చిలకలపూడి, సర్కార్‌తోట, నవీన్మిట్టల్కాలనీల్లో పోలీస్ వాహనంలో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బందిని సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రెడ్ జోన్ పరిధిలో 8 వేల ఇళ్లున్నాయని, రానున్న ఆరు రోజులు ఏ ఒక్కరూ ఇళ్లు విడిచి బయటకు రావద్దని, మీకు కావాల్సిన కూరగాయలు, పాలు ఉదయం ఆరు నుంచి తొమ్మిది, సాయంత్రం ఐదు నుంచి ఏడుగంటల మధ్యలో మీ ఇళ్ల వద్దకే పంపిస్తామన్నారు. పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య, మున్సిపల్, రవాణా, ఆరీ్టసీ, ఎక్సైజ్, తదితర శాఖల సిబ్బందితో పాటు పాత్రికేయులు కూడా మిలటరీ సైనికుల్లా అవిశ్రాంతంగా కరోనా మహమ్మారిపై పోరాడుతున్నారంటూ కొనియాడారు. ఉదారత చాటుకోవాలి సూర్యారావుపేట: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరివిగా విరాళలు అందించేందుకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛంద సేవ సంస్థలు, దాతలు తమ దాతృత్వాన్ని చాటుకోవాలని కోరారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమమైనా విజయవంతం కాగలదన్నారు. ఇప్పటికే పలువురు దాతలు ముందుకు వచ్చి మేము సైతం అంటూ ఆర్థిక సహాయాన్ని అందించారని, వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. దాతలు నగదు, వస్తువు, నిత్యావసర సరుకుల రూపేణా విరాళాలు అందించవచ్చన్నారు. ఈ విరాళాలను చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్ ఏపీ), కలెక్టర్ పేరు మీద చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అందించవచ్చని వివరించారు. -
కరోనా వైరస్: ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ప్రాణాంతకమైన కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నామని విజయవాడ మున్సిపల్ శాఖ కమీషనర్ విజయ్ కుమార్ అన్నారు. ఆయన మీడియతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 96 శాతం ఇళ్లను సర్వే చేశామని వెల్లడించారు. 1.43 కోట్ల ఇళ్లు ఉంటే ఇప్పటికే 1.37 కోట్ల ఇళ్లల్లో సర్వే పూర్తైందన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంలు ఉన్నారని.. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ ఉన్నారని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి సర్వే చేశామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు. 2.80 లక్షల మంది వాలంటీర్లు, 1.18 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతి 2 వేల మందికి ఎక్కడా లేని విధంగా ఏఎన్ఎన్‌లు ఉన్నారని ఆయన తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 6,379 మంది వచ్చినట్టు కేంద్రం జాబితా విడుదల చేసిందని ఆయన అన్నారు. కానీ వాలంటీర్లు, ఆశ వర్కర్ల సర్వేలో మరో ఆరు వేల మంది విదేశాల నుంచి వచ్చినట్టు తేలిందని విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కి అన్ని పట్టణాల్లో, నగరాల్లో ప్రజలను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి ముందుగానే అన్ని చర్యలు చేపడుతున్నామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్)ను జయించాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. ఒక్క క్షణం ఆలోచించాలి అన్నారు. యువతీ యువకులైనా, వ్యాధి నిరోధక శక్తి ఉన్నా, ఎవరైనా సరే ఇంట్లోనే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ఉండకూడదని ఆయన తెలిపారు. ఎవరి నుంచైనా కోవిడ్-19 సంక్రమించవచ్చని జవహర్‌రెడ్డి సూచించారు. -
‘టీడీపీ పాలనలో ఇళ్లు ఇస్తామని మోసం’
సాక్షి, విజయవాడ: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర పాలక సంస్థ కమీషన్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారమే ప్రజలకు మౌలిక సదుపాయాలు, రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాల పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. నగరంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అంజాద్ బాషా పేర్కొన్నారు. 52వ డివిజన్లో రూ.13.5 కోట్లతో శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేలా సీఎం వైఎస్ జగన్ పాలన అందిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమనికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని అంజాద్ బాషా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 14వ ఆర్థిక కమీషన్ నుంచి రూ.140 కోట్లు, బడ్జెట్ నుంచి రూ. 25 కోట్లు, సీఎం వైఎస్ జగన్ డివిజన్ల అభివృద్ధికి కేటాయించిన రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రూ. 250 నుంచి రూ. 300 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ పాలనలో సెంట్రల్ నియోజకవర్గం నిర్లక్ష్యనికి గురైందని విమర్శించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సిప్ అనే సంస్థ పేరుతో శిలాఫలకాలు, కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేశారని మల్లాది విష్ణు అన్నారు. అన్ని డివిజన్లలోని త్రాగు నీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు 80శాతం ప్రజలకు చేరువ చేశామని గుర్తుచేశారు. టీడీపీ పాలనలో నియోజకవర్గంలో ఇళ్ళు ఇస్తామని 15 వేల మందిని మోసం చేశారని ఆయన మండిపడ్డారు. వేల మందికి కేవలం 600 ఇళ్లు చూపి.. ప్రజలను మోసం చేసారని ఆయన విమర్శించారు. వాటిలో రివర్స్ టెండరింగ్‌తో రూ. 25 కోట్లు ఆదాచేశామని ఆయన అన్నారు. టీడీపీ కార్పొరేటర్లు ఇళ్ల అప్లికేషన్లకు రూ. 25, రూ. 50 వేలకు అమ్ముకున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేశారని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. సీఎం జగన్ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థతో ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు మతి భ్రమించడంతో మొన్నటి వరకు ఈవీఎంలు అని.. ఇప్పుడు ఓటర్లు డబ్బులకు అమ్ముడు పోయారంటున్నారని దుయ్యబట్టారు. రాష్టంలోని అన్ని మున్సిపాలిటీలను గెలిచి ప్రజలకు జవాబుదారితనంగా తాము పాలన అందిస్తున్నట్లు నిరూపిస్తామన్నారు. అర కేజీ టమాటా, ఒక కేజీ బియ్యం ఇచ్చి ‘జై తెలుగుదేశం’అనిపించే దుస్థితికి టీడీపీ నాయకులు దిగజారారని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో మీరు అందించిన పాలన, ఎనిమిది నెలల్లో తాము అందించిన పాలనపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో 34,500 మందికి అమ్మఒడి ఇచ్చామని తెలిపారు. ఐదేళ్లలో ఇలాంటి కార్యక్రమం జరిగిందా అని ప్రశ్నించారు. 24 గంటలు అమరావతి పేరుతో అధికారులను ఫైల్స్ పట్టుకుని సచివాలయం చుట్టు తిరిగేలా చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం జగన్ ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేలా పాలన అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. సీఎం జగన్ సాచురేషన్ పద్ధతిలో అర్హులందిరికీ ఫలాలు అందేలా చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గంలో 35 వేలమంది ఇల్లు లేనివారిని గుర్తించామని తెలిపారు. అధికారం అడ్డం పెట్టుకుని ఐదేళ్లలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని విష్ణు విమర్శించారు. తన కోటరికే మేలు జరిగేలా పాలన అందించారని మండిపడ్డారు. ఐటీ దాడులే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. అమరావతి ఎక్కడికి తరలిపోదని.. శాసనసభ అమరావతిలోనే ఉంటుందన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దుష్పచారం చేస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు.