రూపుమారనున్న బీసెంట్‌రోడు నమూనా చిత్రం ఇది
సాక్షి, అమరావతి: విజయవాడలోని బీసెంట్ రోడ్డు.. ఈ పేరు వినగానే కిటకిటలాడే దుకాణాలు గుర్తుకొస్తాయి. భిన్న రకాల వస్త్రాలు, వస్తువులు అందుబాటు ధరల్లో ఇక్కడ లభిస్తాయి. ప్రస్తుతం దానికి కొత్తరూపును తీసుకొచ్చేందుకు నగర పాలక సంస్థ సిద్ధమైంది. సుందరంగా తీర్చిదిద్దటంతో పాటు కేవలం ఈ రహదారిని పాదచారులే వినియోగించేలా మార్చబోతున్నారు. రూ. 25.84 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ 200కు పైగా శాశ్వత దుకాణాలు, 150కిపైగా తోపుడుబండ్లు్ల, చిరు వ్యాపారులున్నారు.
- ప్రస్తుతం బీసెంట్‌రోడ్డులో భవనాల మధ్య ఉన్న పాతకాలం నాటి చెట్లు తప్ప పచ్చదనం మచ్చుకు కూడా కనిపించదు. ఈ పరిస్థితిలో పూర్తి మార్పు తీసుకురానున్నారు. హరిత వర్ణం శోభిల్లేలా రోడ్డుకు రెండు వైపులా మొక్కలు నాటనున్నారు. పాదచారులకు ఆహ్లాదం కలిగించేలా వివిధ రకాల మొక్కల్ని పెంచనున్నారు.
- వాహనాలు తిరిగే అవకాశంలేని నేపథ్యంలో రోడ్డంతా సీసీ కబుల్ స్టోన్(టైల్స్)తో అమర్చాలని నిర్ణయించారు. నడకకు ఇబ్బంది కలిగించని, జారుడు లేని వాటిని అమర్చుతారు. చూడగానే ఆకట్టుకునేలా భిన్న డిజైన్లను ఎంచుకోనున్నారు.
భూగర్భంలో తీగలు..
- బీసెంట్ రోడ్డులో వెళ్తూ తలపైకెత్తి చూస్తే వివిధ రకాల తీగలు సాలీడు గూళ్లను తలపిస్తుంటాయి. కొన్ని చేతికందే ఎత్తులోనూ ప్రమాదకరంగా వేలాడుతుంటాయి. విద్యుత్ తీగలు, కేబుల్‌వైర్లతో గందరగోళంగా ఉంటుంది. అవన్నీ ఇక మన కంటికి కనిపించవు. కొత్త ప్రణాళిక ప్రకారం తీగలన్నింటినీ భూగర్భంలోకి మార్చుతారు. ఎక్కడా బయటకు కనిపించవు.
షాపులు.. బోర్డులు
- ప్రస్తుతం ఉన్న దుకాణాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని ముందుకు, మరికొన్ని రోడ్డుపైకి చొచ్చుకొచ్చాయి. ఒక్కో చోట ఒక్కో రకంగా ఉన్నాయి. వాటని్నంటినీ క్రమపద్ధతిలోకి తీసుకురానున్నారు.
- మొదటి నుంచి చివరి వరకు రోడ్డు పక్కన నిర్దేశించిన స్థలం నుంచే ప్రారంభమవుతాయి. ఒకే వరుసలో కనిపిస్తా యి. అదే క్రమంలో బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నా రు. రంగులు, అక్షరాలు తదితరమైనవి సమానంగా ఉండనున్నాయి. తద్వారా బీసెంట్‌రోడ్డు ప్రత్యేకతను సంతరించుకుంటుందని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చెబుతున్నారు.
బీసెంట్ రోడ్డులో ఏర్పాటు చేయనున్న తోపుడుబండ్ల నమూనా చిత్రమిది
తోపుడు బండ్లకు ప్రాధాన్యం..
- ప్రస్తుతం బీసెంట్ రోడ్డులో శాశ్వత దుకాణాలతో సమానంగా తోపుడుబండ్లుదర్శనమిస్తాయి. నడకదారి పక్కనున్న చిరు వ్యాపారులు వాటికి తోడవుతున్నారు. వెరసి రహదారి సగానికిపైగా వాహన, పాదచారులకు అందుబాటులో లేకుండా పోయింది.
- ఈ నేపథ్యంలో తోపుడుబండ్లను కూడా క్రమబద్ధీకరించబోతున్నారు. రోడ్డంతా కాకుండా కొన్ని ప్రాంతాల్ని నిర్దేశించనున్నారు. ఒకే విధంగా ఉండేలా ప్రత్యేక డిజైన్‌తో ఆకట్టుకునేలా సిద్ధం చేయబోతున్నారు.
పార్కింగ్‌కు ప్రత్యేకం..
- వాహనాలు ఎక్కపడితే అక్కడ నిలుపుతుండటంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. ముందుకెళ్లేందుకు పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించనున్నారు. అన్ని రకాల వాహనాలు అక్కడికే తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఆక్రమణల తొలగింపు..
- ప్రస్తుతం ఉన్న రోడ్డు చాలా ఇరుకుగా ఉంటోంది. దుకాణదారులు రహదారిని ఆక్రమించేశారు. చిరు వ్యాపారులు, తోపుడుబండ్లతో మరింత ఇరుగ్గా మారింది.
- పండుగలు, ఇతర శుభ సందర్భాల్లో అడుగు వేయాలంటేనే కష్టతరంగా ఉంటోంది. ఆక్రమణలు తొలగించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా సాఫీగా సాగేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment