‘చంద్రబాబు వస్తున్నారు మీరంతా వచ్చేయండి’ అని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) బృందం భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది.
‘సార్ (బాబు) మీరు ఇటువైపు రావద్దు. మీరొస్తే వాళ్లు ఎక్కువగా చెప్పుకుంటారు’ అని కేశినేని శివనాథ్ (చిన్ని) బృందం గట్టిగా కోరింది.
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ నగరంలోని భవానీపురం ఈద్గా గ్రౌండ్స్‌లో ఆదివారం ఎం.కె.బేగ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు నేపథ్యంలో విజయవాడ లోక్‌సభ పరిధిలోని నాయకుల మధ్య జరిగిన వ్యవహారమిది. ఇఫ్తార్ విందుకు హాజరవ్వాలా? వద్దా? అనే తర్జనభర్జనలో చివరకు చంద్రబాబునాయుడు ఆగిపోయారు. కేశినేని నాని బృందం, చిన్ని వర్గాల మధ్య రాజకీయ పోరు ఎలాగున్నా చంద్రబాబు పరిస్థితి మాత్రం హే కృష్ణా! అని తలపట్టుకోక తప్పడంలేదు. పూర్వపు కృష్ణా జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని సీనియర్లు ఆందో ళన చెందుతుండగా పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఆవేదనకు లోనవుతున్నారు.
అవకాశ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రత్యేక గుర్తింపున్న.. సమయానుకూలంగా నాయకుల మధ్య వర్గాలను రాజేసి అవసరాలకు వాడుకుని వదిలేస్తారనే పేరున్న చంద్రబాబుకు ఉమ్మడి కృష్ణాలో తలపోటు తీవ్రత పెరిగిపోతోంది. ఎంతలా అంటే విజయవాడలో ఏర్పాటుచేసిన ఇప్తార్ విందుకు హాజరుకాలేనంత. ఓ వర్గం రా ర మ్మని ఆహ్వానిస్తే.. మరో వర్గం రావద్దు పో పొమ్మని పోరుపెట్టింది. గడచిన రెండేళ్లుగా పార్టీ పరంగా ఇఫ్తార్ విందుకు దూరంగా ఉంటున్న నాయకులు మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకున్నారు. విజయవాడ వెస్ట్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంపీ నాని పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని, మీరంతా రావాలని ఎన్టీఆర్ జిల్లా లోని తన వర్గీయులను ఆహ్వానించారు. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎంఎస్ బేగ్ తదితరులతోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న నాని సోదరుడు కేశినేని చిన్ని, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తదితరులు ఇఫ్తార్ విందులో పాల్గొనవద్దని గట్టిగా మొరపెట్టుకోవడంతో బాబు అటువైపు రాలేదు. గతంలో పలుసార్లు ఇఫ్తార్‌కు హాజరైన బాబు ఇప్పుడు రాకపోవడమంటే తమకు ప్రాధాన్యమిచ్చినట్లేనని చిన్ని, బుద్దా, మీరా చెప్పుకుంటున్నారని నగరానికి చెందిన సీనియర్ నాయకులు పేర్కొన్నారు.
ఎవరికి వారే యమునా తీరే...
మైలవరం నియోజకవర్గం పరిధిలోని గొల్లపూడికి చెందిన బొమ్మసాని సుబ్బారావు ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేసి మాజీ మంత్రి దేవినేని ఉమా పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఉమా అభ్యర్థి అయితే ఓటమి తప్పదని నియోజవర్గానికి చెందిన పలువురు ముఖ్యనాయకులు బాహాటంగానే చెబుతున్నారు. తిరువూరులో మూడుముక్కలాటగా మునెయ్య, దేవదత్తు, స్వామిదాసు మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా మునెయ్య కేశినేనికి దూరమయ్యారు. నందిగామలోనూ అంతకన్నా తీసికట్టుగా తయారైంది. తంగిరాల సౌమ్యకు ప్రత్యామ్నాయం అంటూ జీవరత్నంను నాని ప్రోత్సహిస్తున్నారని, ఇతనికి గన్నే ప్రసాద్ (అన్న) కూడా జతయ్యారని పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. తూర్పులో అభ్యర్థి మార్పు తప్పదని, గద్దె ప్రయాణం గన్నవరమేనని విశ్లేషణలు కొనసాగుతున్నాయి. బొండా ఉమా పరిస్థితి కూడా దాదాపు అంతేనంటున్నారు.
కొనకళ్ల కింకర్తవ్యం
కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు పరిస్థితిపైనా పార్టీలో చర్చ నడుస్తోంది. పార్టీల మధ్య పొత్తులు కుదిరితే మచిలీపట్నం లోక్‌సభ స్థానాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుందని, అందువల్ల పెడన టికెట్‌ను నారాయణరావు ఆశించవచ్చంటున్నారు. మాజీ మంత్రి కాగిత వెంకట్రావు కుమారుడు అక్కడి టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. గన్నవరం నియోజకవర్గం విషయంలో టీడీపీకి తలపోటు తీరడంలేదు. బచ్చుల అర్జునుడుతో రాజకీయం నడిపిన అధిష్ఠానానికి ఆయన మృతితో ఇప్పుడు అక్కడెవరన్నది ప్రశ్నగా మిగిలింది. గుడివాడలో రావి, పిన్నమనేని టికెట్టు ఆశిస్తుండగా వెనిగండ్ల రామును రంగంలోకి దింపారు. ఇక్కడా ముగ్గురిమధ్య పోటీ కొనసాగుతోంది. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్‌కు ఎప్పుడైనా చెక్ పెట్టే పరిస్థితే. ఇక్కడా పార్టీల మధ్య పొత్తులు కుదిరితే టీడీపీ అభ్యర్థి టికెట్‌కు ప్రమాదం పొంచి ఉన్నట్లే. పెనమలూరుపై ముఖ్యుల కన్ను ఎప్పుడూ ఉండనే ఉంది. వర్ల రామయ్య కుమారుడికి పామర్రు సీటు అంటున్నప్పటికీ సామాజికవర్గ సర్దుబాట్ల ప్రశ్న ఉత్పన్నమవుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘మా అధినేత పార్టీ నేతల మధ్య విభేదాలు రాజేయడం, వాటిని ఆయనే చివరి వరకు పెంచి పోషిస్తుండటం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన అన్ని నియోజకవర్గాల్లోనూ ఇబ్బందులు తామరతంపర్లా కొనసాగుతున్నాయి. ఇవి నానాటికీ ఇంకా పెరిగిపోయేవే తప్ప ఏమాత్రం తగ్గేవి కావు. ఇఫ్తార్ విందుకు వెళ్లవద్దు అనేంతగా విభేదాలు ముదిరిపోయాయంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. బాగా పట్టుందనే భావించే ఇక్కడే ఇలా ఉంటే ఇక ఇతర జిల్లాల్లో పరిస్థితి ఏంటో’ అని విజయవాడకు చెందిన సీనియర్ నేత నిట్టూర్చడం పరిశీలనాంశం.
నెట్టెం నెట్టుకొచ్చేదెలా?
ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన నెట్టెం రఘురాంకు సహకరించే నియోజకవర్గ ఇన్‌చార్జులు దాదాపు ఎవరూలేరనే చెప్పాలి. ఎంపీ నానితో సన్నిహితంగా ఉంటున్న ఆయన ఇప్పటి వరకు జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం ఒక్కసారి కూడా నిర్వహించలేకపోవడాన్ని బట్టి నెట్టెం నాయకత్వ సామర్థ్యం ఏపాటిదో తేటతెల్లమవుతోందనే వ్యాఖ్యానాలు లేకపోలేదు. చివరకు జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తాతయ్య సహకారం కూడా లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్టు దక్కించుకోవాలనే ఉద్దేశంతో తన బావమరిది టీడీ జనార్దన్‌తో కలిసి తాతయ్యకు రఘురాం చెక్ పెడుతున్నారని, అందులో భాగంగానే రామకృష్ణ (ఆర్‌కే)ను రంగంలోకి దింపారని గుర్తుచేస్తున్నారు. తక్కిన ఆరు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకుల నుంచి కనీస సహకారం కూడా లేదని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment