సాక్షి, అమరావతి: పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు. త్వరగా ఇళ్లను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ.4500 కోట్లు ఖర్చుచేశామని, ఇంకా కనీసంగా మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు వివరించారు.
చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ తొండాట..
నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. 16762 రోడ్లకు సంబంధించి 4396,65 కి.మీ మేర రోడ్ల కోసం రూ.1826.22 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటికే 55.15 శాతం పనులు పూర్తయ్యాయి. వీటితో పాటు రోడ్లపై గుంతలు పూడ్చే పనులు కూడా ముమ్మరంగా చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. 15 జులై కల్లా రోడ్లపై గుంతలు లేకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే 51.92శాతం పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు.
జగనన్న హరిత నగరాలు కార్యక్రమంపై సీఎం సమీక్ష
ఎయిర్ పోర్టుల నుంచి నగరాలకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. గన్నవరం నుంచి విజయవాడ, భోగాపురం నుంచి విశాఖపట్నంకు వెళ్లే రహదారులు అందంగా తీర్చిదిద్దాలన్నారు. నగరం అందాలను మెరుగుపరిచేలా ఉంచాలని, రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను ఇదే రకంగా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.
మురుగునీటి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ‘‘కృష్ణా గోదావరి నదులు, వాటి పంటకాల్వలు మురుగునీటి వల్ల కలుషితం అవుతున్నాయి. శుద్ధిచేసిన తర్వాతనే అవి కాల్వల్లోకి, నదుల్లోకి చేరాలి. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిపెట్టండి. ఇప్పటివరకూ చేపట్టిన పనులు, ఎక్కడెక్కడ మురునీటి శుద్ధి సదుపాయాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ పెట్టాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణతో నివేదిక సమర్పించాలని’’ సీఎం పేర్కొన్నారు. విజయవాడలో కాల్వల సుందరీకరణపైనా నివేదిక ఇవ్వాలన్నారు. పంట కాల్వల్లో చెత్త , ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరాలు, పట్టణాల్లో నిర్మాణాల్లో ఉన్న ఫ్లై ఓవర్లను, ఆర్వోబీలను సత్వరమే పూర్తి చేయాలన్నారు. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment