సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు, వీధిలైట్లు, డ్రెయినేజీల నిర్వహణకు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది. ప్రస్తుతం కొంతమేర టెక్నాలజీ వాడుతున్నప్పటికీ.. ఇకపై గుంతల గుర్తింపుతోపాటు అన్ని పనులకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా ‘యాప్’ను రూపొందిస్తున్నారు. గత వారం మునిసిపల్ విభాగంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ తరహా పనులకు డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సీఎం సూచనలకు అనుగుణంగా యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
ఉన్నతస్థాయి అధికారులు పరిశీలించేలా..
రోడ్లపై గుంతల పూడ్చివేత నుంచి రోడ్డు పక్కనున్న మొక్కలు, చెట్ల వరకు అన్ని వివరాలను ఈ యాప్‌లో పొందుపరచనున్నారు. ప్రాథమిక స్థాయిలో వార్డు సచివాలయంలోని ఎమినిటీ కార్యదర్శి వివరాలు అప్‌లోడ్ చేస్తే వెనువెంటనే స్థానిక మునిసిపల్ కమిషనర్‌తో పాటు సీడీఎంఏలోని ఉన్నతస్థాయి అధికారులు సైతం పరిశీలించేలా యాప్‌ను రూపొందిస్తున్నారు. దీనివల్ల రోడ్ల మరమ్మతుల విధానం సులభతరం అవుతుందని, రెండో దశ గుంతల పూడ్చివేతను ఈ విధానంలోనే చేపట్టనున్నామని సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ వివరించారు. మొదటి దశలో రూ.58.20 కోట్లతో మొత్తం 123 యూఎల్బీల్లో 41,412 గుంతలను పూడ్చినట్టు చెప్పారు. ఇకపై యాప్ ద్వారా రోడ్ల నిర్వహణతో పాటు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వీధిలైట్లు, డ్రెయినేజీలతో పాటు వాటిని ఆనుకుని ఉన్న చెట్లు, మొక్కలను కూడా యాప్ ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు.
అప్‌లోడ్ చేసిన వెంటనే పనులు
ప్రస్తుతం వార్డు సచివాలయం పరిధిలోని రోడ్లపై పడే గుంతలను వార్డు ఎమినిటీ కార్యదర్శి ఫొటోలు తీసుకుని, వాటిని కంప్యూటర్ ద్వారా అప్‌లోడ్ చేస్తున్నారు. వీటిని స్థానిక యూఎల్బీల్లో అధికారులు పరిశీలించి, ఉన్నతస్థాయి అనుమతి తీసుకుని పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో పనులు చేపట్టడం ఆలస్యం అవుతోంది. ఇకపై అలాంటి వాటికి తావు లేకుండా వార్డు ఎమినిటీ కార్యదర్శి ఫొటో అప్‌లోడ్ చేయగానే వెంటనే అది స్థానిక మునిసిపల్ కమిషనర్, ఇంజనీర్‌తో పాటు సీడీఎంఏలోని సంబంధిత విభాగం ఉన్నతాధికారికి చేరుతుంది.
ఫొటో సైతం ఎక్కడ తీశారో అక్షాంశాలు, రేఖాంశాలతో నమోదవుతుంది. వార్డు సచివాలయం పరిధిలో ఎన్ని కి.మీ. మేర రోడ్లు ఉన్నాయి, వాటిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఎన్ని, ఆయా మార్గాల్లోని వీధిలైట్లు, రోడ్డుకు ఆనుకుని ఉన్న మురుగు కాలువలు, మొక్కలు, చెట్లు వంటి వాటి వివరాలు సైతం అప్‌లోడ్ చేయనున్నారు. ఆయా మార్గాల్లో గుంతలు పడినా, ఎవరైనా తవ్వకాలు చేపట్టినా గుర్తించి వాటి ఫొటోలను యాప్‌లో ఉంచుతారు. ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ ఉండటంతో ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment