రూపు మారిన పురాలు | KTR Comments On Infrastructure And Urban Development | Sakshi
Sakshi News home page

రూపు మారిన పురాలు

Published Thu, Jul 6 2023 5:09 AM | Last Updated on Thu, Jul 6 2023 5:09 AM

KTR Comments On Infrastructure And Urban Development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తొమ్మిదేళ్లలో తెలంగాణలోని పట్టణాల అభివృద్ధిలో గణనీయమైన మార్పు వచ్చిందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. పురపాలక శాఖ ద్వారా రూ.1.21 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 70% పట్టణాల నుంచేనని, ఈ నేపథ్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అప్పులు తెచ్చినట్లు తెలిపారు.

మౌలిక వసతుల కోసం తెచ్చే అప్పులు భవి ష్యత్తు పెట్టుబడేనని ఆయన పేర్కొన్నారు. బుధవారం మెట్రోరైల్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తొమ్మిదేళ్లలో పురపాలక శాఖ అభివృద్ధి నివేదిక, ఎంఏయూడీ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు.  పట్టణాల అభివృద్ధిపై 2014 మొదలుకుని ప్రతి ఏటా ప్రగతి నివేదికను విడుదల చేస్తున్నామని, ఈసారి దశాబ్ది నివేదిక పేరిట 2014 నుంచి సాధించిన ప్రగతిని అందులో పొందుపరిచినట్లు తెలిపారు. 

గత పదేళ్లలో 462 శాతం ఎక్కువ వ్యయం
2004 నుంచి 2014 వరకు పట్టణాల్లో మౌలిక వసతుల కోసం చేసిన రూ.26,211.50 కోట్ల ఖర్చుతో పోలిస్తే.. గత పదేళ్లలో 462 శాతం ఎక్కువ వెచ్చించామన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన  రూ.1,21,294 కోట్లలో రూ. 1,11,360 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాగా, కేవలం రూ.9,934 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిధులని తెలిపారు. అన్ని రంగాలలో గతంలో కంటే అనేక రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని, మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన వృద్ధి సాధించామని, ఇందులో భాగంగానే 26 మున్సిపాలిటీలకు కేంద్రం అవార్డులు ఇచ్చిందని చెప్పారు.

అధిక శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే..
పదేళ్లలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల కోసం చేసిన వేల కోట్ల వ్యయంలో అధిక భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే జరిగిందని కేటీఆర్‌ వివరించారు. 2004–14 కాలంలో రూ.4,636.38 కోట్లు వెచ్చిస్తే, 2014–23 మధ్య కాలంలో రూ.44,021.99 కోట్లు వెచ్చించామని, ఇది దాదాపు 850 శాతం అధికమని అన్నారు. ౖఈ మధ్య కాలంలో జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ, హెచ్‌ఆర్‌డీసీ, ఎస్‌ఎన్‌డీపీ వంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రణాళికా బద్ధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ ద్వారా సుమారు 35 ఫ్లై ఓవర్లు నిర్మించామని, కానీ ఉప్పల్, అంబర్‌పేట ఫ్లై ఓవర్లను నేషనల్‌ హైవే అథారిటీ పూర్తి చేయలేక పోతోందని అన్నారు. 

మున్సిపాలిటీల్లో రూ.238 కోట్లతో పనులు
హైదరాబాద్‌ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో రూ.238 కోట్లతో 19 పనులు చేపట్టామని, అందులో ఏడు పనులు పూర్తి కాగా, మిగతావి కూడా వేగంగా జరిగేలా ఆదేశాలిచ్చినట్లు కేటీఆర్‌ తెలిపారు. నగరంలో ప్రధాన రహదారుల నాణ్యత పెరిగిందని, వరద ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చెరువుల సుందరీకరణను పెద్ద ఎత్తున చేపట్టామని, ఎస్‌ఎన్‌డీపీ కింద నాలాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గతంలో ముంపు వల్ల 150 కాలనీలు ఇబ్బంది పడేవని, ఎస్‌ఎన్డీపీ వల్ల ఈ బాధ తప్పిందని పేర్కొన్నారు.

2050 నాటికి నగరంలో తాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రజారవాణాను మెరుగుపర్చడంలో భాగంగా మెట్రో విస్తరణ, బస్సుల ఎలక్ట్రిఫికేషన్, పాతబస్తికీ మెట్రో కనెక్టివిటీ, భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా, నాలాల మరమ్మతు లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. శామీర్‌పేట్, మేడ్చల్‌ వైపు డబుల్‌ డెక్కర్‌ స్కైవేలు కట్టనున్నట్లు చెప్పారు. మెట్రో రైళ్లలో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement